మోసపూరిత హామీలిచ్చిన బాబు: జేపీ
గుంటూరు: ఎన్నికల వేళ మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలులో పూర్తి నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం లోక్‌సత్తా 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆ బాండ్లను నగదుగా మార్చుకునేవరకు ఆయన పదవిలో ఉంటారో.. లేదోనని ఎద్దేవా చేశారు. రైతుల కళ్ల నీళ్లు తుడిచేందుకే ఈ బాండ్ల పంపకమని వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారేకు అన్నగా చెప్పుకున్న బాబు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చారనీ, ఇప్పుడెందుకు అవినీతి గురించి ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. దేశంలో రాజకీయ మార్పు కోసం లోక్‌సత్తా పోరాడుతోందన్నారు.
కులం, ధనం, ప్రాంతీయతలను ముడిపెట్టుకుంటూ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, వాటికి స్వస్తి పలకడానికి ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమిస్తానని చెప్పారు. రాజధాని నిర్మాణం విషయంలో మంగళగిరి, తుళ్ళూరు ప్రజలను ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తోందని మండిపడ్డారు. రాజధానికి 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని, దానిని ఆసరా చేసుకుని రైతుల వద్ద ఎక్కువ భూములు తీసుకుని అనుయాయులు, బంధువులకు అప్పగించేలా మంత్రులు కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. లోక్‌సత్తా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.