బాబువన్నీ ప్రచార ఆర్భాటాలే: జేపీ
సాక్షి, హైదరాబాద్: మట్టి-నీరు, హోమాలు, యజ్ఞాలంటూ రూ. కోట్లాది ప్రజాధనం ఖర్చుచేసిన రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. ఆప్ట్రాల్ లంచాలు గుంజే ప్రభుత్వ కార్యాలయాలు ఉండే రాజధాని నగరానికి ఇంత ఆర్భాటం అవసరమా? అని ప్రశ్నించారు. పార్టీ నేతలు పోతినేని హైమ, కూనంపూడి శ్రీనివాస్‌లతో కలిసి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇంత ఆర్భాటంగా జరిగిన సభలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సాయం కావాలని బాబు అడగా లేదు, మోదీ ఇవ్వా లేదన్నారు.
విభజన వల్ల ఏపీకి ఒరిగింది లేకపోయినా కనీసం చంద్రబాబు ప్రశ్నించే ప్రయత్నం చేయకపోవడం దారుణమన్నారు. కేంద్రమిచ్చిన వంద.. వెయ్యి కోట్లే మహాభాగ్యం, మీ దయ వల్లే బతుకున్నాం అనే రీతిలో సీఎం అమరావతి వేదిక మీద మాట్లాడడాన్ని జయప్రకాశ్ నారాయణ తప్పుపట్టారు. ఐఐటీ, ఐఐఎం, వంటివి ప్రతి రాష్ట్రానికి ఇస్తున్నారని.. ఏపీ నగరాలకు అమృత్ పథకం పెట్టాం.. స్మార్ట్‌సిటీల సాయం అందిస్తాం.. 24 గంటల విద్యుత్తు ఇచ్చే రాష్ట్రాల్లో ఏపీని చేర్చాం వంటివి మభ్యపెట్టే మాటలని, ఇలాంటి సాయం అన్ని రాష్ట్రాలకూ అందుతోందని, తన మాటలు అబద్ధమైతే రుజువు చేయాలని సవాల్ చేశారు.
బాబుకు రెండు సూటి ప్రశ్నలు
రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పరిస్థితులను చూపి రాష్ట్రానికి లేదంటే కనీసం ఆ ఏడు జిల్లాలకైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని మీరు కేంద్రాన్ని ఎప్పుడైనా కోరారా? అని జయప్రకాష్ ప్రశ్నించారు. పరిశ్రమలు పెరిగి యువతకు ఉపాధి వచ్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ కార్పోరేట్ ఆదాయ పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నడైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని కలిసిన తరువాత చంద్రబాబే విలేకరుల సమావేశంలో తాను రాజధాని ప్రాంతానికి మాత్రమే పన్నురాయితీలు కోరినట్లు చెప్పారని గుర్తు చేశారు.
ప్రతిదీ ఓ తంతులా...: ప్రతిదీ ఒక తంతుగా, ఆర్భాటంగా మార్చడం తప్ప పరిపాలనపై శ్రద్ధ, పిల్లల భవిష్యత్ మీద ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదని జయప్రకాశ్‌నారాయణ దుయ్యబట్టారు. ‘మొదట పుష్కరాల పేరుతో ఊదరగొట్టేశారు. పట్టిసీమ పూర్తయితే చాలు అందరి బతుకులు బాగుపడతాయన్న భ్రమ కలిగించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణమే అన్నింటికీ పరిష్కారమని చెబుతున్నారు. రేపు ఇంకొకటి..’ అని ఎద్దేవా చేశారు.
సభలో సామాన్యుల ఆకలి కేకలు వీవీఐపీల సేవలో తరించిన ప్రభుత్వం
సాక్షి, విజయవాడ: అట్టహాసంగా సాగిన అమరావతి శంకుస్థాపనకు హాజరైన సామాన్య ప్రజలు చివరకు కడుపు మాడ్చుకొని తిరుగుముఖం పట్టారు. ఈ కార్యక్రమం కోసం వ్యక్తి స్థాయిని బట్టి కేటగిరీల వారీగా రూ. 150 నుంచి రూ. 1000 వరకు వివిధ ధరల్లో పలు రకాల మెనూతో కూడిన విందును సిద్ధం చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లకుపైగా ఖర్చు పెట్టింది. మహిళా మంత్రులు గత మూడు రోజులుగా వంటశాల వద్ద ఉండి పర్యవేక్షించారు. అయినప్పటికీ సభకు హాజరైన వారిలో సగం మందికి మాత్రమే ఆహారం అందించగలిగారు. మిగిలిన వారంతా ఆకలితో వెనుదిరగాల్సి వచ్చింది.