![Maharastra Politics Turned Into Heat Mode - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/6/Sharad.jpg.webp?itok=B_x55Rfh)
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధికార పంపకంపై చిక్కుముడి వీడకపోవడంతో బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. ఎన్సీపీ మద్దతు కోసం శివసేన ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. శివసేన సర్కార్ ఏర్పాటుకు సహకరించాలని ఈ సందర్భంగా సంజయ్ రౌత్ పవార్‌ను కోరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై పవార్‌తో తాను చర్చించానని రౌత్ చెప్పారు. మహారాష్ట్ర పరిణామాలపై ఆయన ఆవేదన చెందారని అన్నారు.
కాగా బీజేపీతో పాటు ఎన్డీఏతో సంబంధాలు తెంచుకుంటే ప్రత్యామ్నాయంపై తాము ఆలోచిస్తామని ఈ సందర్భంగా శరద్ పవార్ స్పష్టం చేసినట్టు తెలిసింది. మరోవైపు మహారాష్ట్రలో మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టాలని భావిస్తున్న బీజేపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌ల సమావేశం పలు ఊహాగానాలకు తావిచ్చింది. అయితే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, రైతాంగ సమస్యలపైనే గడ్కరీతో సమావేశమయ్యానని అహ్మద్ పటేల్ వివరణ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా సాగితే అందులో శివసేన తప్పేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Comments
Please login to add a commentAdd a comment