ఏడాది క్రితం వరకూ బలహీనమవుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో విజయానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కనిష్ట స్థాయిలో 44 లోక్‌సభ సీట్లు సాధించింది. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి అవసరమైన పది శాతం సీట్లు (55) కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. అప్పటి నుంచి మూడున్నరేళ్ల వరకూ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కేంద్రంలో పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ, దాని మిత్రపక్షాలకు అత్యధిక రాష్ట్రాల్లో అధికారం అప్పగించింది. 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ కిందటేడాది మార్చి నాటికి అధికారంలో ఉన్న రాష్ట్రాలు నాలుగే (కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు పంజాబ్, కర్ణాటక, మిజోరం).
బీజేపీ చేతిలో చిత్తు
కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ హోదాలో సోనియానే ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్నారని, మన్మోహన్ బలహీనుడైన ప్రధాని అనే బీజేపీ ప్రచారం జనంలో పనిచేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించడం కూడా ఎన్డీఏ ఘన విజయానికి, బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు కైవసం చేసుకోవడానికి దోహదం చేసింది. ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ కొత్త నాయకత్వానికి తోడు, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో యూపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఆయన చెల్లెలు ప్రియాంకకు అప్పగించడంతో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమౌతోంది. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ హత్యకు గురయ్యాక సోనియా గాంధీ ఏడేళ్లపాటు పార్టీ నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. అధ్యక్ష పదవిలో ఆరేళ్లు కొనసాగాక ఆమె కాంగ్రెస్‌ను 2004లో విజయ పథంలో నడిపించారు. పార్టీ అధ్యక్ష పదవి దక్కిన ఏడాదిన్నరకు రాహుల్ కాంగ్రెస్‌కు మళ్లీ అధికారంలోకి వచ్చేలా పార్టీని నడిపిస్తారన్న నమ్మకం లేకున్నా మోదీ సర్కారు వైఫల్యాలే బీజేపీని ఓడిస్తాయనే ఆశ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఇతర ప్రతిపక్షాలతో కాంగ్రెస్‌కు పొత్తులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఫేల్ కుంభకోణం, నిరుద్యోగమే అస్త్రాలుగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌కు 2019 లోక్‌సభ ఎన్నికలు నిజంగా పెద్ద సవాలే.
కొత్తగా జవసత్వాలు
గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల–రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయం సాధించాక 17వ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ఆశతో ముందుకు సాగుతోంది. కిందటేడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సాధించకపోయినా జనతాదళ్(ఎస్)తో కలిసి సంకీర్ణ భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించడం కాంగ్రెస్‌కు కొత్త ఊపునిచ్చింది. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అత్యధిక ప్రతిపక్షాల నేతలు హాజరుకావడం కూడా కాంగ్రెస్‌కు ఇతర పార్టీల నుంచి మద్దతు, గుర్తింపు లభించింది. 1998 మార్చిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియాగాంధీ 2017 డిసెంబర్‌లో రాహుల్‌గాంధీకి ఈ కీలక పదవి అప్పగించారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని ఐదో తరం నేత సారథ్యంలో ప్రతిపక్షం నుంచి పాలకపక్షంగా మారడానికి వచ్చే ఎన్నికలను మంచి అవకాశంగా కాంగ్రెస్ పరిగణిస్తోంది.
సోనియా నేతృత్వంలోనే...
ఎనిమిదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి అత్యధిక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించింది 145 సీట్లేగాని డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ వంటి ప్రాంతీయపక్షాలను కలుపుకుని, బయటి నుంచి వామపక్షాల మద్దతుతో యూపీఏ పేరుతో తొలిసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పాలనలో జనాదరణ సంపాదించింది. ఫలితంగా 2009 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 206 సీట్లు పెరిగి యూపీఏ పాలన పదేళ్లు కొనసాగడానికి కారణమైంది. అయితే, యూపీఏ మొదటి హయాంలో(2004–09) జరిగిన అవినీతి కుంభకోణాలు, నిరుద్యోగం వంటి అంశాల వల్ల 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాల వల్ల మన్మోహన్ నాయకత్వంలోని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా ఓటమి తప్ప లేదు.
Comments
Please login to add a commentAdd a comment