బహుజన హితాయ సర్వజన సుఖాయ | History of Political Parties BSP Party Profile | Sakshi
Sakshi News home page

బహుజన హితాయ సర్వజన సుఖాయ

Published Thu, Mar 21 2019 11:11 AM | Last Updated on Thu, Mar 21 2019 11:11 AM

History of Political Parties BSP Party Profile - Sakshi

1989 అలహాబాద్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు కాన్షీరామ్‌ పోటీ చేయడంతో ఈ పార్టీకి మొదటిసారి విశేష ప్రచారం లభించింది. అప్పటికే దళితులు, బీసీలు, మైనారిటీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యంతో పాటు వారి ప్రయోజనాలు కాపాడే పార్టీగా జాతీయ స్థాయిలో పరిచయమైంది. మాజీ ప్రధాని వీపీ సింగ్, కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ శాస్త్రిపై పోటీచేసి అలహాబాద్‌లో కాన్షీరామ్‌ దాదాపు 70 వేల ఓట్లు తెచ్చుకుని సంచలనం సృష్టించారు. సమాజంలో మెజారిటీగా ఉన్న (85 శాతం) వర్గాల అభివృద్ధికి పాటుపడే పార్టీగా బీఎస్పీ స్థాపించిన కొన్నేళ్లకే ఉత్తరాదిలో ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో షెడ్యూల్డ్‌ కులాలు, వెనుకబడిన కులాలను ఆకట్టుకోగలిగింది.

పంజాబ్‌లోనే బీజం
పంజాబ్‌ దళిత (చమార్‌) సిక్కు కుటుంబంలో పుట్టిన కాన్షీరామ్‌ పుణేలోని రక్షణశాఖ కంపెనీలో పనిచేస్తూనే ఎస్సీ, బీసీ ఉద్యోగులను సమీకరిస్తూ బడుగు వర్గాలను సంఘటితం చేసేవారు. మొదట దళితుల పార్టీగా పేరున్న రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ)కి మద్దతు పలికారు. ఈ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో విసుగెత్తి కొత్త సంస్థ స్థాపనకు నడుం బిగించారు. ఈ క్రమంలో 1978లో ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఎస్సీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల కోసం బామ్‌సెఫ్‌ అనే సంస్థను, 1981లో దళిత్‌ సోషిత్‌ సమాజ్‌ సంఘర్‌‡్ష సమితి (డీఎస్‌4) ప్రారంభించి దళిత ఓటర్లను సమీకరించారు. 1984 ఏప్రిల్‌ 14న (బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి) బీఎస్పీని స్థాపించారు. అలహాబాద్‌ ఉప ఎన్నిక ముందు 1984 ఎన్నికల్లో జాంజిగిర్‌–చాంపా (ఛత్తీస్‌గఢ్‌), తర్వాత 1989లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీకి ఎక్కువ ఆదరణ లభించడంతో వేగంగా రాష్ట్రమంతటా విస్తరించింది. ఘర్షణపడే దళితులు, బీసీలను ఏకం చేయడంలో యూపీకే చెందిన యువ నాయకురాలు మాయావతి చాలా వరకు విజయం సాధించారు.

మూడు సీట్లు.. 2 శాతం ఓట్లు
పార్టీ స్థాపించిన ఐదేళ్లకు 1989 లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు బీఎస్పీ సాధించింది. 1990లో సంక్షోభంలో పడిన వీపీ సింగ్‌ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఇవ్వడానికి కాన్షీరామ్‌ నిరాకరించారు. పదేపదే ఎన్నికలొస్తే తమ పార్టీకి ప్రయోజనకరమని ఆయన ప్రకటించారు. అయితే 1991 లోక్‌సభ, యూపీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో బీఎస్పీకి పాత సంఖ్యలోనే (3 లోక్‌సభ, 12 అసెంబ్లీ) సీట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గింది.

‘బాబ్రీ’ తర్వాత పెరిగిన బలం
బాబ్రీ మసీదు కూల్చివేశాక 1993లో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ములాయంసింగ్‌ యాదవ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పెట్టుకున్న పొత్తు బీఎస్పీ బలం పెరగడానికి ఉపకరించింది. బీఎస్పీ 19.6 శాతం ఓట్లతో 67 సీట్లు.. మిత్రపక్షం ఎస్పీ 17.9 శాతం ఓట్లతో 109 సీట్లు కైవసం చేసుకున్నాయి. ములాయం ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణానికి కాంగ్రెస్, జనతాదళ్‌ బయటి నుంచి మద్దతు ఇచ్చాయి.

మాయావతిపై దాడితో మలుపు
1995 మేలో ములాయం సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. ఆ సమయంలో లక్నో గెస్ట్‌హౌస్‌లో ఉన్న మాయావతిపై ఎస్పీ గూండాలు జరిపిన దాడితో రెండు పార్టీలూ 2018 చివరి వరకూ వైరిపక్షాలుగా మారిపోయాయి. ములాయం రాజీనామా చేశాక బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇలా అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీతో కాన్షీరామ్‌ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయించడం సంచలనమే అయింది. తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం, 1996 మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్లీ ఆ పార్టీతోనే చేతులు కలపడం (1997), ఆరు నెలలకు కాషాయ పక్షానికి దూరం కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇలా మాయావతి రెండుసార్లు సీఎం అయ్యారు. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి కాంగ్రెస్‌ జూనియర్‌ భాగస్వామిగా మారి శాశ్వతంగా బలహీనమైంది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 98 సీట్లు గెలిచిన బీఎస్పీకి బీజేపీ (88), ఇతర చీలిక వర్గాలు మద్దతు ఇవ్వడంతో మాయావతి మూడోసారి ముఖ్యమంత్రి అయినా ఆరు నెలలకే రాజీనామా చేశారు. ఈ కాలంలోనే బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల నేతలను బీఎస్పీలోకి ఆకర్షించే ప్రయత్నంలో మాయావతి విజయం సాధించారు.

2003లో కాన్షీరామ్‌ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మాయావతి పార్టీ జాతీయ అధ్యక్షురాలయ్యారు. మాయావతి కులమైన చమార్లు (జాటవ్‌లు), ఇతర దళితులు, యాదవేతర బీసీలతోపాటు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ప్రజల ఆదరణ లభించడంతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తొలిసారి సంపూర్ణ మెజారిటీ లభించింది. దీంతో మాయావతి పూర్తిగా ఐదేళ్లు పదవిలో కొనసాగారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి బీఎస్పీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బీఎస్పీ మూడో స్థానానికి (19 సీట్లు) దిగజారింది. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి దాదాపు 20 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటూ గెలవలేదు. బీజేపీ దూకుడుతో భయపడి ఎస్పీ, బీఎస్పీలు తమ ఉనికి కాపాడుకోవడానికి 2018లో మూడు యూపీ లోక్‌సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో చేతులు కలిపాయి. ములాయం స్థానంలో ఆయన కొడుకు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఎస్పీ అధ్యక్షుడు కావడం కూడా రెండు పార్టీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకోవడానికి దోహదం చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో చేతులు కలిపి యూపీలో చేస్తున్న మాయావతి ప్రయోగం బీఎస్పీకి గట్టి పరీక్షే. 35 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావచ్చనే సిద్ధాంతంతో బయల్దేరిన బీఎస్పీ ‘బహుజన హితాయ’ నినాదం నుంచి ‘సర్వజన హితాయ సర్వజన సుఖాయ’ అనే కొత్త నినాదంతో అన్ని సామాజిక వర్గాలను ఆకుట్టుకోవాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు.

లోక్‌సభలోబీఎస్పీ సీట్లు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement