కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది.
పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు.
తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి.
28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి.
ఆది నుంచీ అంతంతే...
విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది.
ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి.
పంజాబ్‌లో ఒంటరి పోరే
సీఎం భగవంత్ మాన్ వెల్లడి
పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి.
కూటమిపై ఎవరికీ పెత్తనముండదు
మమత నర్మగర్భ వ్యాఖ్యలు
బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు.
‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది!
Comments
Please login to add a commentAdd a comment