రేప్పొద్దున ఏమైనా జరగొచ్చు: మమత
టీడీపీ, జేడీయూ మాకూ మిత్రులే
కోల్‌కతా: సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారం కోసం ప్రయతి్నంచనంత మాత్రాన రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోమని కాదన్నారు. తృణమూల్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని చెప్పారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని బలహీన, అస్థిర ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోతే సంతోషిస్తాను.
దేశం మార్పు కోరుతోంది. తాజా ప్రజాతీర్పు మార్పు కోసమే. ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు. కనుక ఆయన ప్రధాని పదవి చేపట్టకుండా మరొకరికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది’’ అని మమత అన్నారు. కొత్తగా ఎంపికైన తృణమూల్ ఎంపీలతో మమత శనివారం సమావేశమయ్యారు. మోదీ ప్రమాణస్వీకారానికి తృణమూల్ దూరంగా ఉంటుందని తెలిపారు.
బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ‘‘బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మిత్రపక్షాలపై ఆధారపడుతోంది. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో, ఎంతవరకు బండిని లాగుతుందో చూద్దాం. పదేళ్లుగా ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదించుకునేది. ఇక అలా కుదరదు. రాజ్యాంగాన్ని కూడా మార్చలేరు’’ అని మమత అన్నారు.
ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూ గురించి అడగ్గా.. ‘వారు మా మిత్రులు కూడా. టీడీపీ, జేడీయూలు మాతో లేవని మీకెవరు చెప్పారు?’ అని మమత ప్రశ్నించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ల ప్రభావితం చేశారని, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని టీఎంసీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభల్లో డిమాండ్ చేస్తారని తెలిపారు. బెంగాల్ 42 స్థానాలకు గాను టీఎంసీ 29 సీట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీప్ బందోపాధ్యాయ్‌ను లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేతగా మమత నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment