కోనసీమలో కొత్త రాజకీయం | Amalapuram Constituency Review on Andhra Pradesh Election | Sakshi
Sakshi News home page

కోనసీమలో కొత్త రాజకీయం

Published Thu, Mar 28 2019 7:55 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Amalapuram Constituency Review on Andhra Pradesh Election - Sakshi

గంటి హరీష్‌ ,చింతా అనురాధ

అమలాపురం లోక్‌సభ మొత్తంకోనసీమలోనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశమే కోనసీమ. కోనసీమకు నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతం ఉంది. కోనసీమ ప్రకృతి రమణీయతకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం పురాతన ఆంధ్ర సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. కోనసీమ గ్రామాల్లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కన్పిస్తుంది. అత్యంత సారవంతమైన ప్రదేశమిది. ఇక్కడ పండని పంటలంటూ లేవు. రాజకీయాలకూ అంతే ప్రసిద్ధిగాంచింది. తొలుత జనరల్‌ నియోజకవర్గంగా, ఆ తర్వాత ఎస్సీ రిజర్వ్‌డు నియోజకవర్గంగా మారింది. దేశంలోనే అత్యధిక ఎస్సీలున్న నియోజకవర్గాల్లో అమలాపురం లోకసభ ఒకటి. బయ్యా సూర్యనారాయణమూర్తి, జీఎంసీ బాలయోగి, కుసుమ కృష్ణమూర్తి, పీవీజీ రాజు వంటి నేతలను పార్లమెంట్‌కు పంపించిన ఘనత దక్కించుకుంది. ఈ నియోజకవర్గం నుంచిగెలుపొందిన దివంగత జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గాపనిచేశారు.  

తొలి ఎంపీగా బయ్యా సూర్యనారాయణమూర్తి  
అమలాపురం నియోజకవర్గం 1962లో ఏర్పాటైంది. 2007లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వు చేశారు. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ పరిధిలో తాళ్లరేవు, ముమ్మడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేట అసెంబ్లీ స్థానాలు ఉండగా పునర్విభజనలో తాళ్లరేవు, అల్లవరం, నగరం కనుమరుగై కొత్తగా మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గాలు కలిశాయి. ప్రస్తుతం అమలాపురం లోకసభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మహిళల కన్నా పురుషులు ఎక్కువగా ఉన్న లోకసభ నియోజకవర్గాల్లో ఇదొకటి కావడం విశేషం. ఇప్పటివరకు 14 ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్‌ 9 సార్లు గెలవగా, టీడీపీ ఐదు పర్యాయాలు గెలిచింది. తొలి ఎంపీగా 1962లో కాంగ్రెస్‌కు చెందిన బయ్యా సూర్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు. ఈయన వరుసగా మూడు పర్యాయాలు విజయం సాధించారు. ఆ తర్వాత జీఎంసీ బాలయోగి మూడు సార్లు గెలవగా, కుసుమ కృష్ణమూర్తి రెండు సార్లు, జి.వి.హర్షకుమార్‌ రెండు సార్లు, పి.వి.జి.రాజు, ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావు, కేఎస్‌ఆర్‌ మూర్తి, పండుల రవీంద్రబాబు ఒక్కోసారి గెలిచారు.గడిచిన ఎన్నికల్లో టీడీపీ తరపున పండుల రవీంద్రబాబు తన సమీప ప్రత్యర్ధి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌పై విజయం సాధించారు.  

తొలిసారి ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు
ఈసారి అమలాపురం లోకసభలో ప్రధాన పోటీ మాత్రం వైఎస్సాసీపీ, టీడీపీ మధ్యనే ఉండనుంది. జనసేనతో పాటు పలు రాజకీయ పక్షాల అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రభావం చూపే అవకాశం లేదు. వైఎస్సార్‌సీపీ తరపున చింతా అనురాధ పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున గంటి హరీష్‌ మాథుర్, జనసేన తరపున దుగ్గిరాల మోజెస్‌ రాజశేఖర్‌ పోటీ చేస్తున్నారు.

టీడీపీకి అవినీతి మరకలు
గడిచిన ఎన్నికల్లో లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు టీడీపీ కైవసం చేసుకోగా, వైఎస్సార్‌సీపీ ఒక నియోజకవర్గాన్ని దక్కించుకుంది. ఈసారి టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఎంపీగా పనిచేసిన రవీంద్రబాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. గోదావరి ఇసుక అంతటినీ టీడీపీ నేతలు మింగేశారు. దేవాదాయ భూములు, మాన్సాస్, లంక భూములను దర్జాగా కబ్జా చేసేశారు. నీరు చెట్టు, సాగునీటి కాలువ ఆధునీకరణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సీఎం హామీ ఇచ్చిన కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, అక్వాకల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, భూమి ఉపరితల జల మార్గాలకు అతీగతి లేదు. 

రైతన్నకు అండగా వైఎస్సార్‌   
డెల్టా ఆధునీకరణకు దివంగత నేత వైఎస్సార్‌ రూ. 1,710 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లాను సస్యశ్యామలం చేసే పోలవరంకు శ్రీకారం చుట్టారు. 2006లో గోదావరి వరద ఉధృతికి తెగపడిన ఏటిగట్లు పటిష్టతకు రూ. 586.67 కోట్లు కేటాయించారు. కొబ్బరి ఉత్పత్తులపై ఉన్న రెండు శాతం పన్నును రద్దు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 50చొప్పున పెంచారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వింటాకు రూ. 50 బోనస్‌ పెంచారు. ఇదే స్పూర్తితో గత ఐదేళ్లుగా రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. ఆ పార్టీ నాయకులు ప్రజల మధ్యనే ఉంటూ అన్నదాతల కోసం  పోరాడారు.  

సేవాకార్యక్రమాల్లో చురుగ్గా చింతా అనురాధ
విద్యావంతురాలైన చింతా అనురాధ సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆమె తండ్రి చింతా కృష్ణమూర్తి గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. వైఎస్సార్‌సీపీ అమలాపురం నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. తండ్రి కృష్ణమూర్తి పేరున ఫౌండేషన్‌ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లోక్‌సభ పరిధిలో ఇప్పటికే పూర్తిస్థాయిలో పర్యటించారు.

అందుబాటులో ఉండని గంటి హరీష్‌
దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడైన గంటి హరీష్‌ ప్రజలు, కేడర్‌కు అందుబాటులో ఉండరు. కేవలం ఎన్నికల కోసం ప్రజల ముందుకు వస్తున్నారు. తల్లి విజయకుమారి కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. వారి వారసత్వంగా హరీష్‌ మాథుర్‌ రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి పేరు చెప్పుకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు.

అమలాపురం  
పినిపే విశ్వరూప్‌ :  (వైఎస్సార్‌సీపీ)
అయితాబత్తుల ఆనందరావు : (టీడీపీ)
శెట్టిబత్తుల రాజబాబు : (జనసేన)

పి.గన్నవరం  
కొండేటి చిట్టిబాబు  :   (వైఎస్సార్‌సీపీ)  
నేలపూడి∙స్టాలిన్‌బాబు : (టీడీపీ)
పాముల రాజేశ్వరి :  (జనసేన)

రాజోలు
బొంతు రాజేశ్వరరావు : (వైఎస్సార్‌సీపీ)
గొల్లపల్లి సూర్యారావు : (టీడీపీ)
రాపాక వరప్రసాదరావు : (జనసేన) 

కొత్తపేట
చిర్ల జగ్గిరెడ్డి  :  (వైఎస్సార్‌సీపీ)
బండారు సత్యానందరావు : (టీడీపీ)
బండారు శ్రీనివాసరావు : (జనసేన)

ముమ్మడివరం
పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ : (వైఎస్సార్‌సీపీ)
దాట్ల సుబ్బరాజు :   (టీడీపీ)
పితాని బాలకృష్ణ  :   (జనసేన)

రామచంద్రపురం  
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ : (వైఎస్సార్‌సీపీ)  
తోట త్రిమూర్తులు   :    (టీడీపీ)  
పోలిశెట్టి చంద్రశేఖర్‌ :   (జనసేన)

మండపేట  
పిల్లి సుబాష్‌చంద్రబోస్‌ :  (వైఎస్సార్‌సీపీ)
వేగుళ్ల జోగేశ్వరరావు :   (టీడీపీ)
వేగుళ్ల లీలాకృష్ణ    :      (జనసేన)  

మొత్తం ఓట్లు     :    14,09,402
పురుషుల ఓట్లు      7,07,592
మహిళల ఓట్లు     :  7,01,172
ఇతరులు            :     56
సర్వీసు ఓటర్లు     :      582

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement