ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్), భావన గౌర్ (పాలం), బీఎస్ జూన్ (బిజ్వాసన్) పార్టీని వీడారు. ప్రస్తుత ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో రాజీనామా బాట పట్టారు.
జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్‌కు రాజీనామా లేఖ పంపారు. లేఖలో పార్టీ అవినీతిలో మునిగిపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. దయ చేసి నా రాజీనామాను ఆమోదించండి’ అంటూ భావనా గౌర్ తన లేఖలో పేర్కొన్నారు.
పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. తొలుత ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఖురాన్‌ను అవమానించిన కేసులో యాదవ్‌కు పంజాబ్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో ఆప్.. టికెట్ నిరాకరించింది. మరో ఐదు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గెలుపే లక్ష్యంగా అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. హామీల వర్షం గుప్పిస్తూ.. ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగలినట్లయింది.
ఇదీ చదవండి: రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు
కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. నిన్న(గురువారం) మీడియాతో మాట్లాడుతూ, యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment