స్టాలిన్ , సోనియా
సాక్షి, చెన్నై: ఎన్నికల ఫలితాల రోజున ఢిల్లీలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల భేటీకి రావాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు పిలుపు వచ్చింది. స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ ఈ ఆహ్వానాన్ని స్టాలిన్‌కు పంపినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆ రోజున జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుందామన్నట్టుగా స్టాలి¯Œన్ దృష్టికి సోనియాగాంధీ తీసుకొచ్చి నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలో వేలూరు మినహా తక్కిన 38 లోక్‌సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మరో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఆదివారం ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో డీఎంకేకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా సర్వేలు మొదటి నుంచి పేర్కొంటున్నాయి. లోక్‌సభలో డీఎంకే కూటమి అధిక స్థానాల్లో పాగా వేయడం ఖాయం అన్న ధీమా నేతల్లో నెలకొంది. ›ప్రధానంగా డీఎంకే పోటీ చేసిన 20 స్థానాల్లో, ఆ పార్టీ చిహ్నంతో పోటీ చేసిన మరో నాలుగు స్థానాల్లో మెజారిటీ సీట్లలో గెలుపు ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. అలాగే, కాంగ్రెస్ పోటీ చేసిన పది స్థానాలు కనీసం ఐదు గ్యారంటీ అన్న సంకేతాలు జోరందుకుని ఉన్నాయి. అలాగే, ఉప ఎన్నికల్లో డీఎంకే క్లీన్‌స్వీప్ చేసినా చేయవచ్చన్న ప్రచారం జోరందుకుని ఉండడంతో అన్నాడీఎంకే పాలకుల్లో ఉత్కంఠ బయలుదేరింది. సర్వేలు, ధీమాలు, ప్రచారాలు ఓ వైపు ఉంటే, ఈనెల 23న వెలువడే ఫలితాల మేరకు ఏవరి బలం ఎటో, ఓటరు మద్దతు ఎవరికో అన్నది స్పష్టం కానుంది. ఈ లోపు సర్వేలు, సంకేతాల మేరకు డీఎంకేను తమతో కలుపుకునేందుకు తగ్గట్టుగా కొన్ని పార్టీలు ప్రయత్నాల్ని వేగవంతం చేశాయి. ఆదిశగా దేశ వ్యాప్తంగా గుణాత్మక మార్పు, ప్రాంతీయ పార్టీల ఏకం అన్న నినాదంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సైతం ఆయన రెండు రోజుల క్రితం చెన్నైలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సానుకూలత అన్నది ఉన్నా, రాష్ట్రంలో అన్నాడీఎంకే సర్కారు పతనం లక్ష్యంగా కాంగ్రెస్ మద్దతు తమకు తప్పనిసరి కావడంతో డీఎంకే ఆచితూచి అడుగులు వేసే పనిలో నిమగ్నమైంది.
సోనియా ఆహ్వానం
కేసీఆర్ ప్రయత్నం ఓ వైపు సాగుతుంటే, మరో వైపు దేశవ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీలను ఏకం చేయడానికి తగ్గట్టుగా కాంగ్రెస్ మరో ప్రయత్నం చేపట్టింది. ఇన్నాళ్లు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యూహాలకు పదును పెడుతుంటే, తాజాగా సీనియర్‌నాయకురాలు సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. కేంద్రంలో మళ్లీ మోదీ సర్కారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు దేశవ్యాప్తంగా ప్రతి పక్ష పార్టీలకు ఆహ్వానం పలికే పనిలో సోనియాగాంధీ ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో గురువారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు సోనియాగాంధీ స్వయంగా ఆహ్వానం పలికినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఇది లేఖ ద్వారానా లేదా, ఫోన్ ద్వారానో సంప్రదింపులు జరిగినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 23న ఢిల్లీలో జరగనున్న ప్రతి పక్ష పార్టీల సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని స్టాలిన్‌కు సోనియాగాంధీ ఆహ్వానం పలికి ఉన్నారని, ఈ సమావేశానికి స్టాలిన్ వెళ్తారా లేదా, డీఎంకే తరఫున ప్రతినిధి హాజరవుతారా అన్నది వేచి చూడాల్సి ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు కారణం, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల మేరకు తదుపరి అడుగులు, వ్యూహాలకు పదును పెట్టే దిశగా స్టాలిన్ చెన్నైలోనే ఉండాల్సిన అవసరం ఉందంటూ డీఎంకే నేత ఒకరు పేర్కొన్నారు. అయితే, జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పడం లక్ష్యంగా ఉన్న స్టాలిన్ ఆ సమావేశానికి పార్టీ నేతలు కనిమొళి, టీఆర్ బాలు, రాజాలతో కలిసి స్టాలిన్ వెళ్లేందుకు ఆస్కారం ఉందని మరో నేత పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment