
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్‌లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది.
భూపేంద్ర పటేల్ రాజీనామా
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.
ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి?
Comments
Please login to add a commentAdd a comment