హుజురాబాద్‌ ఉప ఎన్నిక: వెజ్‌ రూ.40.. నాన్‌వెజ్‌ రూ.100 | Huzurabad Byelection: Candidates Expenses List For Campaign | Sakshi
Sakshi News home page

హుజురాబాద్‌ ఉప ఎన్నిక: వెజ్‌ రూ.40.. నాన్‌వెజ్‌ రూ.100

Published Mon, Oct 11 2021 7:19 PM | Last Updated on Mon, Oct 11 2021 7:39 PM

Huzurabad Byelection: Candidates Expenses List For Campaign - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌ : వెజ్‌ తింటే రూ.40, నాన్‌వెజ్‌(చికెన్,మటన్‌ అంటూ పేర్కొనలేదు) తింటే రూ.100. టీకి రూ.5, టిఫిన్‌కు రూ.20.. ఇవేంటీ.. ఈ ధరలేంటనేగా మీ సందేహం. అవునండీ మీరు ఊహించింది నిజమే. అభ్యర్థుల ఖర్చును ఇలాగే లెక్కకట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌ నిర్ణయించారు. ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థుల గరిష్టవ్యయం రూ.30.80లక్షలుగా ఖరారు చేశారు. గతంలో రూ.28లక్షలుండగా రూ.2.80లక్షలు పెంచారు.

ఇక ప్రచారంలో వినియోగించే టోపీలు, కండువాల నుంచి సభల్లో వినియోగించే టెంట్లు, లౌడ్‌ స్పీకర్లు, డోలు కళాకారులు, దప్పుల కళాకారులు, కళాబృందాల వరకు వ్యయాన్ని నిర్ణయించింది. ఫంక్షన్‌ హాళ్లు, ఏసీ, నాన్‌ఏసీ, పాంప్లెంట్లు, వీడియో గ్రాఫర్స్, టీ షర్టులు, ఫైర్‌ క్రాకర్స్‌ ఇలా అన్నింటికి ధరలను ఖరారు చేసింది. ఖరారు చేసిన ధరల వివరాలను శుక్రవారం పార్టీల అభ్యర్థులకు సూచించింది. ఇకపై ఇవే ధరలను బట్టి అభ్యర్థుల వ్యయాన్ని ఎన్నికల డైరీలో నమోదు చేయడం సుస్పష్టం.
చదవండి: Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..!

అభ్యర్థులు జర జాగ్రత్తా
పోటీచేసే అభ్యర్థి తన ఎన్నికల ఏజెంట్‌ పేరున బ్యాంకులో జాయింట్‌ ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థి సొంత డబ్బు అయినా, పార్టీ లేదా దాతలు ఇచ్చిన డబ్బులు అయినా సరే అందులోనే వేసి రోజువారీగా డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఆ ఖర్చు కూడ రూ.30.80లక్షలకు మించకూడదు. అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో అధికారులు ప్రతి అభ్యర్థికి ఒక పుస్తకాన్ని అందజేస్తారు. అందులో ఒక పేజీలో నగదు వివరాలు, రెండో పేజీలో బ్యాంకు ఖాతాలోని నిల్వ, మూడో పేజీలో ఖర్చుల వివరాలు రాయాలి. అభ్యర్థి లేదా అతను నియమించుకున్న ఏజెంట్‌ ఏ రోజుకారోజు ఆ వివరాలను ఆ పుస్తకంలో రాయాలి.
చదవండి: Huzurabad Bypoll: సింబల్‌ హడల్‌!

మూడు సార్లు లెక్క చూపాల్సిందే
ప్రతి అభ్యర్థి పోలింగ్‌ ముగిసే లోపు మూడు సార్లు ఖర్చుల వివరాలను బిల్లులతో సహా ఎన్నికల అధికారి కార్యాలయంలోని అకౌంట్స్‌ విభాగంలో సమర్పించాలి. వీటి ఆధారంగా ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత ఖర్చు చేయవచ్చన్నది వారు సూచిస్తారు. అభ్యర్థి చూపని ఖర్చు ఏదైనా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువస్తే వారు ఆ ఖర్చును అభ్యర్థి ఖర్చు ఖాతాలో రాసి లెక్కిస్తారు. నిర్ణీత సమయాల్లో ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూపనట్లయితే అభ్యర్థులకు ఇచ్చిన వాహనాల అనుమతి, ప్రదర్శనలు, సభలు రద్దు చేసే అధికారం ఉంటుంది.

మాధ్యమాల ఖర్చు లెక్కలోకే
పత్రికలు, టీవీ ఛానెళ్లలో ఇచ్చే ప్రకటనలు, చెల్లింపు వార్తల ఖర్చులను అభ్యర్థుల ఖర్చు ఖాతాలోనే జమ చేస్తారు. ఈ ఖర్చులను పరిశీలించేందుకు జిల్లా ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా మానిటరింగ్‌ సెల్‌ వీటిని పర్యవేక్షిస్తుంది.

నిర్ణయించిన ధరల వివరాలిలా..
► లౌడ్‌ స్పీకర్లు విత్‌ అంప్లిఫైర్, మైక్రోఫోన్‌ రోజుకు రూ.600(వంద వాట్స్‌), రూ.1500(200వాట్స్‌), టెంటుకు సైజును బట్టి రూ.2వేల నుంచి 2800, క్లాత్‌ బ్యానర్‌(స్కె్వర్‌ ఫీటుకు) సైజును బట్టి రూ.8 నుంచి రూ.12 వరకు, క్లాత్‌ ఫ్లాగ్స్‌కు రూ.65, ప్లాస్టిక్‌ ఫ్లాగ్స్‌కు రూ.350, పోస్టర్స్‌ విత్‌ మల్టీకలర్స్‌ సైజును బట్టి రూ.8వేల నుంచి రూ.70వేల వరకు. 
► హోర్డింగ్స్‌కు అన్ని కలిపి రూ.9500ల నుంచి రూ.11వేలు, కటౌట్‌ స్క్వేర్‌ ఫీటుకు రూ.90, వీడియో మేకింగ్‌ చార్జీ(ఒక రికారి్డంగ్‌) రూ.10వేలు, ప్రచార రథం(ఆడియో)  ఒక  రికార్డింగ్‌కు రూ.5వేలు. 
► అద్దె వాహనాలకు సంబంధించి జీపు, టెంపో, ట్రకెట్, సుమో, క్వాలీస్‌కు రోజుకు రూ.1700, ట్రాక్టర్‌కు రూ.1500, ఇన్నోవా రూ.2200, మిని బస్‌ రూ.2500, కారు రూ.1400, త్రీవిలర్స్, ఆటో రిక్షా రూ.450, బత్త చార్జీ డ్రైవర్‌కు ఒక రోజుకు రూ.400. 

► హోటల్‌ రూం, గెస్ట్‌ హౌస్‌అద్దెకు సంబంధించి డీలర్స్‌ పర్‌డే రూ.2వేలు, నార్మల్‌ పర్‌ డే రూ.వెయ్యి, ఫర్నీచర్‌ అద్దెకు సంబంధించి ప్లాస్టిక్‌ ఛైర్‌ రూ.7, వీఐపీ ఛైర్‌ రూ.75, సోఫా రూ.350, టేబుల్‌ రూ.50, వీడియో ప్రొజెక్టర్‌ పర్‌డే రూ.1500, కండువా రూ.15, టోపీ రూ.20. 
► కళాబృందాలు ఒక్కొక్కరికి రూ.500, డోలు ఆర్టిస్ట్‌కు రూ.500, దప్పులు ఆర్టిస్ట్‌కు రూ.500, ద్విచక్రవాహనం రూ.200, ఫంక్షన్‌ హాల్‌ విత్‌ ఏసీ రూ.10వేలు, నాన్‌ ఏసీ రూ.5వేలు, వీడియో గ్రాఫర్‌ ఛార్జీ రూ.1500, పాంప్లెంట్లు(చిన్నవి) వెయ్యికి రూ.250, పెద్దవి వెయ్యికి రూ.500.
► స్నాక్స్‌కు సంబ«ంధించి ఒక పెద్ద సమోసాకు రూ.12, చిన్న సమోసాకు రూ.3, సాఫ్ట్‌ డ్రింకు రూ.10, లస్సీ రూ.5, టీ షర్ట్‌ రూ.100, బలూన్‌ ప్యాకెట్‌ పర్‌ ప్యాకెట్‌ రూ.150, ఫైర్‌ క్రాకర్స్‌ పర్‌ కేజీ రూ.300, ప్లకార్డు ఎ3 రూ.20, ఎ4 రూ.12, గర్లాండ్‌ స్మాల్‌ రూ.50, గజమాల రూ.800, చిన్న ఫ్లాగ్‌ రూ.30, పెద్ద ఫ్లాగ్‌ రూ.100, రెడ్‌ కార్పెట్‌ రూ.300, గ్రీన్‌ కార్పెట్‌ రూ.500, ఫ్యాన్‌ రూ.100, కూలర్‌ రూ.300, ఎల్‌ఈడీ స్క్రీన్‌ సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.లక్ష, ఎల్‌ఈడీ స్క్రీన్‌ విత్‌ సౌండ్‌ సిస్టమ్,జనరేటర్, వెహికిల్‌ సైజును బట్టి రూ.15వేల నుంచి రూ.1.20లక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement