దక్షిణ గుజరాత్. మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఆదివాసీల సమ్మేళనమైన ఈ ప్రాంతవాసులు ఎటు వైపున్నారు? అధికార బీజేపీ ఆశల్ని ఆప్ గల్లంతు చేస్తుందా? జీఎస్టీపై గుర్రుగా ఉన్న వ్యాపారులు బీజేపీని కాదని ప్రత్యామ్నాయం వైపు చూస్తారా ? ఆదివాసీ ప్రాంతాల్లో పట్టున్న కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ...?
దక్షిణ గుజరాత్ భరూచ్, నర్మద, తాపి, దాంగ్, సూరత్, వల్సద్, నవ్‌సారి జిల్లాలతో కూడుకొని ఉంది. డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్ జరిగే 89 స్థానాల్లో 35 దక్షిణ గుజరాత్‌లో ఉన్నాయి. దీంతో అన్ని పార్టీలు ఈ ప్రాంతంపై బాగా దృష్టి పెట్టాయి. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలు వ్యాపారవేత్తలతో నిండిపోయి ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ 35 స్థానాలకు గాను 25 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 8, భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) 2 నెగ్గింది. ఈసారి ఆప్ రాకతో దక్షిణ గుజరాత్‌లో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివాస ప్రాబల్య ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పట్టణ విద్యావంతులు కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ పాలనకు ఆకర్షితులవుతున్నారు.
సూరత్ వ్యాపారులూ కీలకమే
సూరత్‌లో వస్త్ర వ్యాపారులు జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తూనే ఉన్నారు. కరోనా, జీఎస్టీ, పెరిగిన ధరలతో ఈసారి దీపావళి సీజన్‌లో వస్త్ర వ్యాపారం 60% తగ్గిపోవడంతో వారిలో భవిష్యత్‌పై బెంగ మొదలైంది. గత ఎన్నికల్లో పటేళ్ల ఉద్యమం, అధికార వ్యతిరేకతకు ఎదురొడ్డి జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఏకంగా 15 నెగ్గింది. ఆదివాసీ ప్రాబల్యమున్న మాండ్విలో మాత్రమే ఓడింది. ఈసారి ఆప్ ప్రభావం బాగా ఉండేలా ఉంది. గతేడాది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 27 సీట్లు నెగ్గింది. హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడం కలిసొచ్చే అంశమే అయినా ఆయన అనుచరులు తదితరులంతా ఆప్‌లో చేరారు.
చిన్న పరిశ్రమల హబ్
దక్షిణ గుజరాత్‌లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగానున్న పరిశ్రమల్లో 50శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పెట్టుబడుల్లో 33%, ఈ ప్రాంతంలోనే పెడుతున్నారు. ఉపాధి అవకాశాల్లో 43% ఇక్కడి పరిశ్రమలే కల్పిస్తున్నాయి. టెక్స్‌టైల్, డైమండ్ కటింగ్, పాలిజింగ్, కెమికల్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మసీ, ప్లాస్టిక్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. నాలుగు రేవు పట్టణాలతో కనెక్ట్ అయి ఉంది. రాష్ట్ర జనాభాలో 20% (1.2 కోట్లు) మంది దక్షిణ గుజరాత్‌లోనే నివసిస్తారు. ఈ ప్రాంతంలో వ్యాపారులందరూ జీఎస్టీపైనా, పెరిగిపోయిన విద్యుత్ బిల్లులపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు.
ఆదివాసీల ఆందోళనలు
దక్షిణ గుజరాత్‌లో 14 ఎస్టీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీజేపీ 5 మాత్రమే నెగ్గింది. ఈసారి అన్ని కూడా రావంటున్నారు. సర్–తాపి–నర్మద నది లింకింగ్ ప్రాజెక్టు, వేదాంత జింగ్ స్మెల్టర్ ప్లాంట్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం తమ భూముల్ని కొల్లగొడుతోందన్న ఆగ్రహంతో గిరిపుత్రులు చేసిన ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. వన్సాదా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్ ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రభుత్వానికి కంటీ మిద కునుకు లేకుండా చేస్తోంది. అభివృద్ధి గురించి ఆదివాసీలకు వివరించి వారి ఆదరణ పొందడానికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ, కాంగ్రెస్ వదిలేసిన ఆదివాసీలకు స్వయంపాలన అధికారాన్ని కట్టబెట్టే పంచాయతీ విస్తరణ చట్టాన్ని అమలు చేస్తామన్న ఆప్ హామీ వారిని అధికంగా ఆకర్షిస్తోంది. ‘‘దక్షిణ గుజరాత్‌లో ఆదివాసీలు, వ్యాపారులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. వేదాంత రసాయన ఫ్యాక్టరీ వారి భూముల్ని, నీటిని విషతుల్యం చేస్తుందన్న ఆందోళన నెలకొంది. వారికి ఆప్ ఆశాదీపంలా కనిపిస్తోంది’’ అని ఎన్నికల విశ్లేషకుడు అమిత్ ధోల్కాయి అన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment