కేంద్రంలోని అధికార బీజేపీతో తెలుగుదేశం నాలుగేళ్ల సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి ఆంధ్రలో ఎన్నికల నగారా అనధికారంగా మోగి వివిధ రాజకీయ పార్టీల మధ్య పోరు ప్రారంభమైనట్లే. తమిళనాడులో జయలలిత మరణించినప్పటి నుంచే ఎన్నికల పర్వానికి తెరలేచింది. తొలుత అధికార అన్నాడీఎంకేలో జయలలిత నెచ్చెలి శశికళకు అప్పటి ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గానికి మధ్య జరిగిన పోరాటం, ఆ నేపథ్యంలో జరిగిన వివిధ నాటకీయ పరిణామాలు ప్రజాస్వామ్యంలో అనేక విస్మయాత్మక సంఘటనలకు దారితీశాయి. అధికారం కోసం, అన్నిరకాల ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి అన్ని పార్టీలు చేసిన విన్యాసాలను తమిళ ప్రజలు మౌనంగా వీక్షించారు.
నటుల అరంగేట్రం
జయలలిత ఉన్నంతకాలం రాజకీయాల వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించని సినీ హీరోలు, కమల్‌హాసన్, రజనీకాంత్.. ఆమె మరణించిన వెంటనే ఆ నాయకత్వ శూన్యం భర్తీకి ఆమె వారసత్వాన్ని తమ సినీ గ్లామర్‌తో చేజిక్కించుకోవాలని రంగ ప్రవేశం చేశారు. అలాగే విజయకాంత్, అంబుమణి రామదాస్, వై గోపాలస్వామి వంటి వారు కూడా తమ బలం కూడదీసుకుని ప్రజల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. జల్లికట్టు ఆందోళన కమల్ హాసన్‌కు వేదికగా మారగా, తరువాత అభిమానుల ఒత్తిడితో, అజ్ఞాతంగా జాతీయ పార్టీ ప్రేరణతో రజనీకాంత్ కూడా రంగంలోకి దిగారు. అన్నాడీఎంకే ఏర్పడినప్పుడు ఎంజీఆర్, ఆ తరువాత జయలలితను వరించినట్లే తమను కూడా ప్రజలు వరిస్తారనే నమ్మకం, ఆశతో వారు రాజకీయ ప్రవేశం చేశారు. తప్పులేదు. కానీ కరుణానిధి వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనడానికి ఎంజీఆర్, జయలలిత ఎంత కృషి చేశారో, ఎన్ని ఆటుపోట్లను తట్టుకున్నారో వారికి తెలియదు. అప్పటికి ఇప్పటికి తరాలలో వచ్చిన అంతరాలు, ప్రజలలో పరిణతి కారణంగా కమల్, రజనీల ప్రయత్నాలు నల్లేరు మీద నడకలాగా సాగే పరిస్థితి లేదు.
రాజకీయ శూన్యం
పాలనాదక్షత, రాజకీయానుభవం, ప్రజల మద్దతు కలిగిన నేతలను కోల్పోయి అటు అన్నాడీఎంకే ఇటు డీఎంకే తమ బలంపై కాక ఎదుటి వారి బలహీనతతో అధికారాన్ని దక్కించుకోవాలనే నిరాశాపూరితమైన ప్రయత్నాలు చేస్తూ బరిలో నిలిచాయి. ఉభయ పార్టీలలోని ముఠా తగాదాలు, వర్గపోరు, ఒక వ్యూహాత్మక పంథాను అనుసరించడానికి వీల్లేని పరిస్థితిని కల్పించాయి. అన్నాడీఎంకేలో శశికళ, దినకరన్ ముఠా, పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాల కుమ్ములాటలు జయలలిత మరణానంతరం రాజకీయాలను ప్రభావితం చేస్తే, డీఎంకేలో అళగిరి, స్టాలిన్ వర్గాల మధ్య వారసత్వ పోరు కరుణానిధి ప్రాణాలు వదిలే వరకు కొనసాగింది. అందుకే, అన్నాడీఎంకేలో చీలిక రాజకీయాలను ప్రజలు అసహ్యించుకున్నా డీఎంకే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజాభిమానం పొందడంలో విఫలమైంది. తండ్రి పాలనాదక్షత కానీ, నాయకత్వ లక్షణాలు కానీ అంతగా లేని స్టాలిన్ తనపై గతంలో వచ్చిన అవినీతి నేరారోపణలు, గత చరిత్రను ప్రజలు మరిచిపోయే వాతావరణం కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ ఇంకా ఇతర ప్రతిపక్షాలతో జతకట్టి పోరాడుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వారి కూటములలో చిన్న పక్షాలకు సీట్లు కేటాయించడంలో ఎదురైన సవాళ్లు అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యానికి, ఉత్కంఠకు దారితీసింది.
ఇష్టానుసారం ఎడాపెడా హామీలు..
