హోదాను చంపేసినందుకా... సన్మానం
వెంకయ్యనాయుడుకు సన్మానంపై పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు విజయవాడలో బీజేపీ, టీడీపీ పార్టీలు ఘనంగా సన్మానం చేసింది.. ఆయన ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా అంశాన్ని దిగ్విజయంగా చంపేసినందుకా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి దుయ్యబట్టారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పుట్టినరోజున సన్మానం చేయించుకున్న వెంకయ్య ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ఏమైనా ప్రత్యేకంగా ప్రకటిస్తారేమోనని ఎదురుచూసిన వారికి తీవ్ర నిరాశ ఎదురైందన్నారు. వెంకయ్య తనకున్న భాషా పరిజ్ఞానంతో, ప్రాసలతో సుదీర్ఘ ప్రసంగం చేశారేతప్ప ఇంకేమీ లేదన్నారు. రాష్ట్రానికి వెంకయ్య చేసిన మేలేమిటో, ఏం సాధించారని సన్మానం చేశారో చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు.
ఎవర్ని మోసం చేయడానికి?
ప్రత్యేకహోదాతో ఉపయోగం లేదని ఇపుడంటున్న వెంకయ్య ఆనాడు రాజ్యసభలో ఎందుకు పోరాటం చేశారో తెలుగు ప్రజలకు చెప్పాలని, ఆయన మాటల్నిబట్టి చూస్తే ఆరోజు రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశం లేనట్లు అర్థమవుతోందని పార్థసారథి అన్నారు. ‘‘పధ్నాలుగో ఆర్థికసంఘం వచ్చింది 2015 మార్చిలో, నీతిఆయోగ్ వచ్చింది 2014 డిసెంబర్‌లో.. ఏడు నెలలపాటు ప్రత్యేకహోదా ఊసెత్తకుండా టీడీపీ, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని ప్రశ్నించారు. వేరేరాష్ట్రం నుంచి ఎన్నికైనా సొంత రాష్ట్రమైన ఏపీకి ఏదో చేద్దామనుకుంటున్నానని వెంకయ్య చెప్పాల్సిన పనిలేదన్నారు. తెలుగుప్రజలు ఆయన దయాదాక్షిణ్యాలమీద ఏమీలేరని, ప్రత్యేకహోదా అయిన హక్కును వారు పోరాడి సాధించుకుంటారన్నారు.