సాక్షి, తమిళనాడు: దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన నర్రేంద మోదీపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తరువాత అంతటి చరిష్మా గల నాయకుడు మోదీ అని వర్ణించారు. మోదీ గెలుపును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని ఆయన కోరారు. ఈనెల 30న రెండోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తాను కూడా హాజరవుతున్నానని రజనీ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. తమిళనాడులో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పరాజయం పాలైనంత మాత్రానా రాహుల్ రాజీనామా చేస్తాననటం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమన్నారు. అధికార పక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
కాగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కూటమి కట్టిన బీజేపీ బొక్క బోర్లా పడ్డ విషయం తెలిసిందే. కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. రజనీతో మరో తమిళ నటుడు, మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైయ్యే అవకాశం ఉంది. వీరిద్దరిని మోదీ స్వయంగా ఆహ్వానించారు. దీనిపై కమల్ ఇప్పటివరకూ స్పందిచలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన కమల్ పార్టీ.. ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment