ఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయాల నేపథ్యంలో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఇండియా కూటమిలో చీలికలను సంకేతాలిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోయే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. హర్యానాలో కాంగ్రెస్ విజయం పక్కా అనుకున్నప్పటికీ హర్యానాలో ఓటమి.. మహారాష్ట్రలో కూడా దారుణ ఫలితాలు రావడంతో ఇండియా కూటమిలో లుకలుకలు చోటుచేసుకున్నాయి. మొదటి నుంచి ఇండియా కూటమిలో వ్యతిరేక స్వరం వినిపిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బిగ్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ కు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తృణమూల్ కాంగ్రెస్.
పార్లమెంట్ సమావేశాల వేళ కూటమిలో చీలికకు సంకేతాలిస్తూ కాంగ్రెస్ తీరుపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు చేశారు. అలాగే, మిత్రపక్షం కాంగ్రెస్ నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంప్ కాబోదని టీఎంసీ పేర్కొంది. పార్లమెంట్ లో బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తే విధంగా సభను నిర్వహించాలని కోరింది. అవినీతిపై పార్లమెంట్‌లో చర్చ కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలనుకుంటున్నట్టు టీఎంసీ వెల్లడించింది. బెంగాల్ కు నిధుల కొరత ఉంది. కేంద్రం నుంచి నిధుల రావాల్సి ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పార్లమెంట్ లో చర్చించాలనుకుంటున్నాం అని టీఎంసీ సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లోనూ, పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా పోటీ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఉపఎన్నికలలో మొత్తం ఆరు స్థానాలను, లోక్‌సభ ఎన్నికలలో 40 నియోజకవర్గాలలో 29 స్థానాలను గెలుచుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చెందడంపై కూడా టీఎంసీ ఘాటు విమర్శలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment