ముంబై: జాతీయ స్థాయిలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకున్న విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం ప్రారంభం కానుంది. గ్రాండ్ హయత్ హోటల్‌లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు 27 పార్టీలకు పైగా హాజరు కానున్నట్టు చెబుతున్నారు. కూటమి లోగోను, సమన్వయ కమిటీని ప్రకటించనున్నారు. కూటమి పక్షాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. దీనిపై ముంబై భేటీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి సమన్వయకర్త, లేదా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం గురించి కూడా చర్చ జరగనుంది. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న అధికార ఎన్డీయేకు ప్రగతిశీల ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొస్తూ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముంబై భేటీలో ఖరారు చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు.
’బీజేపీ వెళ్లిపో’ నినాదం
ఇండియా కూటమిలో ప్రస్తుతం 26 పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ముంబై భేటీ సందర్భంగా మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరనున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. ఇండియా తొలి రెండు సమావేశాలు పాట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో గురువారం నుంచి జరుగనున్న మూడో భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు నగరానికి చేరుకున్నారు. ఈ భేటీ వేదిక నుంచి ’బీజేపీ చలే జావ్’ (బీజేపీ వెళ్లిపో) అనే నినాదం ఇవ్వబోతున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. ప్రధానమంత్రికి పదవికి అర్హులైన నాయకులు తమ కూటమిలో చాలామంది ఉన్నారని తెలిపారు. వారిలో శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. ఇండియా పక్షాల నడుమ ‘కెమిస్ట్రీ’ మెరుగుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మిలింద్ దేవ్‌రా వ్యాఖ్యానించారు. తమ కూటమిలో సీట్ల పంపకం రాష్ట్రాల స్థాయిలోనే జరుగుతుందని వివరించారు.
కన్వీనర్‌గా నితీశ్!
ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కూటమి ఏర్పాటు వెనుక తనకు వ్యక్తిగత అ జెండా గానీ, ఆకాంక్షలు గానీ లేవని, కన్వీనర్ పోస్టుపై తనకు ఆసక్తి లేదని ఆయన ప్రకటించినప్పటికీ ఊహాగానాలు ఆగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టే నేత నితీశ్‌కుమార్ మాత్రమేనని అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పేరును మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఆ పదవి పట్ల ఆమె విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కన్వీనర్‌గా ఎవరుండాలో గురువారమే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు.
నేటి నుంచే... ‘ఇండియా’ మూడో భేటీ
Published Thu, Aug 31 2023 5:44 AM | Last Updated on Thu, Aug 31 2023 5:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment