సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పరిస్థితి ముందెన్నడూ లేనివిధంగా దిగజారి పోవడంతో కలవరపడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తడబడిన సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబు తడబాటు, తీరా ప్రకటించిన తర్వాత పలువురు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు వెనుకంజ వేయడం ఆ పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది. అసమ్మతి, రాజీనామాలు.. ఒకదాని తర్వాత మరొకటిగా చోటు చేసుకుంటున్న పార్టీ వ్యతిరేక పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడర్ పూర్తిగా డీలాపడిపోతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వారిలో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో, అసమ్మతి నేతలు ఏంచేస్తారోననే భయం వారిని వెంటాడుతోంది. చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ముగ్గురు నేతలు పోటీకి వెనుకంజ వేయడం పార్టీ సీనియర్లు సహా శ్రేణులను నివ్వెరపరిచింది.
వైఎస్సార్‌సీపీ ప్రభంజనం నేపథ్యంలో ఓటమి భయంతో వారు పోటీకి నిరాకరించారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ టీడీపీకి ఎదురుకాలేదని ఆ పార్టీవర్గాలే అంగీకరిస్తున్నాయి. చంద్రబాబు టిక్కెట్ ఇచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడం సంచలనం కలిగించింది. ఒకరోజు ప్రచారం చేసిన తర్వాత చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కనబడిన తీవ్ర వ్యతిరేకతను చూసి కర్నూలు జిల్లా శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తాను పోటీ చేయలేనని ప్రకటించడంతో చంద్రబాబు, సీనియర్ నేతలు ఉలిక్కిపడ్డారు. నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, క్యాడర్ టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవవడంతో బనగానపల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి పోటీ చేయడానికి విముఖత చూపారు.
ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టమని అధిష్టానానికి సూచనలు పంపారు. వారిద్దరినీ తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు నామినేషన్లు వేసే సమయంలో పోటీ చేయలేమంటే ఎలాగని బుజ్జగించి, ముఖ్య నేతల ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా పోటీలో ఉంచారు. చిత్తూరు జిల్లా పూతలపట్టును ఏరికోరి తెర్లం పూర్ణంకి కేటాయిస్తే ఆయన రెండురోజులు కనిపించకుండాపోయారు. దీంతో ఆందోళనకు గురైన చంద్రబాబు వెంటనే మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి సీటు ఇచ్చారు. రాష్ట్రంలో వాతావరణం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేని కారణంగానే వీరంతా పోటీకి భయపడుతున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఎంపీలు, ఎమ్మెల్యేల గుడ్ బైతో మరీ బెంబేలు
ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం టీడీపీకి అస్సలు మింగుడుపడడం లేదు. ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రనాథ్‌బాబు, ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పశ్చాత్తాపం ప్రకటించారు.
నర్సాపురం ఎంపీ సీటు ఖరారైన తర్వాత కనుమూరి రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీలో చేరడంతో టీడీపీ శ్రేణులు విస్తుపోయాయి. టీడీపీతో సన్నిహితంగా మెలిగే ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల గురువారం టీడీపీకి గుడ్ బై కొట్టి వైఎస్సార్‌సీపీలో చేరడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక మంది ముఖ్య నాయకులు, క్యాడర్ టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడంతో అధికార పార్టీ క్యాడర్ అయోమయానికి లోనవుతోంది. టీడీపీ నేతలు పైకి గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా తాజా పరిణామాలపై ఆందోళనతో తర్జనభర్జనలు పడుతున్నారు.
దాదాపు 40 నియోజకవర్గాల్లో అసమ్మతి
రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమనడంతో టీడీపీ ముఖ్య నాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. నెల్లిమర్ల, విజయనగరం, నిడదవోలు, పోలవరం, నర్సరావుపేట, మాచర్ల, దర్శి, కనిగిరి, ప్రొద్దుటూరు, కర్నూలు, నంద్యాల, కోడుమూరు, గుంతకల్, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, తంబళ్లపల్లె, సత్యవేడు, పూతలపట్టు, ప్రత్తిపాడు, పెద్దాపురం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, తిరువూరు, నూజివీడు, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, తాడికొండ, రేపల్లె, గుంటూరు ఈస్ట్, సత్తెనపల్లి, వినుకొండ, కమలాపురం, మైదుకూరు, ఆలూరు, చిత్తూరు తదితర అసెంబ్లీ స్థానాల్లో గందరగోళం నెలకొంది. పలువురు స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా ఇప్పటికే కొందరు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. పెద్దాపురంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావులను స్థానిక టీడీపీ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment