జైపూర్: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపై ఆపార్టీ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కీలకపాత్ర పోషించిందని రాహుల్ పేర్కొన్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ లేకుంటే అధికార బీజేపీని కాంగ్రెస్ ఓడించేదని తెలిపారు.
గుజరాత్‌లో కాంగ్రెస్ ఓటమికి ఆప్ కారణమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆప్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ బీజేపీకి బీటీమ్‌గా వ్యవహరించిందనిమండిపడ్డారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి ఆప్ బీజేపీతో కుమ్మకైందని దుయ్యబట్టారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు రాహుల్. ప్రజల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు బీజేపీని ఓడించాలన్న దృక్పథమే లేదని విమర్శించారు. అయితే రాహుల్ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. గుజరాత్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనున్న ఉన్న ఆప్‌ను బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయని పేర్కొంది.
కాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న తమిళనాడులో మొదలైన యాత్ర ఫిబ్రవరి నెలలో కశ్మీర్‌లో ముగియనుంది. 150 రోజులపాటు మొత్తం 3,500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడక యాత్ర సాగనుంది. జోడోయాత్ర ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది. తమిళనాడు,కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర 2,800 కిమీలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశించనుంది. అనంతరం ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రల్లో పర్యటిస్తూ చివరకు జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది.
చదవండి: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. కేంద్రం ఈ నిజాన్ని దాస్తోంది: రాహుల్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment