సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరాతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాటాడుతూ.. ‘ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తనకు ప్రతికూలంగా ఉన్న ఓటర్లను తొలగించి, దొంగ ఓటర్లను నమోదు చేయించి తిరిగి అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి చంద్రబాబు. ఆయన చేస్తున్న దుర్మార్గాలను, చట్టవ్యతిరేక చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుని వెళ్లాం. చట్టాన్ని అతిక్రమిస్తున్న డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, ఘట్టమనేని శ్రీనివాసరావు, యోగానంద్, విక్రాంత్‌పాటిల్, ప్రకాశం జిల్లా ఎస్పీ.. తదితర అధికారులను తొలగించాలని విజ్ఞప్తి చేశాం. 37 మందిని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోట్ చేసిన తీరును, సూపర్ న్యూమరీ ద్వారా ఎలివేట్ చేసిన తీరును ఎన్నికల సంఘానికి వివరించాం. నాన్ క్యాడర్ అధికారులు శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదర్‌నాయుడును అక్కడ పోస్టింగ్ చేయడం చట్ట విరుద్ధం. జోక్యం చేసుకోవాలని కోరాం. పోలీస్ యంత్రాంగం ద్వారా డబ్బులను తరలిస్తున్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఇచ్చాం. నారాయణ కళాశాల నుంచి నగదు తీసుకుని తరలిస్తుండగా కారును పట్టుకున్నప్పుడు ఎమ్మార్వో, ఎస్పీ స్వయంగా వచ్చి అది నగదు కాదని, ఎన్నికల మెటీరియల్ అని గమ్యస్థానానికి చేర్చారన్న సంగతిని వివరించాం. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య ఘటనపై పోలీసు యంత్రాంగం అనుసరించిన విధానాన్ని ఈసీకి తెలిపాం.’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాఫింగ్‌పై ఆధారాలు సమర్పించాం..
‘ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు సమర్పించాం. ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్ ఇద్దరూ టెలీఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి సాక్ష్యాధారాలతో వివరించాం. మా ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీఫోన్లు ట్యాప్ చేయాల్సిందిగా లిఖితపూర్వకంగా వారు(ఏబీ వెంకటేశ్వరరావు, యోగానంద్) ఇచ్చిన లేఖలను ఈసీకి సమర్పించాం.’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.
కేఏ పాల్.. చంద్రబాబులది అనైతిక సంబంధం..
‘ఇక ప్రజాశాంతి పార్టీ. మీ అందరికీ తెలుసు. కేఏ పాల్ అని.. ఆయనొక జోకరో లేక కమెడియనో నాకు తెలియదు కానీ.. రోజూ వచ్చి కొంత కామెడీ చేస్తారు. ఆయనకు అలాట్ చేసిన సింబల్ హెలీక్యాప్టర్‌పైన ఉన్న ఫ్యాన్ మా ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉంది. ఇదివరకే దీనిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చాం. దానిపై వారు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరాం. ప్రజాశాంతి పార్టీ కండువాపై ఉన్న మూడు రంగులు కూడా వైఎస్సార్‌సీపీని పోలిన రంగులే అన్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చాం. ఈ అంశాలన్నింటినీ కూడా సీఈసీ మాత్రమే కాకుండా ముగ్గురు కమిషనర్లతో కూడిన పూర్తిస్థాయి కమిషన్‌కు తెలపాల్సిందిగా సూచించారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం వచ్చి వివరిస్తాం. ఆధారాలతో సమర్పించాం కాబట్టి ఈసీ మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం..’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment