సాక్షి ప్రతినిధి, వరంగల్: 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ‘కమలా’నికి కలిసొచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ అంతకు ముందు.. ఆ తర్వాత ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. 1984లో జరిగిన ఎన్నికల్లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి ఎంపీగా బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనే భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1991లో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఎంపీగా గెలుపొందగా, అప్పుడు కూడా బీజేపీ ఒకే స్థానాన్ని గెలుచుకుంది.
1998లో కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించగా, బీజేపీ ఖాతాలో రెండు పార్లమెంట్ స్థానాలు పడ్డాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగర్‌రావు, మెదక్ నుంచి ఆలె నరేంద్ర, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్ నుంచి ఏపీ జితేందర్‌రెడ్డి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ‘కమలం’కు కలిసి రాగా.. మొదటి సారిగా తెలంగాణ నుంచి నాలుగు పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టిన బీజేపీ సికింద్రాబాద్ స్థానానికే పరిమితమైంది. ఇక్కడ గెలిచిన బండారు దత్తాత్రేయకి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చోటు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment