
ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తాం: కేజ్రీవాల్
న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని తమ పార్టీ రేపు ఉదయం వెల్లడిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం కేజ్రీవాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఏర్పాటుపై తమ పార్టీలో నిరంతరాయంగా చర్చల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆ చర్చల ప్రక్రియ నేటి సాయంత్రానికి ఓ కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేసేందుకు మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అందుకోసం పలువురు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై హస్తిన ప్రజలను వచ్చిన ప్రతి ఒక్క విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆమ్ ఆద్మీ పార్టీ డోలాయమానంలో ఉందన్న మాజీ ఐపీఎస్ అధికారి, హక్కుల కార్యకర్త కిరణ్ బేడీ వ్యాఖ్యలను ఈ సందర్బంగా విలేకర్లు ప్రస్తావించారు. ఆమె వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందని కేజ్రీవాల్ తెలిపారు.