న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కోమాలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే మార్పు(చేంజ్) కాదు, మార్పిడికి(ఎక్స్ఛెంజ్) సంబంధించినదని పంజాబ్ సీఎం ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు అడ్డంగా మారారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందని.. ప్రత్యర్థి పార్టీలకు సంఖ్యాబలం లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి ఎమ్మెల్యేలను అమ్మేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ .. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని అన్నారు.
‘గుజరాత్‌లో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు పర్యటించారు. కేవలం ఒకేసారి. మరి ఒక్కసారే రాష్ట్రాన్ని సందర్శించి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడో (గుజరాత్) అక్కడ ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ తన పాదయాత్రను సూర్యుడు మొదట ఉదయించే ప్రదేశం (కన్యాకుమారి) నుంచి ప్రారంభించాడు. ముందు తన టైమింగ్‌ను సరిచేసుకోనివ్వండి” అని భగవంత్ మాన్ చురకలంటించారు.
చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. పోలీసులు షాక్..
కాగా శుక్రవారం రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆప్ లేకుండా అధికార బీజేపీని ఓడించేవాళ్లమన్నారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ ఆప్‌ను ఉపయోగించిందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 182 స్థానాల్లో 156 సీట్లు గెలుచుకొని రికార్డ్ సృష్టించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో ఏ రాజకీయ పార్టీకీ ఇన్ని సీట్లు దక్కలేదు. 1985 ఎన్నికలలో కాంగ్రెస్ 149 స్థానాలు గెలుచుకోగా.. 37 ఏళ్ల ఈ రికార్డును బీజేపీను అధిగమించింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment