మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది అక్టోబరు- నవంబరులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తరుఫు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సిన అవసరం లేదని, కూటమి సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని శరద్ పవార్ స్పష్టం చేశారు. అయితే విపక్ష కూటమికి సీఎం అభ్యర్థిగా శివసేన (యుబిటి)కి నేతృత్వం వహిస్తున్న ఉద్ధవ్ ఠాక్రేను ఖరారు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఈ సందర్భంగా సీఎం అభ్యర్థి ఎవరు? అనేది సంఖ్యా బలాన్ని బట్టి నిర్ణయించాలి. ఎన్నికల ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని శరద్ పవార్ తెలిపారు. సీఎం అభ్యర్థి ఎవరు అని తేల్చకుండా ఎన్నికల ప్రచారం, గెలుపుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదంటూ నాటి ఎమర్జెన్సీ (1977) సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల గురించి ప్రస్తావించారు.
ఎమర్జెన్సీ సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తర్వాతనే ప్రధాని మొరార్జీ దేశాయ్‌ని జనతా పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల ప్రచారంలో పీఎం అభ్యర్థి పేరు చెప్పి ఓట్లు అడగలేదు. ఇప్పుడు కూడా అంతే.. సీఎం ఎవరు? అనేది ఆలోచించాల్సిన సందర్భం కాదు. కలిసి ఎన్నికల బరిలోకి దిగుదాం. ప్రజల మద్దతు లభించిన తర్వాత.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిందాం’ అని శరద్ పవార్ పిలుపునిచ్చారు.
డైలమాలో కాంగ్రెస్
రానున్న ఎన్నికల్లో మహావికాస్ అఘాడి కూటమికి సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చడంలో కాంగ్రెస్ సైతం డైలమాలో ఉంది. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని శివసేన (యుబిటి) ఒత్తిడి చేస్తుండగా..అదే సమయంలో, ఉద్ధవ్‌ను సంకీర్ణ ప్రచార సారథిగా చేయాలని కాంగ్రెస్ యోచిస్తుందనే వార్తలు మహా పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నాయి.
288 అసెంబ్లీ స్థానాల్లో
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి కూటమిగా పోటీ చేయనున్నాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపా 160-170 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment