పాత పోస్టాఫీసు (విశాఖ) : జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తమ కుటుంబాన్ని మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉంటున్న తమను ఇంటి నుంచి వీధికీడ్చి దగా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగుల టికెట్ ఇస్తామని జనసేనలో చేర్చుకొని.. చివరకు టీడీపీ వాళ్లు గెలిచేలా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చాడని మండిపడ్డారు. బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజుకు రాజకీయాల్లో మంచి భవిష్యత్ ఉంటుందని, మాడుగుల సీటు ఇస్తామని ఆహ్వానించడంతోనే జనసేనలో చేరామన్నారు. ఆయన చెప్పారనే.. ఇంటింటికీ తిరిగి ప్రచారం కూడా చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు తన మనవడిని కాదని గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
టీడీపీలో గవిరెడ్డి రామానాయుడు, జనసేనలో గవిరెడ్డి సన్యాసినాయుడు సీట్లు సంపాదించుకోవడం వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ న్యాయవాది ఎర్రా సన్యాసినాయుడు మాట్లాడుతూ.. సమాజంలో మార్పు రావాలంటే రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరముందన్న పవన్ కళ్యాణ్ ఇలా చేయడం దారుణమన్నారు. ఎర్రా రఘురాజు మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కల్పించి, సీటు కేటాయిస్తానని చెప్పి ఇలా మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్నారు. టీడీపీని గెలిపించడమే ధ్యేయంగా జనసేన నుంచి తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల చివరి నిమిషంలో సన్యాసినాయుడు నామినేషన్ ఉపసంహరించుకుని.. గవిరెడ్డి రామానాయుడు గెలవడానికి కృషిచేస్తాడనే ఆరోపణలున్నాయన్నారు. తమకు జరిగిన అన్యాయంపై పవన్‌ను ప్రశ్నిద్దామంటే ఆయన కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో న్యాయవాది జి.రామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment