
మహారాష్ట్రలో దాదాపు నెలరోజులుగా ఎడతెగకుండా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి, ప్రత్యేకించి చివరి మూడురోజుల్లోనూ చోటుచేసుకున్న చిత్ర విచిత్ర నాటకీయ మలుపులకు సర్వోన్నత న్యాయ స్థానం మంగళవారం సరైన ముగింపు పలికింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా ముగిసి, ఆ వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాలని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిర్దేశించింది. ఆ ఆదేశాలొచ్చిన కొద్ది సేపటికి ఏం జరగాలో అదే జరి గింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పదవి నుంచి వైదొలిగారు.
‘స్వగృహ ప్రవేశం’ చేశారు. రాజ్యాంగ దినోత్సవం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం మహారాష్ట్ర విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదని చెప్పాలి. ఒక పార్టీకి లేదా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పర్చగల సత్తా ఉన్నదో లేదో తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్‌లలో కాదని 1994లో ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని ఈ తప్పిదాలను సరిచేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడిచ్చిన ఆదేశాలు కూడా ఆ కోవలోనివే అయినా...తక్షణం బలనిరూపణ జరగాలని నిర్దేశించిన తీరు అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదో లేదో నిర్ధారించడం తక్షణావసరమని ధర్మాసనం భావించింది.
చట్టవిరుద్ధమైన రాజకీయ బేరసారాల వంటివి చోటు చేసుకోకుండా అడ్డుకోవడానికి, ఏ రకమైన అనిశ్చితికి తావీయకుండా ప్రజాస్వామ్యం సజావుగా సాగడానికి ఇది తోడ్పడుతుందని తెలిపింది. బలపరీక్షకు అధిక సమయం ఇవ్వడం విష యంలో న్యాయమూర్తులకున్న అనుమానాలే దేశంలో చాలామందికి ఉన్నాయి. ఫడ్నవీస్‌తో సీఎంగా ప్రమాణం చేయించాక, బల నిరూపణకు గవర్నర్ భగత్‌సింగ్ కోషియారి ఆయనకు 14 రోజుల సమయం ఇచ్చారు. ఇంత ఎక్కువ వ్యవధి నిస్సందేహంగా రాజకీయ బేరసారాలకు తావిస్తుంది. వివిధ పార్టీలను సంక్షోభంలో పడేస్తుంది. అన్నిటికీమించి రాజకీయ అస్థిరతకు దారితీస్తుంది. ఆ రాష్ట్రం ఎన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నదో అడపా దడపా మీడియాలో కథనాలు వెలువడు తూనే ఉన్నాయి. మరఠ్వాడా ప్రాంతంలో ఈ నెల రోజుల్లోనే 68మంది అన్నదాతలు బలవన్మరణా లకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో అవసరమైనకంటే ఒక్కరోజు కూడా అదనంగా అవకాశం ఇవ్వకూ డదు. కనుకనే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు అన్నివిధాలా కొనియాడదగ్గవి.
అయితే మహారాష్ట్రలో సాగిన రాజకీయ డ్రామా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనా, భిన్న రాజ కీయ సిద్ధాంతాలపైనా విశ్వాసమున్న కోట్లాదిమందిని సంశయాల్లో పడేసింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయానికి రెండు కూటములు చెరోవైపూ మోహరించాయి. హిందూత్వ సిద్ధాంతాన్ని ఆచరించే పార్టీలుగా బీజేపీ, శివసేనలు ఒక కూటమిగా... ఆ సిద్ధాంతాన్ని ప్రతిఘటించే పార్టీలుగా కాంగ్రెస్, ఎన్సీపీలు మరో కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు చూస్తే అంతా తారు మారైంది. సిద్ధాంతాల రాద్ధాంతం లేకుండా, ఎన్నికల ముందు కూటములతో సంబంధం లేకుండా పార్టీలన్నీ రంగులు మార్చాయి. ఇందులో ఎవరు దోషులు, ఎవరు కాదన్న విచికిత్సకు తావులేదు. అందరూ అందరే అని నిరూపించుకున్నారు. కనీసం తమ వెనకున్న లక్షలాదిమంది కార్యకర్తలు, తమను నమ్మి సమర్థిస్తూ వస్తున్న కోట్లాదిమంది ప్రజానీకం ఏమనుకుంటారోనన్న కనీస ఆలోచన కూడా వారికి లేకపోయింది.
బీజేపీ–శివసేన కూటమి అయిదేళ్ల పాలన చూశాక జనం ఆ కూటమికి మెజారిటీనిచ్చారు. అంతక్రితంతో పోలిస్తే ఆ కూటమి మెజారిటీ తగ్గిన మాట వాస్తవమే అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఆ కూటమికి మాత్రమే ఉంది. కానీ ఆ రెండు పార్టీల మధ్యా ముఖ్య మంత్రి పదవిని పంచుకోవడంపై విభేదాలొచ్చి అవి విడిపోయాయి. పర్యవసానంగా తాము ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేమని బీజేపీ చేతులెత్తేసింది. ఇంతవరకూ అంతా పద్ధతిగానే సాగింది. కానీ శివసేన హఠాత్తుగా ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో చర్చోపచర్చలు సాగించి ఆ రెండు పక్షాలతో కలిసి కొత్త కూటమికి సిద్ధపడి సర్కారు ఏర్పాటు కోసం సన్నాహాలు చేసుకుంది. దాంతో బీజేపీ మొన్న శుక్రవారం రాత్రంతా మేల్కొని తెల్లారేసరికల్లా మరో కొత్త కూటమికి ప్రాణప్రతిష్ట చేయడమే కాదు... ఏకంగా అధికార పగ్గాలే చేతుల్లోకి తీసుకుంది. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని రెండు కాంగ్రెస్ లతో శివసేన కూటమి కట్టడం ఎంత తప్పో, నేషనలిస్టు కరప్ట్ పార్టీగా అభివర్ణించిన ఎన్సీపీతో బీజేపీ ఆదరాబాదరాగా చేతులు కలపడం కూడా అంతే తప్పు. పైగా తాము చేతులు కలిపింది ఎన్సీపీ తోనా, ఆ పార్టీలో శరద్ పవార్ ఆశీస్సులు లేకుంటే గుండు సున్నాగా మిగిలే అజిత్ పవార్‌తోనా అన్నది కూడా అది చూసుకోలేదు.
ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రపతి మొదలుకొని ప్రధాని, రాష్ట్ర గవర్నర్ వరకూ అందరికీ మరక అంటింది. రాష్ట్రపతి పాలన ఎత్తేయడానికి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అధికార వ్యవస్థలో పైనుంచి కిందివరకూ అందరికందరూ చూపిన తొందరపాటుతనం మన గణతంత్రాన్ని నవ్వులపాలు చేసింది. కనీసం సమర్థించుకోవడానికి కూడా తడబడే దుస్థితికి బీజేపీని దిగజార్చింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికైతే అంతా సర్దుకుంది. అంతా సవ్యంగా జరిగితే గురువారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ‘మహా వికాస్ అఘాదీ’ అధికార పగ్గాలు చేపట్టాలి. అయితే పరస్పరం పొసగని మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం సుస్థిర పాలన అంది స్తుందా, సజావుగా మనుగడ సాగిస్తుందా అన్నది చూడాల్సివుంది. కనీసం మహారాష్ట్ర అనుభవంతో నైనా గవర్నర్లు రాజకీయ డ్రామాల్లో తలదూర్చకుంటే అదే పదివేలు.
Comments
Please login to add a commentAdd a comment