govt formation
-
సమీప భవిష్యత్తులో ఇండియా కూటమి సర్కారు
కోల్‌కతా: సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారం కోసం ప్రయతి్నంచనంత మాత్రాన రాబోయే రోజుల్లో ప్రయత్నం చేయబోమని కాదన్నారు. తృణమూల్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని చెప్పారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని బలహీన, అస్థిర ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోతే సంతోషిస్తాను. దేశం మార్పు కోరుతోంది. తాజా ప్రజాతీర్పు మార్పు కోసమే. ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు. కనుక ఆయన ప్రధాని పదవి చేపట్టకుండా మరొకరికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది’’ అని మమత అన్నారు. కొత్తగా ఎంపికైన తృణమూల్ ఎంపీలతో మమత శనివారం సమావేశమయ్యారు. మోదీ ప్రమాణస్వీకారానికి తృణమూల్ దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ‘‘బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మిత్రపక్షాలపై ఆధారపడుతోంది. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో, ఎంతవరకు బండిని లాగుతుందో చూద్దాం. పదేళ్లుగా ఎలాంటి చర్చలు లేకుండానే బిల్లులు ఆమోదించుకునేది. ఇక అలా కుదరదు. రాజ్యాంగాన్ని కూడా మార్చలేరు’’ అని మమత అన్నారు. ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూ గురించి అడగ్గా.. ‘వారు మా మిత్రులు కూడా. టీడీపీ, జేడీయూలు మాతో లేవని మీకెవరు చెప్పారు?’ అని మమత ప్రశ్నించారు. ఫేక్ ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ల ప్రభావితం చేశారని, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని టీఎంసీ ఎంపీలు రాజ్యసభ, లోక్‌సభల్లో డిమాండ్ చేస్తారని తెలిపారు. బెంగాల్ 42 స్థానాలకు గాను టీఎంసీ 29 సీట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీప్ బందోపాధ్యాయ్‌ను లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేతగా మమత నియమించారు. -
‘మహా’ గుణపాఠం!
మహారాష్ట్రలో దాదాపు నెలరోజులుగా ఎడతెగకుండా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి, ప్రత్యేకించి చివరి మూడురోజుల్లోనూ చోటుచేసుకున్న చిత్ర విచిత్ర నాటకీయ మలుపులకు సర్వోన్నత న్యాయ స్థానం మంగళవారం సరైన ముగింపు పలికింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా ముగిసి, ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్దేశించింది. ఆ ఆదేశాలొచ్చిన కొద్ది సేపటికి ఏం జరగాలో అదే జరి గింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదవి నుంచి వైదొలిగారు. ‘స్వగృహ ప్రవేశం’ చేశారు. రాజ్యాంగ దినోత్సవం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదని చెప్పాలి. ఒక పార్టీకి లేదా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పర్చగల సత్తా ఉన్నదో లేదో తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాదని 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని ఈ తప్పిదాలను సరిచేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడిచ్చిన ఆదేశాలు కూడా ఆ కోవలోనివే అయినా...తక్షణం బలనిరూపణ జరగాలని నిర్దేశించిన తీరు అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదో లేదో నిర్ధారించడం తక్షణావసరమని ధర్మాసనం భావించింది. చట్టవిరుద్ధమైన రాజకీయ బేరసారాల వంటివి చోటు చేసుకోకుండా అడ్డుకోవడానికి, ఏ రకమైన అనిశ్చితికి తావీయకుండా ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి ఇది తోడ్పడుతుందని తెలిపింది. బలపరీక్షకు అధిక సమయం ఇవ్వడం విష యంలో న్యాయమూర్తులకున్న అనుమానాలే దేశంలో చాలామందికి ఉన్నాయి. ఫడ్నవీస్‌తో సీఎంగా ప్రమాణం చేయించాక, బల నిరూపణకు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి ఆయనకు 14 రోజుల సమయం ఇచ్చారు. ఇంత ఎక్కువ వ్యవధి నిస్సందేహంగా రాజకీయ బేరసారాలకు తావిస్తుంది. వివిధ పార్టీలను సంక్షోభంలో పడేస్తుంది. అన్నిటికీమించి రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఆ రాష్ట్రం ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదో అడపా దడపా మీడియాలో కథనాలు వెలువడు తూనే ఉన్నాయి. మరఠ్వాడా ప్రాంతంలో ఈ నెల రోజుల్లోనే 68మంది అన్నదాతలు బలవన్మరణా లకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో అవసరమైనకంటే ఒక్కరోజు కూడా అదనంగా అవకాశం ఇవ్వకూ డదు. కనుకనే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు అన్నివిధాలా కొనియాడదగ్గవి. అయితే మహారాష్ట్రలో సాగిన రాజకీయ డ్రామా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనా, భిన్న రాజ కీయ సిద్ధాంతాలపైనా విశ్వాసమున్న కోట్లాదిమందిని సంశయాల్లో పడేసింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి రెండు కూటములు చెరోవైపూ మోహరించాయి. హిందూత్వ సిద్ధాంతాన్ని ఆచరించే పార్టీలుగా బీజేపీ, శివసేనలు ఒక కూటమిగా... ఆ సిద్ధాంతాన్ని ప్రతిఘటించే పార్టీలుగా కాంగ్రెస్, ఎన్సీపీలు మరో కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు చూస్తే అంతా తారు మారైంది. సిద్ధాంతాల రాద్ధాంతం లేకుండా, ఎన్నికల ముందు కూటములతో సంబంధం లేకుండా పార్టీలన్నీ రంగులు మార్చాయి. ఇందులో ఎవరు దోషులు, ఎవరు కాదన్న విచికిత్సకు తావులేదు. అందరూ అందరే అని నిరూపించుకున్నారు. కనీసం తమ వెనకున్న లక్షలాదిమంది కార్యకర్తలు, తమను నమ్మి సమర్థిస్తూ వస్తున్న కోట్లాదిమంది ప్రజానీకం ఏమనుకుంటారోనన్న కనీస ఆలోచన కూడా వారికి లేకపోయింది. బీజేపీ–శివసేన కూటమి అయిదేళ్ల పాలన చూశాక జనం ఆ కూటమికి మెజారిటీనిచ్చారు. అంతక్రితంతో పోలిస్తే ఆ కూటమి మెజారిటీ తగ్గిన మాట వాస్తవమే అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఆ కూటమికి మాత్రమే ఉంది. కానీ ఆ రెండు పార్టీల మధ్యా ముఖ్య మంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలొచ్చి అవి విడిపోయాయి. పర్యవసానంగా తాము ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేమని బీజేపీ చేతులెత్తేసింది. ఇంతవరకూ అంతా పద్ధతిగానే సాగింది. కానీ శివసేన హఠాత్తుగా ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చర్చోపచర్చలు సాగించి ఆ రెండు పక్షాలతో కలిసి కొత్త కూటమికి సిద్ధపడి సర్కారు ఏర్పాటు కోసం సన్నాహాలు చేసుకుంది. దాంతో బీజేపీ మొన్న శుక్రవారం రాత్రంతా మేల్కొని తెల్లారేసరికల్లా మరో కొత్త కూటమికి ప్రాణప్రతిష్ట చేయడమే కాదు... ఏకంగా అధికార పగ్గాలే చేతుల్లోకి తీసుకుంది. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని రెండు కాంగ్రెస్ లతో శివసేన కూటమి కట్టడం ఎంత తప్పో, నేషనలిస్టు కరప్ట్ పార్టీగా అభివర్ణించిన ఎన్సీపీతో బీజేపీ ఆదరాబాదరాగా చేతులు కలపడం కూడా అంతే తప్పు. పైగా తాము చేతులు కలిపింది ఎన్సీపీ తోనా, ఆ పార్టీలో శరద్ పవార్ ఆశీస్సులు లేకుంటే గుండు సున్నాగా మిగిలే అజిత్ పవార్తోనా అన్నది కూడా అది చూసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రపతి మొదలుకొని ప్రధాని, రాష్ట్ర గవర్నర్ వరకూ అందరికీ మరక అంటింది. రాష్ట్రపతి పాలన ఎత్తేయడానికి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అధికార వ్యవస్థలో పైనుంచి కిందివరకూ అందరికందరూ చూపిన తొందరపాటుతనం మన గణతంత్రాన్ని నవ్వులపాలు చేసింది. కనీసం సమర్థించుకోవడానికి కూడా తడబడే దుస్థితికి బీజేపీని దిగజార్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికైతే అంతా సర్దుకుంది. అంతా సవ్యంగా జరిగితే గురువారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ అఘాదీ’ అధికార పగ్గాలు చేపట్టాలి. అయితే పరస్పరం పొసగని మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం సుస్థిర పాలన అంది స్తుందా, సజావుగా మనుగడ సాగిస్తుందా అన్నది చూడాల్సివుంది. కనీసం మహారాష్ట్ర అనుభవంతో నైనా గవర్నర్లు రాజకీయ డ్రామాల్లో తలదూర్చకుంటే అదే పదివేలు. -
వరుస భేటీలతో వేడెక్కిన మహా రాజకీయం
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధికార పంపకంపై చిక్కుముడి వీడకపోవడంతో బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. ఎన్సీపీ మద్దతు కోసం శివసేన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. శివసేన సర్కార్ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా సంజయ్ రౌత్ పవార్‌ను కోరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై పవార్‌తో తాను చర్చించానని రౌత్ చెప్పారు. మహారాష్ట్ర పరిణామాలపై ఆయన ఆవేదన చెందారని అన్నారు. కాగా బీజేపీతో పాటు ఎన్డీఏతో సంబంధాలు తెంచుకుంటే ప్రత్యామ్నాయంపై తాము ఆలోచిస్తామని ఈ సందర్భంగా శరద్ పవార్ స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు మహారాష్ట్రలో మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ల సమావేశం పలు ఊహాగానాలకు తావిచ్చింది. అయితే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, రైతాంగ సమస్యలపైనే గడ్కరీతో సమావేశమయ్యానని అహ్మద్ పటేల్ వివరణ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా సాగితే అందులో శివసేన తప్పేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
'ఆ అధికారం ముఫ్తీకి అప్పగిస్తున్నాం'
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆదివారం జరిగిన పీడీపీ కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. అదేవిధంగా గతంలో కొనసాగినట్టే బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగే అవకాశముందని సంకేతాలు ఇచ్చింది. ఇటీవల మృతి చెందిన ముఖ్యమంత్రి మహమ్మద్ సయీద్ సంకీర్ణ ప్రభుత్వ అజెండాను పవిత్ర పత్రంగా భావించారని, అదేవిధంగా కొనసాగాలని ఇప్పుడు పార్టీ కూడా భావిస్తున్నదని పీడీపీ నేత నయీం అఖ్తర్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి డెడ్‌లైన్ విధించుకోలేదని ఆయన విలేకరులకు చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా పీడీపీతో తమ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ఉంటే తమకేమీ అభ్యంతరం లేదని తెలిపింది. -
కమలంలో కలవరం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలా? లేక ఎన్నికలకు వెళ్లాలా? అన్న విషయంపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న బీజేపీ నేతలు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలతో మరింత అయోమయంలో పడ్డారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్చుతో ఢిల్లీలో ఎన్నికలు జరిపించాలని కోరుకుంటున్నవారే కాకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని అంటున్నవారు కూడా పునరాలోచనలో పడ్డారు. తమ డిమాండ్ ప్రకారం అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు జరిపించినట్లయితే తాము ఆశిస్తున్నట్లుగా లోక్‌సభ ఎన్నికలలో సాధించినటువంటి ఘన విజయాన్ని, భారీ మెజారిటీని సాధించగలమా అన్న సంశయం ఎన్నికలను కోరుకుంటున్న బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరికొందరైతే మెజార్టీ మాట అటుంచి గెలుస్తామా? లేదా? అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగోలా ప్రభుత్వం ఏర్పాటుచేసినా, పార్లమెంటుకు ఎన్నికైన ముగ్గురు బీజేపీ నేతలు ఖాళీ చేసిన శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక జరిపించవలసి వస్తుందని, ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండకపోతే దాని ప్రభావం ప్రభుత్వంపై కూడా పడుతుందనే భయం.. సర్కారు ఏర్పాటును కోరుకుంటున్న నేతలలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా? లేక ఎన్నికలు జరిపించాలా? అన్నది నిర్ణయించడం అంత సులువైన విషయం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే డాక్టర్ హర్షవర్ధన్, ప్రవేశ్ వర్మ, రమేష్ బిధూరీ ఖాళీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఎదుర్కోవలసివస్తుంది. వీటిలో ఏ ఒక్క సీటు ఓడిపోయినా అసెంబ్లీలో సంఖ్యాబలం తారుమారవుతుంది. అది కాదని ఎన్నికలకే వెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజారీ వస్తుందో? లేదో కచ్చితంగా చెప్పలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
సోనియాతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ
-
ఒక్క ఛాన్సివ్వండి ప్లీజ్
-
'ప్రభుత్వం ఏర్పాటు చర్చకు రాలేదు'
-
ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని తమ పార్టీ రేపు ఉదయం వెల్లడిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం కేజ్రీవాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఏర్పాటుపై తమ పార్టీలో నిరంతరాయంగా చర్చల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆ చర్చల ప్రక్రియ నేటి సాయంత్రానికి ఓ కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేసేందుకు మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అందుకోసం పలువురు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై హస్తిన ప్రజలను వచ్చిన ప్రతి ఒక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆమ్ ఆద్మీ పార్టీ డోలాయమానంలో ఉందన్న మాజీ ఐపీఎస్ అధికారి, హక్కుల కార్యకర్త కిరణ్ బేడీ వ్యాఖ్యలను ఈ సందర్బంగా విలేకర్లు ప్రస్తావించారు. ఆమె వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందని కేజ్రీవాల్ తెలిపారు.