Political Party Profile
-
దక్షిణం గాలి ఎటువైపు? ఆప్ దెబ్బకు బీజేపీ ఆశలు గల్లంతేనా?
దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? అధికార బీజేపీ ఆశల్ని ఆప్ గల్లంతు చేస్తుందా? జీఎస్టీపై గుర్రుగా ఉన్న వ్యాపారులు బీజేపీని కాదని ప్రత్యామ్నాయం వైపు చూస్తారా ? ఆదివాసీ ప్రాంతాల్లో పట్టున్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ...? దక్షిణ గుజరాత్ భరూచ్, నర్మద, తాపి, దాంగ్, సూరత్, వల్సద్, నవ్సారి జిల్లాలతో కూడుకొని ఉంది. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్ జరిగే 89 స్థానాల్లో 35 దక్షిణ గుజరాత్లో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంపై బాగా దృష్టి పెట్టాయి. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలు వ్యాపారవేత్తలతో నిండిపోయి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 35 స్థానాలకు గాను 25 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 2 నెగ్గింది. ఈసారి ఆప్ రాకతో దక్షిణ గుజరాత్లో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివాస ప్రాబల్య ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ విద్యావంతులు కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ పాలనకు ఆకర్షితులవుతున్నారు. సూరత్ వ్యాపారులూ కీలకమే సూరత్‌లో వస్త్ర వ్యాపారులు జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నారు. కరోనా, జీఎస్టీ, పెరిగిన ధరలతో ఈసారి దీపావళి సీజన్లో వస్త్ర వ్యాపారం 60% తగ్గిపోవడంతో వారిలో భవిష్యత్‌పై బెంగ మొదలైంది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమం, అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 15 నెగ్గింది. ఆదివాసీ ప్రాబల్యమున్న మాండ్విలో మాత్రమే ఓడింది. ఈసారి ఆప్ ప్రభావం బాగా ఉండేలా ఉంది. గతేడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 సీట్లు నెగ్గింది. హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం కలిసొచ్చే అంశమే అయినా ఆయన అనుచరులు తదితరులంతా ఆప్‌లో చేరారు. చిన్న పరిశ్రమల హబ్ దక్షిణ గుజరాత్లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగానున్న పరిశ్రమల్లో 50శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పెట్టుబడుల్లో 33%, ఈ ప్రాంతంలోనే పెడుతున్నారు. ఉపాధి అవకాశాల్లో 43% ఇక్కడి పరిశ్రమలే కల్పిస్తున్నాయి. టెక్స్టైల్, డైమండ్ కటింగ్, పాలిజింగ్, కెమికల్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ, ప్లాస్టిక్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. నాలుగు రేవు పట్టణాలతో కనెక్ట్ అయి ఉంది. రాష్ట్ర జనాభాలో 20% (1.2 కోట్లు) మంది దక్షిణ గుజరాత్‌లోనే నివసిస్తారు. ఈ ప్రాంతంలో వ్యాపారులందరూ జీఎస్టీపైనా, పెరిగిపోయిన విద్యుత్ బిల్లులపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఆదివాసీల ఆందోళనలు దక్షిణ గుజరాత్లో 14 ఎస్టీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీజేపీ 5 మాత్రమే నెగ్గింది. ఈసారి అన్ని కూడా రావంటున్నారు. సర్–తాపి–నర్మద నది లింకింగ్ ప్రాజెక్టు, వేదాంత జింగ్ స్మెల్టర్ ప్లాంట్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం తమ భూముల్ని కొల్లగొడుతోందన్న ఆగ్రహంతో గిరిపుత్రులు చేసిన ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. వన్సాదా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రభుత్వానికి కంటీ మిద కునుకు లేకుండా చేస్తోంది. అభివృద్ధి గురించి ఆదివాసీలకు వివరించి వారి ఆదరణ పొందడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ వదిలేసిన ఆదివాసీలకు స్వయంపాలన అధికారాన్ని కట్టబెట్టే పంచాయతీ విస్తరణ చట్టాన్ని అమలు చేస్తామన్న ఆప్ హామీ వారిని అధికంగా ఆకర్షిస్తోంది. ‘‘దక్షిణ గుజరాత్లో ఆదివాసీలు, వ్యాపారులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. వేదాంత రసాయన ఫ్యాక్టరీ వారి భూముల్ని, నీటిని విషతుల్యం చేస్తుందన్న ఆందోళన నెలకొంది. వారికి ఆప్ ఆశాదీపంలా కనిపిస్తోంది’’ అని ఎన్నికల విశ్లేషకుడు అమిత్ ధోల్కాయి అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటుకు పొత్తు పోటు
ప్రస్తుతం ఎన్నికలంటే.. కుల సమీకరణలు.. పొత్తుల కుంపట్లు.. పొత్తులే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయనేది పార్టీల నిశ్చితాభిప్రాయం. అయితే, ఈ పొత్తులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయా? ఓట్లు కురిపిస్తాయా? అనేది దశాబ్దాలుగా ఎన్నికల విశ్లేషకులను వేధించే ప్రశ్న. ఈసారి కూడా పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్న పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల మద్దతుదారుల ఓట్లు ఎంత వరకు బదిలీ అవుతాయో చెప్పడం కష్టం. అన్ని పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులు తమ అభ్యర్థులు లేనిచోట్ల మిత్రపక్షాల అభ్యర్థులకు ఓట్లు ఒకే తీరున వేయరని గతానుభవాలు చెబుతున్నాయి. ఫలించని తొలి పొత్తు ఉత్తరప్రదేశ్‌లో 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు, బీఎస్పీ నేత కాన్షీరామ్ సమక్షంలో బీఎస్పీ 310, కాంగ్రెస్ 115 సీట్లకు పోటీచేయడానికి పొత్తు కుదిరింది. రెండు పార్టీలకు కలిపి వంద సీట్లే దక్కాయి. కారణం.. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడమే. కాంగ్రెస్‌కు బీఎస్పీకి చెందిన దళితులు, బడుగువర్గాల ఓట్లు పడినా కానీ బీఎస్పీకి కాంగ్రెస్ మద్దతుదారులైన బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు బదిలీ కాలేదు. ‘కాంగ్రెస్‌కు తన ఓట్లను మిత్రపక్షాలకు బదిలీ చేసే శక్తి లేదు. ఇక నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు’ అని కాన్షీరామ్ ప్రకటించారు. ఆయన మాట ప్రకారం మొన్నటి వరకూ నడుచుకున్న పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యాదవులు, ఇతర బీసీల్లో పట్టున్న ఎస్పీ ఓట్లు దళితుల పార్టీగా ముద్రపడిన బీఎస్పీ అభ్యర్థులకు ఏ మేరకు పడతాయో చెప్పలేని స్థితి. ‘తన మిత్రపక్షాలకు ఓట్లను బదిలీ చేయగలనని ధైర్యంగా చెప్పుకోగల పార్టీ బీఎస్పీ ఒక్కటే. ఇతర పార్టీలు గరిష్ట స్థాయిలో తమ ఓట్లను బదిలీ చేయలేవు’ అని ఎన్నికల విశ్లేషకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. పొత్తులతో మొదటికే మోసం? తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పార్టీల మధ్య పొత్తులే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలో మిత్రపక్షాల మధ్య, అవసరం కొద్దీ శత్రుపక్షాల మధ్య పొత్తులు కుదురుతుంటాయి. భావ సారూప్యత, ఒకే రకమైన సామాజిక పునాదులున్న రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల కలయికలు విజయవంతమై మంచి ఫలితాలనిస్తాయని గత ఎన్నికలు నిరూపించాయి. అయితే, ఇలాంటి పొత్తులు అరుదనే చెప్పాలి. పొత్తులు చాలా సందర్భాల్లో రాజకీయ పక్షాలకు ఇబ్బందికరమైన ఫలితాలనిస్తాయి. సీట్ల సర్దుబాటు వల్ల పోటీ చేయని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బలహీనమైన సందర్భాలున్నాయి. అలాగే, పొత్తుల వల్ల కొన్ని పార్టీలు లబ్ధి పొందడం, మరి కొన్ని నష్టపోవడం మామూలే. కొన్ని సందర్భాల్లో రెండు పార్టీల పొత్తులు జనానికి నచ్చకపోతే రెండింటినీ వారు ఎన్నికల్లో తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. విడిగా పోటీచేస్తే పడే ఓట్లు కూడా పొత్తు కారణంగా ఇతర పక్షాలకు మళ్లిపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఉత్తరప్రదేశ్ : ఎస్పీ–బీఎస్పీ పొత్తు కిరికిరి ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు దేశంలోనే అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. ఎస్పీవైపు మొగ్గు చూపే బీసీలు ఇప్పటికీ దళితులను శత్రువులుగానే చూస్తున్నందున బీఎస్పీకి ఎస్పీ ఓట్లు బదిలీ అవుతాయనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, కిందటేడాది బీజేపీ కంచుకోటలైన గోరఖ్‌పూర్, ఫూల్పూర్లో బీఎస్పీతో పొత్తు ఎస్పీకి లాభించింది. పొత్తు ఫలించి రెండు సీట్లూ ఎస్పీ కైవసం చేసుకుంది. ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు తొలి పరీక్ష ఎస్పీకి ఫలించింది. బీఎస్పీకి విధేయులైన ఓటర్ల మాదిరిగా ఎస్పీ మద్దతుదారులైన యాదవులు అంతే స్థాయిలో మాయావతి పార్టీకి ఓటేయకపోచ్చని, ఎస్పీ చీలికవర్గమైన ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీకి కొందరు యాదవులు మద్దతిచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్‌సింగ్ యాదవ్ నాయకత్వాన ఈ కొత్త పార్టీ పోటీచేస్తోంది. ‘ఎస్పీ పోటీలో లేని అనేక చోట్ల యాదవులు శివపాల్ పార్టీ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు కానీ, బీఎస్పీకి ఓటేయకపోవచ్చు’ అని పరిశీలకులు అంటున్నారు. కానీ, రెండు పార్టీలకు గతంలో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఎస్పీ–బీఎస్పీ పొత్తు మంచి ఫలితాలనివ్వాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఇలాంటిది కాదు. దీనివల్ల రెండు పార్టీలూ నష్టపోయాయి. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు పడిన ఓట్లు కలిపితే 42.12 శాతం కాగా, బీజేపీకి 42.63 శాతం ఓట్ల పడ్డాయి. రెండు పార్టీలకు లభించిన ఓట్ల ఆధారంగానే అఖిలేశ్ యాదవ్, మాయావతి పార్టీలు ఇప్పుడు చేతులు కలిపాయి. బిహార్ : బిహార్‌లో హిట్.. తెలంగాణలో ఫట్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా పోటీచేసి గెలుపొందాయి. ఆర్జేడీ, జేడీయూకి కలిపి 35.2 శాతం ఓట్లు దక్కగా, ప్రత్యర్థి పక్షమైన బీజేపీకి 24.4 శాతం ఓట్లే వచ్చాయి. ఇక్కడ చాలా ఏళ్లు శత్రుపక్షాలుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూ మధ్య ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగింది. ‘ఇది జనం కోరుకున్న పొత్తు. అందుకే మంచి ఫలితాలొచ్చాయి. ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగింది. కేవలం పార్టీల అగ్రనేతల మధ్య కుదిరే పొత్తు వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే పొత్తులు ఫలిస్తాయి’ అని ఆర్జేడీ నేత మనోజ్ ఝా తెలిపారు. కిందటి డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితితో కూడిన మహా కూటమి ఘోర పరాజయం పాలైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తో తెలంగాణ ఏర్పాటును సమర్థించని తెలుగుదేశం చేతులు కలపడాన్ని ప్రజలు అంగీకరించలేదు. పాలకపక్షమైన టీఆర్ఎస్ పాలనతో అసంతృప్తి చెందిన జనం సైతం టీడీపీ కూటమిలో ఉండటాన్ని సహించలేక పెద్దసంఖ్యలో పాలకపక్షానికే ఓటేశారు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ బలపడకపోగా మరింత బలహీనమైంది. ఓటు బదిలీ సంగతి దేవుడెరుగు అసలు ప్రజలనే టీఆర్ఎస్ వైపు మళ్లేలా చేసింది ఈ పొత్తు. ఎక్కువ విధేయులైన మద్దతుదారులున్న పార్టీయే తన మిత్రపక్షానికి ఓట్లు బదిలీ చేయగలుగుతుందని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ చెప్పారు. ‘ఓట్ల బదిలీకి ఓ లక్ష్యం ఉండాలి. తెలంగాణకు కట్టుబడిన పార్టీకే ఓటెయ్యాలనే లక్ష్యమే టీఆర్ఎస్ విజయానికి దారితీసింది’ అని ‘సీ ఓటర్’ సంస్థకు చెందిన దేశ్‌ముఖ్ అన్నారు. తమిళనాడు : ఫలించని డీఎంకే–కాంగ్రెస్ దోస్తీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. నాటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా కేవలం 4.3 శాతం ఓట్లు సాధించింది. కానీ ప్రాంతీయ పక్షం డీఎంకేతో కలిసి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీచేసినా కాంగ్రెస్‌కు దక్కినవి ఆరు శాతం ఓట్లే. ఈ రెండు పార్టీలు సహజమైన రాజకీయ మిత్రపక్షాలు కాకపోవడంతో అటువంటి ఫలితాలొచ్చాయి. అందుకే ఈసారి కాబోయే ప్రధాని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అంటూ డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించి మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నారు. ఈ నినాదం కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పాటు పీఎంకే, ఎండీఎంకే వంటి చిన్న పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అవుతాయి కానీ, చిన్న పార్టీల ఓట్లు పెద్ద పార్టీలకు పడవని చెన్నైకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. మరి తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. మహారాష్ట్ర : వింత మిత్రులు..బీజేపీ–శివసేన మహారాష్ట్ర పాలక సంకీర్ణ సర్కారులో జూనియర్ భాగస్వామి అయిన శివసేన గత నాలుగేళ్లలో అవకాశమొచ్చిన ప్రతిసారీ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడగానే రెండు పార్టీలూ మళ్లీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందని ప్రకటించాయి. నరేంద్రమోదీని ప్రధానిని చేయడానికి శివసేన అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు మద్దతు ఇస్తారని, కాంగ్రెస్‌ను నిలువరించడానికి బీజేపీకి శివసేన ఓట్లేయిస్తుందని ఎన్నికల నిపుణులు జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ తెచ్చుకునే అవకాశం లేనందున అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు పెట్టుకుంటోందని శివసేన నేత సంజయ్‌రౌత్ చెప్పారు. అయితే, ఈ పొత్తు మునుపటిలా అంత సజావుగా సాగదనీ, గత కొన్నేళ్లలో రెండు పక్షాల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని, 2014లో మాదిరిగా రెండింటి మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరగదని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. అస్సోం : కలవని మనసులు అస్సోంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాం తీయ పక్షమైన అస్సోం గణపరిషత్ (ఏజీపీ) తో కలిసి బీజేపీ పోటీచేసి గెలుపొందింది. ఇటీవల పౌరసత్వ సవరణ బిల్లుపై విభేదాల కారణంగా కాషాయ పక్షానికి ఏజీపీ దూరమైంది. మళ్లీ లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించగానే రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. కానీ, రెండు పార్టీల కార్యకర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు ఫలితాలివ్వకపోవచ్చని భావిస్తున్నారు. పౌరసత్వ సమస్య వంటి కీలకాంశంపై బహిరంగ విభేదాలు లేకుంటే బీజేపీ–ఏజీపీ పొత్తు పార్లమెంటు ఎన్నికల్లో సత్ఫలితాలివ్వడానికి అవకాశం ఉండేది. కానీ, మారిన రాజకీయ వాతావరణంలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. దాదాపు 24 ఏళ్ల పాటు బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతి 11 ప్రచార ర్యాలీల్లో కలిసి పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి తెలుసు. అయినా, ఐదేళ్ల క్రితం మోదీ ప్రభంజనంలో రెండు పార్టీలూ కొట్టుకుపోయాయి. తమ ఉనికి కాపాడుకోవడానికి కుదుర్చుకున్న పొత్తు కాబట్టి ఇది ఫలిస్తుందని ఇద్దరూ నమ్ముతున్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పొత్తు: ఆర్జేడీ– జేడీయూ– కాంగ్రెస్ ఫలితం: ఈ కూటమిదే విజయం (ఆర్జేడీ– 80, జేడీయూ– 71,కాంగ్రెస్– 27) కారణం: బీసీలు, మైనారిటీల నుంచి కూటమికి లభించిన సంపూర్ణ మద్దతు 2019 మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు పొత్తు: బీజేపీ– శివసేన ఏం జరుగుతుంది?: రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా, సంపూర్ణంగా జరిగే అవకాశం 2019 లోక్‌సభ ఎన్నికలు పొత్తు: బీజేపీ–ఏఐడీఎంకే–డీఎండీకే–పీఎంకే వర్సెస్ డీఎంకే–కాంగ్రెస్–ఇతర చిన్న పార్టీలు ఏం జరుగుతుంది?: కాంగ్రెస్ అధినేత రాహుల్ ప్రధాని అభ్యర్థి అని డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించిన కారణంగా రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరిగే అవకాశం 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికలు పొత్తు: బీఎస్పీ – కాంగ్రెస్ ఫలితం: హంగ్ అసెంబ్లీ (బీఎస్పీ– 67, కాంగ్రెస్– 33) కారణం: బీఎస్పీకి కాంగ్రెస్ ఓట్లు బదిలీ కాలేదు 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలు పొత్తు: ఎస్పీ – కాంగ్రెస్ ఫలితం: బీజేపీకి భారీ మెజారిటీ 224 నుంచి 47కు తగ్గిన ఎస్పీ సీట్లు 28 నుంచి 7కి తగ్గిన కాంగ్రెస్ బలం కారణం: రెండు పార్టీల కలయిక ఆచరణలో ఏ రకంగానూజరగలేదు -
బీజేపీ కులం కార్డు
ఎంత సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీ అయినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కుల సమీకరణాలకు తలొగ్గక తప్పదని బీజేపీ నిరూపించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ (ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమికి దీటుగా నిలిచేందుకు చివరి నిమిషంలో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. కుల సమీకరణాలతో లబ్ధి పొందే ఎలాంటి అవకాశాన్ని విపక్ష కూటమి ఇవ్వకుండా ఉండేందుకే బీజేపీ ఈ మార్పులు చేసింది. అభ్యర్థులను మార్చిన ఆరు నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వుడు నియోజకవర్గాలే. ఆగ్రాలో మొదట కేంద్ర మాజీ మంత్రి రాంశంకర్ కతేరియాను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో రాష్ట్ర మంత్రి ఎస్పి సింగ్ బఘేల్‌ను ఎంపిక చేశారు. షాజహాన్పూర్లో సిట్టింగ్ ఎంపీ కృష్ణ రాజ్ బదులు అరుణ్ సాగర్‌ను నిలబెట్టారు. ఇక, బదాన్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిగా ధర్మేంద్ర యాదవ్ బరిలో ఉన్నారు. ఆయనపై పోటీకి బీజేపీ సంఘమిత్ర మౌర్యను దింపింది. సంఘమిత్ర తండ్రి స్వామి ప్రసాద్ మౌర్య బీఎస్పీ అధినేత మాయావతికి నమ్మిన బంటు. ఆయన కూతురును పోటీకి పెట్టడం ద్వారా నియోజకవర్గంలో యాదవేతర ఓట్లను రాబట్టుకోవచ్చని కమలనాథుల ఆశ. హర్దోయి, మిస్రిక్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ ఆ ఇద్దరినీ కూడా మార్చింది. -
సీన్ రిపీట్?
బీజేపీకి గత ఎన్నికల్లో పట్టంగట్టిన ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి ఏమిటి? నూటికి నూరు శాతం సీట్లు గెలుచుకున్న రాజస్తాన్, గుజరాత్లో ఫలితాలు పునరావృతం అవుతాయా? మళ్లీ అధికారంలోకి రావాలంటే కాషాయ కూటమికి లోటును భర్తీ చేసే రాష్ట్రాలు ఏమిటి? మేజిక్ ఫిగర్ 272 చేరడానికి బీజేపీ అనుసరించే వ్యూహం ఏమిటి? కిందటి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 75 శాతం సీట్లు 8 రాష్ట్రాల్లోనే లభించాయి. దేశ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్‌లోని 273 సీట్లలో కాషాయ పక్షానికి 216 సీట్లు దక్కాయి. ఈ రాష్ట్రాల్లోని సీట్లలో 80 శాతం బీజేపీ కైవసం చేసుకున్న కారణంగా లోక్‌సభలో మెజారిటీ వచ్చింది. అంటే పాలకపక్షం గెలుచుకున్న 282 సీట్లలో నాలుగింట మూడొంతుల సీట్లు ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే వచ్చాయి. సాధించిన సీట్లలో అత్యధిక శాతం ఇక్కడే లభించడం వల్లే దేశవ్యాప్తంగా 31 శాతం ఓట్లతోనే బీజేపీ మెజారిటీ సీట్లు సంపాదించగలిగింది. ఈ ప్రాంతాల్లో ఇదే స్థాయిలో విజయం సాధించడం లేదా అంతకన్నా ఎక్కువ సీట్లు సాధించడం 2019 ఎన్నికల్లో బీజేపీకి కుదిరే పని కాదని రాజకీయ పండితుల అంచనా. ప్రజల్లో పాలకపక్షంపై పెరిగిన వ్యతిరేకత, విపక్షాల మధ్య అవగాహన వంటి అనేక అంశాల కారణంగా పై రాష్ట్రాల్లో మళ్లీ 80 శాతం సీట్లు గెలుస్తామన్న ధీమా బీజేపీకి సైతం లేదు. తమకు మొదట్నించీ బలం లేని ఇతర రాష్ట్రాల్లో అదనంగా సీట్లు కైవసం చేసుకుని ఈ 8 రాష్ట్రాల్లో వచ్చే లోటును భర్తీ చేసుకోవడానికి బీజేపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. అవెంత వరకు ఫలిస్తాయో అంచనా వేయడం కష్టం. 2014లో మాదిరిగా బీజేపీకి ఇన్ని సీట్లు రాకపోవచ్చనే అభిప్రాయానికి చాలా కారణాలున్నాయి. యూపీ: నల్లేరుపై నడక కాదు ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 సీట్లలో 71 గెలుచుకుంది. ‘మోదీ ప్రభంజనం’ ఉత్తరాదిని ఊపేస్తున్న సమయంలో సాధించిన ఈ గెలుపు ఈ వేసవిలో అంత తేలిక కాదు. 2014 ఎన్నికల్లో గెలిచిన సీట్లలో నాలుగో వంతు యూపీ నుంచే బీజేపీకి దక్కాయి. యూపీలో బీజేపీయేతర ప్రధాన పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ తదితర పార్టీల మధ్య అప్పుడెలాంటి పొత్తు లేదు. అప్నాదళ్ అనే చిన్న పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఆ ఘన విజయం సాధించింది. అయితే, ఈసారి బీఎస్పీ, ఎస్పీ కలిపి పోటీ చేస్తున్నాయి. బీసీలు, దళితుల్లో గట్టి పునాదులున్న బీఎస్పీ, ఎస్పీ పశ్చిమ యూపీలో జాట్ సామాజికవర్గంపై ఆధారపడిన ఆరెల్డీతో చేతులు కలపడంతో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లు దాటితే ఘన విజయంగా భావించవచ్చు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెల్లెలు ప్రియాంకకు తూర్పు యూపీ ప్రచార బాధ్యతలు అప్పగించడం, పశ్చిమ యూపీ వ్యవహారాల ఇన్చార్జ్గా జ్యోతిరాదిత్య సింధియా పనిచేస్తుండడంతో బీజేపీ పని నల్లేరుపై నడక కాదు. రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో రాష్ట్రంలో యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చినా.. బీజేపీ సర్కారు పనితీరు గొప్పగా లేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ ప్రభావం ఉంటే తప్ప బీజేపీకి యూపీలో 60 సీట్ల వరకూ వచ్చే అవకాశాల్లేవు. మూడు రాష్ట్రాల్లో పోటాపోటీ కిందటేడాది చివర్లో జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో ఘోర పరాజయం పాలైంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో వరుసగా 25, 27 సీట్లు కైవసం చేసుకోగా అసెంబ్లీ పోరులో పోలైన ఓట్లలో సగం సాధించింది కానీ, మెజారిటీ సీట్లలో ఓడిపోయింది. జరిగేవి జాతీయ ఎన్నికలు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో మోదీ కరిజ్మా, పాక్‌పై వైమానిక దాడుల ప్రభావం ఒకవేళ పనిచేసినా ఇక్కడ 80 శాతం లోక్‌సభ సీట్లు గెలవడం కష్టమే. ఛత్తీస్‌గఢ్‌లో పదిహేనేళ్ల బీజేపీ పాలన తర్వాత కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆరు నెలల్లోపు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి భిన్నఫలితం దక్కే అవకాశాలు తక్కువ. బిహార్/జార్ఖండ్: 2014 ఎన్నికల్లో ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బిహార్‌లోని 40 సీట్లలో బీజేపీ 30 చోట్ల పోటీచేసి 22 సీట్లు గెలుచుకుంది. జేడీయూ తో పొత్తు లేకుండా ఇన్ని సీట్లు గెలవడం విశేషం. 2017 లో నితీశ్‌కుమార్ ప్రభుత్వంలో బీజేపీ చేరడంతో మళ్లీ జేడీయూ, ఎల్జేపీతో చేతులు కలపడానికి అవకాశం వచ్చింది. కానీ ఈసారి బీజేపీ 17 సీట్లకే పోటీ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర సర్కార్లలో బీజేపీ భాగస్వామి కావడం వల్ల పాలకపక్షాలపై జనంలో వ్యతిరేకత ఉంటే దాని ప్రభావం బీజేపీపైనా పడుతుంది. అదీగాక, ఆర్జేడీ నాయకత్వంలోని ప్రతిపక్షాల కూటమి బలంగా ఉండడంతో ఎన్డీయే గట్టి పోటీయే ఎదుర్కొంటోంది. 14 సీట్లున్న పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లో బీజేపీ కిందటిసారి 40 శాతం ఓట్లతో 12 సీట్లు కైవసం చేసుకుంది. రాష్ట్రంలో పాలకపక్షంగా నాలుగున్నరేళ్లుగా బీజేపీ పనిచేస్తోంది. రఘువర్‌దాస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు జనాదరణ పొందలేదు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్ష కూటమి గట్టి పోటీనిస్తోంది. ఇక్కడ కూడా ఏడెనిమిది సీట్లు బీజేపీకి వస్తే గొప్ప విజయం కింద లెక్కే. గుజరాత్: మోదీ మేజిక్ ఎంత? మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీ ప్రధాని అభ్యర్థిగా జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ 25 సీట్లను సునాయాసంగా గెలుచుకుంది. మోదీ స్వయంగా వడోదరా నుంచి పోటీ చేయడంతో మోదీ ప్రభంజనం సునామీ సృష్టించింది. కాని, ఆయన తర్వాత ఇద్దరు సీఎంలు మారడం, పాటీదార్ల కోటా ఆందోళన, గ్రామీణ ప్రాంతాల్లో అసంతృప్తి కారణంగా 2017 డిసెంబర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా అసెంబ్లీలో బలం 115 నుంచి 99కి పడిపోయింది. మోదీ రెండోసారి ప్రధాని అవుతారనే కారణంతో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా గత ఫలితాలు పునరావృతం కావడం కష్టం. ఆరు రాష్ట్రాల్లో 91 శాతం విజయాలు! యూపీ, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వరకే చూస్తే కిందటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఆరింటిలో బీజేపీ తాను పోటీచేసిన సీట్లలో 91 శాతం కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. మోదీ గాలితో పాటు, పదేళ్ల యూపీఏ పాలనపై జనాగ్రహం, అవినీతి నిర్మూలనకు బీజేపీ ఇచ్చిన హామీలు పనిచేయడంతో ఈ 8 రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో సీట్లు కాషాయపక్షానికి చిక్కాయి. ఈశాన్య ప్రాంతంలోని 25 సీట్లలో 15 వరకూ బీజేపీ గెలిస్తేనే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో తగ్గిన సీట్ల భర్తీకి వీలవుతుంది. 2014లో బీజేపీకి ఈశాన్యంలో 9 సీట్లు వచ్చాయి. వరుసగా రెండు, ఒకటి సీట్లే దక్కిన పశ్చిమ బెంగాల్, ఒడిశాలో బీజేపీ సాధించే సీట్ల సంఖ్య 20కి పెరుగుతుం దని ఆ పార్టీ అంచనా. తమిళనాడులో గతం లో ఒక సీటే బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఐదు సీట్లకు పోటీచేస్తోంది. మహారాష్ట్ర: పాత కూటమే పోటీ మహారాష్ట్రలో ఇప్పటిలాగానే శివసేనతో జతకట్టిన బీజేపీ కిందటిసారి 48 సీట్లలో 23 సీట్లు గెలుచుకుంది. గతంలో కాషాయ కూటమిలో భాగమైన స్వాభిమానీ షేట్కారీ సంఘటన ఈసారి ప్రతిపక్షాలతో చేతులు కలపడానికి సిద్ధమౌతోంది. నాలుగేళ్లకు పైగా బీజేపీ–శివసేన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. కాషాయపక్షానికి 15 సీట్లు వస్తే గొప్పే. -
ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ..
సాక్షి ప్రతినిధి, వరంగల్: 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ‘కమలా’నికి కలిసొచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ అంతకు ముందు.. ఆ తర్వాత ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. 1984లో జరిగిన ఎన్నికల్లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి ఎంపీగా బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనే భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1991లో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఎంపీగా గెలుపొందగా, అప్పుడు కూడా బీజేపీ ఒకే స్థానాన్ని గెలుచుకుంది. 1998లో కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించగా, బీజేపీ ఖాతాలో రెండు పార్లమెంట్ స్థానాలు పడ్డాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగర్‌రావు, మెదక్ నుంచి ఆలె నరేంద్ర, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్ నుంచి ఏపీ జితేందర్‌రెడ్డి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ‘కమలం’కు కలిసి రాగా.. మొదటి సారిగా తెలంగాణ నుంచి నాలుగు పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టిన బీజేపీ సికింద్రాబాద్ స్థానానికే పరిమితమైంది. ఇక్కడ గెలిచిన బండారు దత్తాత్రేయకి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చోటు లభించింది. -
హస్తం నిస్తేజం
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడని సామెత. మరి కాలం కలిసిరాకపోతే..ఆ ఏముంది.. పరిస్థితి కాంగ్రెస్ పార్టీలా మారిపోతుంది! ఏళ్లుగా తోడున్న మిత్రులు ముఖం చాటేస్తారు! అవసరం కొద్దీ చేయి కలిపిన వాళ్లూ.. పెద్ద పెద్ద అవసరాలు వెతుక్కుని వెళ్లిపోతారు! ఎన్నికల వేళ కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ సరిగ్గా ఇలాగే వ్యవహరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌తో అప్పటివరకూ జరిగిన పొత్తు మాటలను అటకెక్కించి నగరంలోని మొత్తం ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. సీట్ల సంఖ్యలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, సొంతపార్టీలోనే పొత్తులపై వ్యతిరేకత వ్యక్తమవుతూండటం దీనికి కారణాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చుగానీ.. ఇంకో 20 రోజుల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతున్న వేళ 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఇదేమంత మంచి సంకేతమైతే కాదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి పెట్టని కోటలా ఉన్న యూపీతోపాటు అనేక కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఒకప్పుడు ఒంటిచేత్తో ఈ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ఇప్పుడు కనీసం ఇంకొకరి సాయం కూడా దక్కని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలసి ప్రతిపాదించిన మహాఘఠ్ బంధన్ ఉనికే సందిగ్ధంలో పడింది. యూపీ, బెంగాల్ తరువాత తాజాగా బిహార్, ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆధిపత్యం చెలాయించాలని ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ కూడా వెనకంజ వేయడం లేదని, అందుకే ప్రతిష్టంభన ఏర్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, ఆప్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముందుకొచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఆ తరువాత ఆప్‌తో పొత్తును పునఃపరిశీలించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పంజాబ్, హరియాణాల్లో సీట్లు కేటాయించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పట్టుబడుతుండగా, కాంగ్రెస్ అందుకు అంగీకరించడం లేదు. ఇక ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు సీట్ల కోరుతుండగా, మూడుకు మించి కేటాయించేందుకు ఆప్ ఆసక్తి కనబరచడం లేదు. పొత్తులపై డైలమా...? వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలోనే కాంగ్రెస్‌లో కొంత డైలమా ఉం దని తెలుస్తోంది.కొంతమంది పొత్తులతో లాభమంటూండగా.. ఇంకో వర్గం మాత్రం ససేమిరా అంటోంది. రాజకీయాలు మారిపోయిన నేపథ్యం లో పాతకాలపు ఒంటెత్తు పోకడలను పక్కనబెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా అందరినీ కలుపుకుపోవాలని ఒక వర్గం సూచిస్తోంది. ఉత్తరప్రదేశ్ విషయాన్నే తీసు కుంటే.. ఇంతకాలం అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడినందున ఒకప్పటి కాంగ్రెస్ బలమైన దళితులు పార్టీకి దూరమయ్యారని.. బీఎస్పీ లాంటి పార్టీలు ఆయా వర్గాల వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో వారితో పొత్తులు అత్యవసరమని వీరు అంటున్నారు. అగ్రవర్ణ బ్రాహ్మణుల్లో అధికు లు బీజేపీ వైపు.. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పూర్వపు స్థితికి చేరుకోగలదన్నది వీరి అభిప్రాయం. అయితే.. ప్రాంతీయ పార్టీలకు చోటు కల్పించడం అసలుకే మోసం తెస్తుందని.. కొంత కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ మనుగడకే ముప్పు అన్నది సంప్రదాయ వాదుల వాదన. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూడాలని వీరు అంటున్నారు. కష్టమైనాసరే.. పార్టీ పునరుజ్జీవానికి ఒంటరిపోరే మేలన్నది వీరి అభిప్రాయం. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలను పరిరక్షించుకుంటూనే దీర్ఘకాలపు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని.. బలీయమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని వీరు సూచి స్తున్నారు. ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ సీట్లు సంపాదించడం ఇతర పార్టీలతో పొత్తు చర్చలకు బలమిస్తుందని వీరు అంటున్నారు. 2007 నాటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమైన రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన తరువాత మాత్రం అందుకు భిన్నమైన మార్గంలో వెళుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒంటెత్తు పోకడలు కారణమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈమధ్య చేసిన ప్రసంగంలో కేసీఆర్ తన వద్ద పనిచేశాడని, అయినా తాను తగ్గానని మాట్లాడారు గుర్తుందా? ఈ హాస్యాస్పదం వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ పోకడలకూ వర్తిస్తుంది. పెద్దన్న తరహాలో వ్యవహరిస్తుండటాన్ని భాగస్వామ్య పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత డిసెంబర్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ వైఖరి మరింత మారిందన్నది ఎస్పీ, బీఎస్పీ వర్గాల ఆరోపణ. కేవలం ఒక్క సీటు తక్కువ కేటాయిస్తున్నారన్న కారణంగా ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కుదుర్చుకోకపోవడం.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్పార్టీలతోనూ గిల్లికజ్జాలకు దిగడం కాంగ్రెస్ వైఖరికి నిదర్శనంగా చెబుతున్నారు. 2004లో చిన్న చిన్న పార్టీలతోనూ సానుకూలంగా వ్యవహరించి పొత్తులు కుదుర్చుకున్న కాంగ్రెస్ ఈ సారి మాత్రం పెడసరంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావడాన్ని ఇష్టపడని చాలామంది కాంగ్రెస్ వైఖరిపై గుర్రుగానే ఉన్నారు. బీజేపీ, మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో విఫలమైందని.. ఈ నిర్లక్ష్యానికి ఫలితం అనుభవించడం ఖాయమని అంటున్నారు. పంతం వీడని ఆర్జేడీ, సీపీఎం.. బిహార్‌లో విశ్వసనీయ భాగస్వామి ఆర్జేడీతోనూ కాంగ్రెస్‌కు తలనొప్పులు తప్పట్లేదు. సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నామని, త్వరలోనే కొలిక్కి వస్తుందని బిహార్ ఏఐసీసీ ఇన్చార్జి శక్తిసింగ్ గోహిల్ చెప్పారు. 11 సీట్లు కేటాయిస్తామని గత బుధవారం ఆర్జేడీ చేసిన ఆఫర్‌కు కాంగ్రెస్ నొచ్చుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు 8 సీట్లకు మించి ఇవ్వలేమని ఆర్జేడీ చెబుతుండటం గమనార్హం. ఇక బెంగాల్ విషయానికి వస్తే కాంగ్రెస్, సీపీఎం కలసి పనిచేస్తాయని భావించినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సోమవారం రాత్రి చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. బెంగాల్ కాంగ్రెస్ యూనిట్ సలహాతో ఒంటరిగానే పోటీకి రాహుల్ అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. తమను సంప్రదించకుండానే సీపీఎం ఏకపక్షంగా వ్యవహరించి 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి మోసం చేసిందని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా ఆరోపించారు. రాష్ట్రంలోని 42 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఆయన ప్రకటించారు. -
బహుజన హితాయ సర్వజన సుఖాయ
1989 అలహాబాద్ లోక్‌సభ ఉప ఎన్నికలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు కాన్షీరామ్ పోటీ చేయడంతో ఈ పార్టీకి మొదటిసారి విశేష ప్రచారం లభించింది. అప్పటికే దళితులు, బీసీలు, మైనారిటీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యంతో పాటు వారి ప్రయోజనాలు కాపాడే పార్టీగా జాతీయ స్థాయిలో పరిచయమైంది. మాజీ ప్రధాని వీపీ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ శాస్త్రిపై పోటీచేసి అలహాబాద్‌లో కాన్షీరామ్ దాదాపు 70 వేల ఓట్లు తెచ్చుకుని సంచలనం సృష్టించారు. సమాజంలో మెజారిటీగా ఉన్న (85 శాతం) వర్గాల అభివృద్ధికి పాటుపడే పార్టీగా బీఎస్పీ స్థాపించిన కొన్నేళ్లకే ఉత్తరాదిలో ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలను ఆకట్టుకోగలిగింది. పంజాబ్‌లోనే బీజం పంజాబ్ దళిత (చమార్) సిక్కు కుటుంబంలో పుట్టిన కాన్షీరామ్ పుణేలోని రక్షణశాఖ కంపెనీలో పనిచేస్తూనే ఎస్సీ, బీసీ ఉద్యోగులను సమీకరిస్తూ బడుగు వర్గాలను సంఘటితం చేసేవారు. మొదట దళితుల పార్టీగా పేరున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కి మద్దతు పలికారు. ఈ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో విసుగెత్తి కొత్త సంస్థ స్థాపనకు నడుం బిగించారు. ఈ క్రమంలో 1978లో ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఎస్సీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల కోసం బామ్సెఫ్ అనే సంస్థను, 1981లో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్‡్ష సమితి (డీఎస్4) ప్రారంభించి దళిత ఓటర్లను సమీకరించారు. 1984 ఏప్రిల్ 14న (బీఆర్ అంబేడ్కర్ జయంతి) బీఎస్పీని స్థాపించారు. అలహాబాద్ ఉప ఎన్నిక ముందు 1984 ఎన్నికల్లో జాంజిగిర్–చాంపా (ఛత్తీస్‌గఢ్), తర్వాత 1989లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీకి ఎక్కువ ఆదరణ లభించడంతో వేగంగా రాష్ట్రమంతటా విస్తరించింది. ఘర్షణపడే దళితులు, బీసీలను ఏకం చేయడంలో యూపీకే చెందిన యువ నాయకురాలు మాయావతి చాలా వరకు విజయం సాధించారు. మూడు సీట్లు.. 2 శాతం ఓట్లు పార్టీ స్థాపించిన ఐదేళ్లకు 1989 లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు బీఎస్పీ సాధించింది. 1990లో సంక్షోభంలో పడిన వీపీ సింగ్ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఇవ్వడానికి కాన్షీరామ్ నిరాకరించారు. పదేపదే ఎన్నికలొస్తే తమ పార్టీకి ప్రయోజనకరమని ఆయన ప్రకటించారు. అయితే 1991 లోక్‌సభ, యూపీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో బీఎస్పీకి పాత సంఖ్యలోనే (3 లోక్‌సభ, 12 అసెంబ్లీ) సీట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గింది. ‘బాబ్రీ’ తర్వాత పెరిగిన బలం బాబ్రీ మసీదు కూల్చివేశాక 1993లో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పెట్టుకున్న పొత్తు బీఎస్పీ బలం పెరగడానికి ఉపకరించింది. బీఎస్పీ 19.6 శాతం ఓట్లతో 67 సీట్లు.. మిత్రపక్షం ఎస్పీ 17.9 శాతం ఓట్లతో 109 సీట్లు కైవసం చేసుకున్నాయి. ములాయం ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణానికి కాంగ్రెస్, జనతాదళ్ బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. మాయావతిపై దాడితో మలుపు 1995 మేలో ములాయం సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. ఆ సమయంలో లక్నో గెస్ట్‌హౌస్‌లో ఉన్న మాయావతిపై ఎస్పీ గూండాలు జరిపిన దాడితో రెండు పార్టీలూ 2018 చివరి వరకూ వైరిపక్షాలుగా మారిపోయాయి. ములాయం రాజీనామా చేశాక బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇలా అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీతో కాన్షీరామ్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయించడం సంచలనమే అయింది. తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం, 1996 మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్లీ ఆ పార్టీతోనే చేతులు కలపడం (1997), ఆరు నెలలకు కాషాయ పక్షానికి దూరం కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇలా మాయావతి రెండుసార్లు సీఎం అయ్యారు. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా మారి శాశ్వతంగా బలహీనమైంది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 98 సీట్లు గెలిచిన బీఎస్పీకి బీజేపీ (88), ఇతర చీలిక వర్గాలు మద్దతు ఇవ్వడంతో మాయావతి మూడోసారి ముఖ్యమంత్రి అయినా ఆరు నెలలకే రాజీనామా చేశారు. ఈ కాలంలోనే బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల నేతలను బీఎస్పీలోకి ఆకర్షించే ప్రయత్నంలో మాయావతి విజయం సాధించారు. 2003లో కాన్షీరామ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మాయావతి పార్టీ జాతీయ అధ్యక్షురాలయ్యారు. మాయావతి కులమైన చమార్లు (జాటవ్‌లు), ఇతర దళితులు, యాదవేతర బీసీలతోపాటు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ప్రజల ఆదరణ లభించడంతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తొలిసారి సంపూర్ణ మెజారిటీ లభించింది. దీంతో మాయావతి పూర్తిగా ఐదేళ్లు పదవిలో కొనసాగారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి బీఎస్పీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బీఎస్పీ మూడో స్థానానికి (19 సీట్లు) దిగజారింది. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి దాదాపు 20 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటూ గెలవలేదు. బీజేపీ దూకుడుతో భయపడి ఎస్పీ, బీఎస్పీలు తమ ఉనికి కాపాడుకోవడానికి 2018లో మూడు యూపీ లోక్‌సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో చేతులు కలిపాయి. ములాయం స్థానంలో ఆయన కొడుకు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎస్పీ అధ్యక్షుడు కావడం కూడా రెండు పార్టీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకోవడానికి దోహదం చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఎస్పీ, ఆర్ఎల్డీతో చేతులు కలిపి యూపీలో చేస్తున్న మాయావతి ప్రయోగం బీఎస్పీకి గట్టి పరీక్షే. 35 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావచ్చనే సిద్ధాంతంతో బయల్దేరిన బీఎస్పీ ‘బహుజన హితాయ’ నినాదం నుంచి ‘సర్వజన హితాయ సర్వజన సుఖాయ’ అనే కొత్త నినాదంతో అన్ని సామాజిక వర్గాలను ఆకుట్టుకోవాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. లోక్సభలోబీఎస్పీ సీట్లు -
‘రణ’మూల్
పశ్చిమబెంగాల్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో 26 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని స్థాపించిన పార్టీయే ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ/టీఎంసీ). బెంగాల్లో ప్రస్తుత పాలకపక్షంగా ఉన్న ఈ పార్టీ 1998 జనవరి 1న ఆవిర్భవించింది. దీదీ, అంతకు ముందు బెంగాల్ ‘అగ్నికన్య’గా పేరు సంపాదించిన మమత పోరాట పటిమ, 34 ఏళ్ల సీపీఎం పాలనకు ముగింపు పలకాలనే పట్టుదలతో స్థాపించిన 13 ఏళ్లకే (2011) తృణమూల్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లుగా తిరుగులేని మెజారిటీతో రాష్ట్రాన్ని పాలిస్తోంది. సీపీఎం మొదటి ముఖ్యమంత్రి జ్యోతిబసు హయాంలో కాంగ్రెస్ నేతగా మార్క్సిస్ట్ సర్కారుపై ఎడతెగని పోరాటం చేశారు. 2000 నవంబర్‌లో జ్యోతిబసు వారసునిగా వచ్చిన సీనియర్ సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తృణమూల్ కాంగ్రెస్ పదిన్నరేళ్ల కాలం హింసాత్మక ఉద్యమాలతో సంచలనం సృష్టించింది. చివరికి 2011 మే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకుంది. మమత ‘నిరసన నృత్యం’ 1970ల చివర్లో జనతా పార్టీకి స్ఫూర్తిప్రదాత జయప్రకాశ్ నారాయణ్ కారు బానెట్‌పై యూత్ కాంగ్రెస్ నేతగా ఎదుగుతున్న మమత డాన్స్ చేసి మొదటిసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. మధ్య తరగతి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఎం సమరశీల కార్యకర్తల ధాటికి కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి పారిపోయే రోజుల్లో ఆమె వారికి ఎదురొడ్డి నిలిచి దెబ్బలు తిన్నారు. జ్యోతిబసు హయాంలో 1991లో వామపక్ష కార్యకర్తల దాడిలో మమత తల పగిలి కుట్లుపడ్డాయి. తృణమూల్ పార్టీ ఆవిర్భావం 1996–98 మధ్య కేంద్రంలో పాలన సాగించిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు లోక్‌సభలో బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎం మద్దతు ఇచ్చాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రయోగం కారణంగా బెంగాల్లో సీపీఎంతో కాంగ్రెస్ రాజీపడుతోందని మమత గ్రహించారు. ఈ క్రమంలోనే 1998 జనవరి 1న పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించారు. కొన్ని నెలలకే జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే టీఎంసీకి 7 సీట్లు రాగా, మిత్రపక్షం బీజేపీకి ఒక స్థానం దక్కింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తుపెట్టుకుని పశ్చిమ బెంగాల్లో 8 సీట్లు తృణమూల్ కైవసం చేసుకుంది. వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడో ఎన్డీఏ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రి అయ్యారు. 2001 వేసవిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి వీలుగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి మమత సహా తృణమూల్ మంత్రులు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు 226 స్థానాలకు పోటీచేసి 60 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించింది. మళ్లీ 2003 సెప్టెంబర్‌లో తృణమూల్ (మమతా) వాజ్‌పేయి ప్రభుత్వంలో చేరింది. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తృణమూల్ పొత్తుపెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా బీజేపీతో పాటే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. టీఎంసీకి ఒకే ఒక సీటు దక్కింది. 2006 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. తృణమూల్ బలం 60 నుంచి 30కి పడిపోయింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 235 సీట్లు సాధించింది. మమత, తృణమూల్ పని ఇక అయిపోయిందనుకున్న ఈ దశలో బుద్ధదేవ్ సర్కారుపై బ్రహ్మాండమైన పోరు సాగించడానికి తృణమూల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో సింగూరులో సారవంతమైన వేయి ఎకరాల భూమిని సీపీఎం సర్కారు టాటా మోటార్స్ నానో కారు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించింది. భూసేకరణను రైతులు వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా మమత కోల్‌కతాలో 25 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత మరో విదేశీ సంస్థకు నందిగ్రామ్‌లో కెమికల్ కాంప్లెక్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి కేటాయించడమేగాక 70 వేల మంది ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించింది. ఈ ఉద్యమంతోనూ తృణమూల్ లబ్ధిపొందింది. సింగూర్, నందిగ్రామ్‌తోపాటు భాంగోర్, సాల్బొనీ లాల్‌గఢ్, నయాచార్లో సీపీఎం కార్యకర్తలు, పోలీసుల హింస, అత్యాచారాల ఫలితంగా బుద్ధదేవ్ ప్రభుత్వం, కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. పరిస్థితులు తృణమూల్‌కు అనుకూలంగా మారాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని టీఎంసీ 19 సీట్లు గెలుచుకుంది. అధికార పీఠంపై మమత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన తృణమూల్ సొంతంగానే మెజారిటీ సీట్లు సాధించింది. తృణమూల్ కూటమికి 227 సీట్ల భారీ మెజారిటీ లభించింది. ఒక్క తృణమూల్‌కే 184 స్థానాలు దక్కడంతో మంత్రివర్గంలో ఇతర పార్టీలకు స్థానం కల్పించలేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మమత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. ఐదేళ్ల పాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలతో తృణమూల్ పలుకుబడి విపరీతంగా పెరిగింది. సీపీఎం సహా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఎంసీలో చేరారు. టీఎంసీని రాజకీయంగా ఎదుర్కొనలేక సీపీఎం, ఇతర వామపక్షాలు చతికిలపడ్డాయి. ముస్లింలు కూడా పాలకపక్షానికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 34 కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్రమోదీతో ఓ పక్క, కమ్యూనిస్టులతో మరోపక్క పోరాడుతూనే టీఎంసీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లకు పోటీచేసి 211 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏకు 200 లేదా అంతకన్నా తక్కువ సీట్లు వస్తే ప్రధాని అయ్యే అవకాశం వస్తుందనే అంచనాతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ సీట్లు 1998 - 7 1999 - 8 2004 - 1 2009 - 19 2014 - 34 -
కురువృద్ధ పార్టీ..కుర్రతరం నేత
ఏడాది క్రితం వరకూ బలహీనమవుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో విజయానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కనిష్ట స్థాయిలో 44 లోక్‌సభ సీట్లు సాధించింది. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి అవసరమైన పది శాతం సీట్లు (55) కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. అప్పటి నుంచి మూడున్నరేళ్ల వరకూ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కేంద్రంలో పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ, దాని మిత్రపక్షాలకు అత్యధిక రాష్ట్రాల్లో అధికారం అప్పగించింది. 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ కిందటేడాది మార్చి నాటికి అధికారంలో ఉన్న రాష్ట్రాలు నాలుగే (కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు పంజాబ్, కర్ణాటక, మిజోరం). బీజేపీ చేతిలో చిత్తు కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియానే ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్నారని, మన్మోహన్ బలహీనుడైన ప్రధాని అనే బీజేపీ ప్రచారం జనంలో పనిచేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించడం కూడా ఎన్డీఏ ఘన విజయానికి, బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు కైవసం చేసుకోవడానికి దోహదం చేసింది. ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ కొత్త నాయకత్వానికి తోడు, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో యూపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఆయన చెల్లెలు ప్రియాంకకు అప్పగించడంతో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమౌతోంది. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ హత్యకు గురయ్యాక సోనియా గాంధీ ఏడేళ్లపాటు పార్టీ నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. అధ్యక్ష పదవిలో ఆరేళ్లు కొనసాగాక ఆమె కాంగ్రెస్‌ను 2004లో విజయ పథంలో నడిపించారు. పార్టీ అధ్యక్ష పదవి దక్కిన ఏడాదిన్నరకు రాహుల్ కాంగ్రెస్‌కు మళ్లీ అధికారంలోకి వచ్చేలా పార్టీని నడిపిస్తారన్న నమ్మకం లేకున్నా మోదీ సర్కారు వైఫల్యాలే బీజేపీని ఓడిస్తాయనే ఆశ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఇతర ప్రతిపక్షాలతో కాంగ్రెస్‌కు పొత్తులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఫేల్ కుంభకోణం, నిరుద్యోగమే అస్త్రాలుగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌కు 2019 లోక్‌సభ ఎన్నికలు నిజంగా పెద్ద సవాలే. కొత్తగా జవసత్వాలు గతేడాది డిసెంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల–రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయం సాధించాక 17వ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ఆశతో ముందుకు సాగుతోంది. కిందటేడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సాధించకపోయినా జనతాదళ్(ఎస్)తో కలిసి సంకీర్ణ భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించడం కాంగ్రెస్‌కు కొత్త ఊపునిచ్చింది. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అత్యధిక ప్రతిపక్షాల నేతలు హాజరుకావడం కూడా కాంగ్రెస్‌కు ఇతర పార్టీల నుంచి మద్దతు, గుర్తింపు లభించింది. 1998 మార్చిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియాగాంధీ 2017 డిసెంబర్లో రాహుల్‌గాంధీకి ఈ కీలక పదవి అప్పగించారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని ఐదో తరం నేత సారథ్యంలో ప్రతిపక్షం నుంచి పాలకపక్షంగా మారడానికి వచ్చే ఎన్నికలను మంచి అవకాశంగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. సోనియా నేతృత్వంలోనే... ఎనిమిదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి అత్యధిక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించింది 145 సీట్లేగాని డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ వంటి ప్రాంతీయపక్షాలను కలుపుకుని, బయటి నుంచి వామపక్షాల మద్దతుతో యూపీఏ పేరుతో తొలిసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పాలనలో జనాదరణ సంపాదించింది. ఫలితంగా 2009 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 206 సీట్లు పెరిగి యూపీఏ పాలన పదేళ్లు కొనసాగడానికి కారణమైంది. అయితే, యూపీఏ మొదటి హయాంలో(2004–09) జరిగిన అవినీతి కుంభకోణాలు, నిరుద్యోగం వంటి అంశాల వల్ల 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాల వల్ల మన్మోహన్ నాయకత్వంలోని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా ఓటమి తప్ప లేదు. -
మలుపు తిప్పిన మోదీ గెలుపు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొదటిసారి ఐదేళ్లు అధికారంలో కొనసాగాక జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలివి. 2004ఎన్నికల్లో మాదిరిగానే మళ్లీ విజయం సాధించడానికి పాలకపక్షం మున్నెన్నడూ లేనంత గట్టిప్రయత్నాలు చేస్తోంది. బీజేపీతొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండోసారి ప్రమాణం చేశాక పదవిలో వరుసగా ఆరేళ్ల రెండు నెలలు కొనసాగినాఈ పదవీకాలం రెండు లోక్‌సభలకు సంబంధించినది. పూర్తిగా ఐదేళ్లు కొనసాగకుండానే ఈ 12, 13వ లోక్సభలురద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకే లోక్‌సభ కాలంలో ఐదేళ్లు ప్రధానిగా కొనసాగిన రికార్డు బీజేపీలో నరేంద్రమోదీకే దక్కింది. లోక్‌సభలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించడం కూడా ఇదే మొదటిసారి. 1951–77 మధ్య మనుగడ సాగించినభారతీయ జనసంఘ్ (బీజేఎస్) కొత్త రూపమే బీజేపీ. దశ మారింది కాషాయపక్షం మొదటిసారి పోటీచేసిన లోక్‌సభ ఎన్నికల్లో (1984) గెలిచింది రెండు సీట్లే. 1989 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం ఒక్కసారిగా 86 సీట్లకు పెరిగింది. జనతాదళ్ నేత వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సర్కారుకు బయటి నుంచి బీజేపీ మద్దతు ఇచ్చింది. సోమ్‌నాథ్ నుంచి అయోధ్యకు రథయాత్రతో బయల్దేరిన సీనియర్ నేత లాల్‌కృష్ణ ఆడ్వాణీని బిహార్‌లో లాలూప్రసాద్‌యాదవ్ ప్రభుత్వం (జనతాదళ్) అరెస్ట్ చేశాక వీపీసింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అదే సమయంలో బాబరీ మసీదు కూల్చివేతకు విఫలయత్నం జరిగింది. చంద్రశేఖర్ ప్రభుత్వం రాజీనామా తర్వాత 1991 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం 124 సీట్లకు పెరిగింది. ఐదేళ్ల పీవీ నరసింహారావు పాలన కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా సమర్థంగా పనిచేసింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా అతిపెద్ద పార్టీగా (161 సీట్లు) అవతరించింది. బెడిసికొట్టిన తొలి యత్నం సీనియర్ నేత వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన మొదటి బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం లోక్‌సభలో మెజారిటీ కూడగట్టలేక 13 రోజులకే రాజీనామా చేసింది. రెండేళ్ల తర్వాత జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయి నాయకత్వాన రెండో బీజేపీ ప్రభుత్వం 1998 మార్చి 19న అధికా రంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం నుంచి జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే వైదొలగడంతో జరిగిన బలపరీక్షలో ఓడిపోవడంతో 13 నెలలకే ఈ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత లోక్‌సభ రద్దయినా కార్గిల్ పోరు కారణంగా ఆలస్యంగా సెప్టెంబర్–అక్టోబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం (182) కంటే మిత్రపక్షాల బలం పెరిగింది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానిగా 1999 అక్టోబర్‌లో ప్రమాణం చేశారు. నాలుగేళ్ల ఏడు నెలలకు పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంది. మసూద్‌ను వదిలేశారు డిసెంబర్లో హర్కతుల్ ముజాహిదీన్ పేరుతో కశ్మీర్ తీవ్రవాదులు కఠ్మాండు నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కాందహార్‌కు బలవంతంగా దారిమళ్లించడంతో మసూద్ అజహర్ సహా ముగ్గురు తీవ్రవాద నేతలను బీజేపీ సర్కారు విడుదల చేసింది. 2001 డిసెంబర్ 13న కశ్మీర్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తీవ్రవాదులు భారత పార్లమెంటు భవనంపై జరిపిన దాడిలో 12 మంది మరణించారు. తర్వాత ఏడాది వరకూ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు 2002 జనవరి–ఫిబ్రవరిలో జరిగిన గుజరాత్ అల్లర్లపై సకాలంలో చర్యలు తీసుకోలేదనే విమర్శలు వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొంది. 2004 ఫిబ్రవరి నాటికి దేశ ఆర్థికాభివృద్ధి రేటు దాదాపు పది శాతానికి చేరింది. అప్పట్లో ఏడు నెలల ముందే బీజేపీ సర్కారు మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ అనూహ్య పరాజయం! జీడీపీ రేటు బాగున్నా, వాజ్‌పేయి ప్రభుత్వం పనితీరుపై జనం అనేక సర్వేల్లో సంతృప్తి వ్యక్తం చేసినా చివరికి ఏప్రిల్–మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. బీజేపీ బలం 182 నుంచి 138కి పడిపోయింది. కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ సర్కారు అధికారం చేపట్టి ఐదేళ్లు పాలన సాగించింది. సీనియర్ నేత ఎల్.కె.ఆడ్వాణీ నేతృత్వంలో బీజేపీ 2009 ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఓటమిపాలైంది. బీజేపీ బలం ఈసారి 116 స్థానాలకు దిగజారింది. మలుపు తిప్పిన మోదీ గెలుపు ముఖ్యమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడంతో 2013 సెప్టెంబర్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆడ్వాణీ వంటి సీనియర్లకు ఈ నిర్ణయం మొదట మింగుడుపడకపోయినా చివరికి అందరూ అంగీకరించారు. యూపీఏ మొదటి హయాం పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు 2009 ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూడడం, యూపీఏ ప్రధాని మన్మోహన్సింగ్ కేబినెట్లోని మంత్రులు అవినీతిపరులుగా జనంలో ముద్రపడడం, కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల్లోనే అధికారం ఉండడం, మన్మోహన్ బలహీన ప్రధానిగా ప్రచారం జరగడంతో 2014 ఎన్నికల్లో బీజేపీ మొదటిసారి 282 సీట్లతో విజయం సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక పార్టీకి సొంతంగా మెజార్టీ సీట్లు(273) రావడం ఇదే మొదటిసారి. వరుస పరాజయాలు ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ నినాదంతో ప్రధాని అయిన మోదీ 2014 మే నుంచీ జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారనే పేరు సంపాదించారు. అవినీతి తగ్గిపోయిందనీ, ప్రభుత్వ యంత్రాంగంపై మోదీకి పూర్తి పట్టు ఉందని ప్రచారం జరిగింది. 2016 చివర్లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం మాయం కాలేదు గాని సామాన్య ప్రజానీకం నానా ఇబ్బందులు పడింది. జీఎస్టీతో ఆరంభంలో ధరలు పెరిగాయి. వృద్ధి రేటు తగ్గింది. నిరుద్యోగం పెరిగిందనే వార్తలొస్తున్నాయి. ఇటీవల మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయాక కాంగ్రెస్ దూకుడు పెరిగిం ది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత బదులుగా నిర్వహించిన ‘బాలాకోట్ ఆపరేషన్’తో బీజేపీ సర్కారు పరువు నిలిచింది. రఫేల్ ఒప్పందంపై వచ్చిన విమర్శల వల్ల మోదీ నిజాయతీపై మచ్చ పడలేదు. మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాల్లో ప్రాంతీయ పక్షాలతో పొత్తులు కుదిరాయి. మొత్తానికి ఈ ఎన్నికలు మోదీకి కంటే బీజేపీకే కీలకం.