ఎన్నికల ప్రణాళికల విడుదలలో ప్రత్యర్థుల మేనిఫెస్టోలు వచ్చాక మనం విడుదల చేద్దామనే వ్యూహం అందరి సహనానికి పరీక్షగా మారింది. తమిళనాడులో ఇంతవరకు అన్నాడీఎంకే, డీఎంకే, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలే మేనిఫెస్టోలను విడుదల చేశాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేశాయి. అన్నాడీఎంకే తరఫున పన్నీరుసెల్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో అమ్మ జాతీయ పేదరిక నిర్మూలన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించింది. విద్యార్థులకు విద్యా రుణాలను, సన్న, చిన్నకారు రైతుల రుణాలను రద్దు చేస్తామని నేరుగా ప్రకటించకుండా ఈ మేరకు కేంద్రాన్ని అర్థిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ నుంచి హామీ పొంది అన్నాడీఎంకే ప్రణాళికను సిద్ధం చేసుకుందని ఒక రాజకీయ పరిశీలకుడు చమత్కరించారు. డీఎంకే విద్య, సన్న–చిన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో పాటు ఆదాయ పన్ను పరిమితిని రూ 8 లక్షలకు, మహిళలు, వికలాంగులకు రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అన్నాడీఎంకేలా స్టాలిన్ ఆదాయ పన్ను విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామనే పదాన్ని కనీసం వాడలేదు. అమాయకులు, నిరక్షరాస్యులు నిజమని నమ్మి ఓటేస్తారని స్టాలిన్ అనుకుంటున్నట్లున్నారు. లేకపోతే కేంద్రానికి సంబంధించిన అంశంపై డీఎంకే ఇలా ఎలా హామీనిస్తుంది?’ అని కులశేఖరన్ అనే అన్నాడీఎంకే మద్దతుదారు ఒకరు వ్యాఖ్యానించారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ‘నీట్’ రద్దు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలలో మహిళలకు ఉపాధి కల్పనకు రూ 50,000 మంజూరు, సీఎస్‌ఆర్ కింద ప్రైవేట్ కంపెనీలలో నెలకు రూ.10,000 జీతంతో 50 లక్షల మందికి ఉపాధికల్పన వంటివి డీఎంకే ఓటర్లను ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన మరికొన్ని అంశాలు. కేంద్రం తరఫున డీఎంకే మేనిఫెస్టో ఇచ్చిన మరొక హామీ ఏమిటంటే వ్యవసాయ రంగానికి ప్రత్యేక కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని. కనీసం ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పినా కొంత అర్థవంతంగా ఉండేది. అలాగే విద్యారుణాల మాఫీ కూడా రాష్ట్ర పరిధిలో లేదు.
రాజీవ్ హంతకుల విషయంలో ఏకాభిప్రాయం
రెండు పార్టీలు శ్రీలంక సమస్య, రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదల డిమాండ్ గురించి ఇంచుమించు ఒకే స్వరాన్ని వినిపించాయి. తమిళుల మనోభావాలకు దగ్గర కావడానికి ద్రావిడ పార్టీలు ఈ విషయంలో ఏకాభిప్రాయంతోనే వున్నాయి. డీఎంకే ప్రత్యేకంగా ఇచ్చిన హామీ ఏమిటంటే గతంలో కుదిరిన ఇండో– శ్రీలంక ఒప్పందం ప్రకారం శ్రీలంక శరణార్థులకు భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడం. రిజర్వేషన్లకు సంబంధించి శ్రీరంగనాథ మిశ్రా, సచార్ కమిషన్ల సిఫార్సులను అమలు చేస్తామని, ఎల్పీజీ సబ్సిడీని రద్దుచేసి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని కూడా డీఎంకే హామీ ఇచ్చేసింది. శ్రీలంక యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తునకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అన్నాడీఎంకే ఇలా హామీలు ఇవ్వడంలో సాధ్యాసాధ్యాలను యోచించినట్లు కనిపిస్తోంది. అది డీఎంకే ప్రణాళికలో కనిపించదు.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఒంటరిగా పోటీకి దిగిన మక్కల్ నీతి మయ్యాం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్ తొలి జాబితాలో కొత్త వారిని బరిలోకి దింపి ఆసక్తిని పెంచారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ రైతులకు వందశాతం లాభాలు 50 లక్షల కొత్త ఉద్యోగాలు వంటి అంశాలను ప్రస్తావించారు. అన్నాడీఎంకేలో అటు పన్నీరుసెల్వం ఇటు పళనిస్వామికి సవాలుగా నిలిచిన దినకరన్ పార్టీ ‘అమ్మ మున్నేట్ర కజగ’ ఇంతవరకు ఎన్నికల కమిషన్ వద్ద నమోదు కాలేదు. తనకు కేటాయించిన కుక్కర్ గుర్తును పార్టీకీ వర్తించేలా చేసుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఆ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులందరినీ ఇండిపెండెంట్లుగా పరిగణించాల్సిన పరిస్థితి. ఎంజీఆర్ ఆశయ సాధన కోసమంటూ నంబియార్ అనే వ్యక్తి స్థాపించిన అఖిలభారత ఎంజీఆర్ మ్యూన్త్ర కజగం పార్టీకి ఎన్నికల కమిషన్ రెండు వీధి దీపాలున్న స్తంభం గుర్తు కేటాయించింది. జయలలిత మేనకోడలు దీప అన్నాడీఎంకేలో చేరి జయలలిత ఆశయాలకు కృషి చేస్తానని ప్రకటించింది.
డేట్‌లైన్ చెన్నై ఎస్.వి.సూర్యప్రకాశరావు
రచయిత చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్. మనీవైస్ ఇంగ్లిష్ పత్రిక కన్సల్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment