కుమ్మక్కుంది.. దానికో లెక్కుంది | TDP and Jasena match fixing | Sakshi
Sakshi News home page

కుమ్మక్కుంది.. దానికో లెక్కుంది

Published Thu, Mar 21 2019 4:59 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

TDP and Jasena match fixing - Sakshi

సాక్షి, అమరావతి: ‘నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లెక్కుంది..’ ఇది గబ్బర్‌ సింగ్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ పాపులర్‌ డైలాగ్‌. ప్రశ్నిస్తానంటూ వచ్చి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌.. దానికీ ఓ లెక్కుంది అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో లోపాయికారీ రాజకీయాలు నడుపుతు న్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా ఎన్నికల్లో అడ్డదారిలో ప్రయోజనం పొందాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. అందుకోసం జనసేన పార్టీతో లోపాయికారీ పొత్తు పెట్టుకుని ఏడాదిగా అంచెలంచెలుగా అమలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే వామపక్షాలు, బీఎస్పీతో జనసేన ఎన్నికల పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకుందన్నది ఇప్పటికే స్పష్టమైంది. అందుకు ప్రతిగా జనసేనకు ‘ఇతరత్రా ప్రయోజనాలు’ కల్పించడంతో పాటు.. పవన్‌ కల్యాణ్, ఇతర జనసేన పార్టీ ముఖ్యులు పోటీ చేసే నియోజకవర్గాల్లో వారికి టీడీపీ సహకరించేలా ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ మేరకు పవన్‌కల్యాణ్‌ పోటీ చేయనున్న భీమవరం, గాజువాక, నాదెండ్ల మనోహర్‌ పోటీ చేయనున్న తెనాలి, తోట చంద్రశేఖర్‌ పోటీ చేయనున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీ సహకరించేలా ఇప్పటికే కథ నడిపారు. ఇక పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, నటుడు నాగేంద్రబాబు (నాగబాబు) పోటీ చేస్తాడని జనసేన ప్రకటించిన నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ వ్యవహారాలు కూడా తాజాగా టీడీపీతో ఆ పార్టీ కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేశాయి. 

సుబ్బారాయుడుకు మొదట మాటిచ్చి...
నాగబాబును పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల నిర్ణయించారు. కాగా అప్పటికే ఆ నియోజకవర్గంలో టీడీపీ తరఫున మాజీ మంత్రి, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడును అభ్యర్థిగా చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎంపీగా అవకాశం ఇస్తామనే హామీతోనే ఆయన రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అందుకు అనుగుణంగానే వారం రోజుల క్రితం చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. నరసాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడును మరోసారి అభ్యర్థిగా నిర్ణయించారు. అదే నియోజకవర్గానికి చెందిన సుబ్బారాయుడును ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో వారిద్దరూ ప్రచార వ్యూహంలో నిమగ్నమయ్యారు. 

నాగబాబు కోసం ఝలక్‌...
సీనియర్‌ కాపు నేత అయిన కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ తరఫున పోటీచేస్తే నాగబాబుకు ప్రతికూలంగా మారుతుందని జనసేన భావించింది. అదే విషయాన్ని చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా తాము టీడీపీకి లోపాయికారీగా సహకరిస్తున్నందున నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో నాగబాబుకు ఇబ్బందిలేకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. నాగబాబు కాపు సామాజిక వర్గానికి చెందినవారైనందున, అదే సామాజిక వర్గానికి చెందిన సుబ్బారాయుడును టీడీపీ అభ్యర్థిగా తప్పించాలని స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ తరఫున క్షత్రియ సామాజికవర్గానికి చెందిన రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తున్న విషయం కూడా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆంతరంగిక సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఖరారు చేయాలని వారిద్దరూ నిర్ణయించారు. తద్వారా క్షత్రియ సామాజికవర్గం ఓట్లు చీలేలా, అదే సమయంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఏకపక్షంగా నాగబాబుకు పడేలా చూడాలన్నది చంద్రబాబు, పవన్‌లు వేసిన ఎత్తుగడ. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేనని సుబ్బారాయుడుకు చంద్రబాబు చెప్పేశారు. దీనిపై ఆగ్రహంతో సుబ్బారాయుడు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసినా.. చంద్రబాబు జనసేనతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చి ఆయన నిరసనను పట్టించుకోలేదు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా క్షత్రియ సామాజికవర్గానికి చెందిన చైతన్య రాజుకు చెప్పారు. చైతన్య రాజు నియోజకవర్గంలో వివిధ వర్గాలతో  సంప్రదింపులు జరుపుతూ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 

తూచ్‌...చైతన్య రాజు కాదు...శివరామరాజు 
అయితే చైతన్య రాజు అభ్యర్థిత్వాన్ని కూడా జనసేన వ్యతిరేకించింది. ఆర్థికంగా స్థితిమంతుడైన ఆయన లోపాయికారీగా తమకు సహకరించరని, కాపు సామాజికవర్గం ఓట్లను సైతం ప్రభావితం చేస్తారని పవన్‌ సందేహించారు. ఈ పరిస్థితులు జనసేన అభ్యర్థి నాగబాబుకు ప్రతికూలంగా మారతాయని చంద్రబాబుకు తెలిపారు. క్షత్రియ సామాజికవర్గానికే చెందిన మరో నేతను ఎంపిక చేయాలని పట్టుబట్టారు. దాంతో చైతన్యరాజుకు నో చెప్పిన చంద్రబాబు.. ఉండి సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ)ను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేటుకూరి రాంబాబును ఖరారు చేశారు. ఇలా పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు అనుకూలంగా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు మార్పులు చేశారు. లైన్‌ అంతా క్లియర్‌ అయ్యాక, టీడీపీతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ బంధాన్ని మరోసారి సరిచూసుకుని, అంతా బాగుందని నిర్ధారించుకున్నాక...బుధవారం జనసేన పార్టీలో నాగబాబు అధికారికంగా చేరారు. అన్నీ అనుకున్నట్టే జరగడంతో ఆయన్ను నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఇలా.. ఓ లెక్క ప్రకారమే పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో కుమ్మక్కయ్యారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చేలా జనసేనకు ‘ఇంటెలిజెన్స్‌’ సహకారం
సాక్షి, విజయవాడ: టీడీపీ, జనసేనల కుమ్మక్కులో భాగంగా.. కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఓడిపోతారనుకున్న చోట  వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చే విధంగా అభ్యర్థులను నిలబెట్టేందుకు జనసేన సిద్ధమైంది. జిల్లాపై పూర్తి అవగాహన ఉన్న ఒక ఇంటెలిజెన్స్‌ అధికారి సూచన మేరకు విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని కొన్ని సీట్లలో పోటీకి జనసేన సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ అధికారి స్వస్థలం నూజివీడులో సీటును సీపీఐకి కేటాయించినప్పటికీ ఆయన సూచన మేరకే రాత్రికి రాత్రి జనసేన అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు మరికొన్ని సీట్లకు ఆయనే అభ్యర్థులను సిఫారసు చేశారని సమాచారం. నూజివీడులో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. మేకా ప్రతాప్‌ అప్పారావు కచ్చితంగా గెలుస్తారు. దీంతో ఈ ఇంటెలిజెన్స్‌ అధికారి జోక్యం చేసుకుని వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ బసవా రేవతి, భర్త భాస్కరరావులను ప్రలోభ పెట్టారు. భాస్కరరావు టీడీపీ సీటు అడిగితే జనసేన సీటు ఇప్పిస్తామని, ఎన్నికల తరువాత టీడీపీలో ప్రాధాన్యత ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

నూజివీడులో మేకా మెజారిటీని తగ్గించేందుకే భాస్కరరావును బయటకు తీసుకువచ్చినట్లు అక్కడి నాయకులు చెబుతున్నారు. అలాగే విజయవాడ తూర్పు అభ్యర్థిని కూడా ఆ అధికారి సూచనలతో మార్చేశారు. కృష్ణలంకలోని కాపు ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడతాయని ఇంటెలిజెన్స్‌ నివేదికలు చెప్పడంతో రాత్రికి రాత్రి బత్తిన రామ్మోహనరావును పిలిపించి జనసేన తరఫున సీటు ఇప్పించారు. దీనిపై ఆయన అనుచరులే ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. విజయవాడ సెంట్రల్‌లో పేదప్రజలు ఎక్కువగా ఉండే సింగ్‌నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో ఓట్లు వైఎస్సార్‌సీపీకి పడతాయి. అయితే పొత్తులో భాగంగా ఈ సీటును సీపీఎంకు ఇచ్చేలా చేసి బాబూరావును రంగంలోకి దింపారు. ఇక విజయవాడ పార్లమెంట్‌ సీటును సీపీఐకి పవన్‌ కల్యాణ్‌ కేటాయించారు. నూజీవీడు సీటు ఇవ్వకపోవడంతో జిల్లాలో ఏదొక సీటు ఇవ్వాల్సి ఉన్నందున పార్లమెంట్‌ సీటు ఇవ్వమంటూ ఇంటెలిజెన్స్‌ అధికారి సూచించారని సమాచారం. దీంతో చలసాని అజయ్‌కుమార్‌ను ఆ పార్టీ రంగంలోకి దింపుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement