కేసు భయంతోనే కేంద్రంతో బాబు లాలూచీ
ఢిల్లీ ధర్నాలో వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నెరవేర్చని బీజేపీ, టీడీపీలపై తూర్పారబట్టారు. ఓటుకు కోట్లు కేసు కోసం సీఎం చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డార ని ఆరోపించారు. కేసు భయంతోనే కేంద్రంపై ప్రత్యేక హో దా కోసం ఒత్తిడి తేవడంలేదని విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం కేంద్ర కేబినెట్ నుంచి ఇరువురు మంత్రులను రాజీనామా చేయించాలని, అలానే రాష్ట్రంలో ఇరువురు మంత్రులను బర్తరఫ్ చేయాలని టీడీపీని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా కోసం సోమవారం వైఎస్ జగన్ చేపట్టిన ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ముఖ్యమైన అంశాలు వారి మాటల్లోనే..
కనీస ప్రయత్నమేదీ?
రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబుకు సీఎం హోదా వచ్చిందే తప్ప ఏపీకి ప్రత్యేక హోదా రాలేకపోయింది. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించకుండా కేంద్రం, రాష్ట్రంలో మంత్రిపదవులు ఇచ్చిపుచ్చుకోవడం సిగ్గుచేటు. కేంద్రం నుంచి వైదొలగడంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ మంత్రులను వెనక్కి పంకుంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీడీపీకి పడుతుంది.
- గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే
ఆమరణ దీక్ష చేపట్టాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా చంద్రబాబు, ప్రధాని మోదీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు. మూడు నెలల్లో కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మంత్రిపదవుల నుంచి తప్పుకుంటామని టీడీపీ ప్రకటన చేయాలి. అయినప్పటీకీ ప్రత్యేక హోదా రాకుంటే అధికార విపక్షాలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు ఆమరణ దీక్ష చేపట్టాలి.
- ముత్యాలనాయుడు, మాడుగుల ఎమ్మెల్యే
ప్రత్యేక హోదా ఎరచూపారు
ప్రత్యేక హోదా ఎరచూపి టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు జోడి గారడి చేస్తూ ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటూ ఇరు పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోతారు.
- కె.ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే