వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలంతా చేయి చేయి కలిపి తమ బలం చాటనున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ నెల 23న పలో సమావేశమై మోదీని ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను రచించనున్నారు.
దేశంలో అత్యంత బలవంతుడైన నాయకుడు మోదీని ఎదిరించి నిలబడుతున్న రాహుల్ గాందీ, అరవింద్ కేజ్రివాల్; మమతా బెనర్జీ వంటి వారు ఈ సమావేశానికి హాజరై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా మంత్రాంగం నడపనున్నారు. పాట్నా సమావేశంలో ప్రతిపక్ష పార్టీలందరూ ఒకే తాటిపైకి రాగలరా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
పార్టీల్లో ఎవరికి వారికే ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలన్న ఆశ ఉండడంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఓట్లు చీలకుండా ఉండడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్ష పార్టీ లన్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చొరవ చూపించారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీజేపీకి దీటుగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుదామని ఆయన ప్రతిపాదించారు. కానీ ఇదెంతవరకు కార్యరూపం దాలుస్తోందన్న అనుమానాలున్నాయి.
♦ ప్రాంతీయ పార్టీ ల మధ్య నెలకొన్న రాజకీయ శత్రుత్వం విపక్షాల ఐక్యతకు అసలు సిసలైన సవాల్‌గా నిలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉప్పు నిప్పుగా ఉన్న టీఎంసీ, లెఫ్ట్ పార్టీ లను ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమనే అభిప్రాయాలున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి వాటితో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు
♦ సీట్ల సర్దుబాటు అన్నది లెక్కకు మించిన పార్టీ ల మధ్య సవ్యంగా జరగడం అతి పెద్ద సవాల్. పశ్చిమ బెంగాల్, అస్సాం, జార్ఖండ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా కనిపించడం లేదు. ఈ రాష్ట్రాల్లోనే 172 లోక్‌సభ స్థానాలున్నాయి.
♦ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ , రాజస్తాన్‌లలో తాము పోటీకి దిగమని హామీ ఇస్తోంది కానీ తమకు గట్టి పట్టున్న న్యూఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీపడకూడదని షరతు విధిస్తోంది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధిక సంఖ్యలో సీట్లు కాంగ్రెస్‌కుకేటాయించడానికి సిద్ధంగా లేరు.
♦ బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టసాధ్యమని నితీశ్ కుమార్ అభిప్రాయంగా ఉంది. ఆ దిశగా ఆయన ఎంతవరకు ఒప్పించగలరన్నది సందేహమే.
♦ ప్రధాని మోదీకున్న చరిష్మాను తట్టుకొని నిలబడాలంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజీపడి ఇతర పార్టీ లకు దగ్గరవాలని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
♦ ఈ సవాళ్లన్నింటిని అధిగమించడం ఇప్పుడే సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుత సమావేశం దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన ధరాభారం, నిరుద్యోగంతో పాటు మతం పేరుతో సమాజాన్ని చీల్చే చర్యలకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట వ్యూహాన్ని చర్చించడానికి పరిమితమయ్యే అవకాశాలున్నాయి
ఒకవైపు విపక్ష పార్టీ లన్నీ ఏకం కావడానికి సర్వ శక్తులు ఒడ్డుతూ ఉంటే అధికార ఎన్డీయే నుంచి ఇప్పటికే ఎన్నో పార్టీ లు దూరమయ్యాయి. మళ్లీ వారందరితోనూ జత కట్టడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వయం దృష్టి పెట్టారు. మహారాష్ట్రలో శివసేన దూరమయ్యాక ఆ పార్టీని చీల్చి ఏక్‌నాథ్ షిండేని సీఎంను చేసిన బీజేపీకి ఇప్పుడు ఆయన వైఖరి కూడా కొరుకుడు పడడం లేదు.
మహారాష్ట్రలో బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేకి జనాదరణ అధికంగా ఉందని పేపర్‌లో ప్రకటన ఇవ్వడం బీజేపీకి మింగుడు పడడం లేదు.తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై జయలలితపై చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది.
ఇక బీహార్‌లో నితీశ్ కుమార్ జేడీ (యూ) దూరమయ్యాక ఎన్నికల్లో బీజేపీ నష్టపోతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైంది. ఇటీవల ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో జరిగిన సమావేశంలో తమతో కలిసే మిత్రపక్షాలను కలుపుకొని పోవాలని మోదీ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
♦కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసిన పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ను కూడా తిరిగి ఎన్డీయే గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
♦ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీ(ఎస్) ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపాలని కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. బీహార్‌లో కులప్రాతిపదికన చిన్న పార్టీ లను కలుపుకొని వెళితే మేలన్న యోచనలో బీజేపీ ఉంది. లోక్‌జనశక్తి పార్టీ (చిరాగ్ చీలిక వర్గం) ఎన్డీయేకి దూరమవకుండా చర్యలు తీసుకుంటూనే హిందూస్తాన్ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) దగ్గరకు తీసుకునే చర్యలు చేపడుతోంది. నితీశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే ఇటీవల విభేదాల కారణంగా బయటకు వచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముకేశ్ సాహ్నితో కూడా మంతనాలు సాగిస్తోంది.
♦ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఓం ప్రకాశ్ రాజ్‌బహార్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తో మంతనాలు సాగిస్తోంది. బీజేపీ యూపీ అధ్యక్షుడు చౌధరి భూపేంద్ర సింగ్ వారణాసిలో జరిగిన రాజ్‌బహార్ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా అన్ని వైపుల నుంచి ఎన్డీయేని బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది.
- సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment