homies
-
హామీల అమలుకు సీఎం కేసీఆర్ కృషి
దుబ్బాక రూరల్: సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలో చిట్టాపూర్, తాళ్లపల్లి, పోతరెడ్డిపేట, చిన్న నిజాంపేట, రామేశ్వరంపల్లి, ఎనగుర్తి, ఆకారం, గోసాన్‌పల్లి, శివాజీనగర్, గంభీర్పూర్, పోతారం గ్రామాల్లో ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగ కుటుంబాలకు కేసీఆర్ పెద్దకొడుకై బరువు బాధ్యతలు తీసుకున్నాడన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన వారందరికి పింఛన్లు అందజేస్తామన్నారు. అందనివారు ఉంటే రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దుబ్బాక నియోజక వర్గం కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వాటర్ గ్రిడ్, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక నిధులు విడుదల చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రంలో దుబ్బాక ఎంపీపీ ర్యాకం పద్మ శ్రీరాములు, ఎంపీడీఓ ప్రవీణ్, తహశీల్దార్ అరణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్నెల్లు.. చేసింది నిల్
ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలు సీఎం అయ్యాక మరికొన్ని వరాలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చిన బాబు నెల్లూరు (అర్బన్): ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తయింది. ఈ ఆర్నెల్ల కాలంలో జిల్లాకు ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదు. కేవలం ప్రచారానికే ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాలుగు పర్యాయాలు జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనల్లోనూ అనేక హామీలను గుప్పించారు. వాటిలోనూ ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. వచ్చిన ప్రతిసారీ కోస్తా కారిడార్‌లో భాగంగా జిల్లాను పారిశ్రామిక హబ్, పర్యాటక హబ్ చేస్తాం, నెల్లూరుకు భూగర్భ డ్రైనేజీ, ఫిషింగ్ హార్బర్, నెల్లూరుకు విమానాశ్రయం.... ఇలా హామీల మీద హామీలను గుప్పించారు. అయితే ఇప్పటివరకు వీటి కోసం జిల్లాకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఎన్నికలకు ముందు.. ఎన్నికలకు ముందు మార్చి 5న చంద్రబాబు జిల్లాకు వచ్చారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రజాగర్జనలో అనేక హామీలు ఇచ్చారు. నెల్లూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంకా నెల్లూరును పారిశ్రామిక నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దుతామని, ఒకటి, రెండుచోట్ల రింగురోడ్డును ఏర్పాటు చేయిస్తామని, మత్స్యకార హార్బర్‌ను నిర్మిస్తామని చెప్పారు. పెన్నా, కండలేరు, సోమశిల, ఉత్తర కాలువను అభివృద్ధి చేస్తామని, కృష్ణపట్నం, దుగ్గరాజపట్నం పోర్టుల అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని ప్రకటించారు. ఇంకా ఎరువుల పరిశ్రమ, చేనేత కార్మికులను ఆదుకునేందుకు జిల్లాలో టెక్స్టైల్ పార్క్, జాతీయ విద్యాసంస్థలు, కిసాన్‌సెజ్‌లో రైతులకు ఉపయోగపడే పరిశ్రమలు స్థాపిస్తానని ఆర్భాటంగా సభలో చెప్పారు. ఎన్నికలు జరిగాక మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యమంత్రి హోదాలో నాలుగుసార్లు బాబు జిల్లాకు వచ్చారు. జూన్ 6న షార్‌లో జరిగిన కార్యక్రమం కోసం, జులై 19న నెల్లూరులోని వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి, ఆగస్టు 24న స్వర్ణభారత్‌లో జరిగిన కార్యక్రమం కోసం, అక్టోబర్ 10న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ వల్లిస్తూ వచ్చారు గానీ చేసిందేమీ లేదు. సీఎంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు జూలై 19న: వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన బాబు ఈ సమయంలోనే అధికంగా హామీలు గుప్పించారు. సోమశిల ఎత్తిపోతల పథకం, సంగం, నెల్లూరు బ్యారేజీలు, తెలుగుగంగ కాలువలు, సోమశిల-స్వర్ణముఖి లింకుకాలువతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒక కాలపరిమితి నిర్ణయించి ఐదేళ్లలో పూర్తిచేస్తామని, మరో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని, పులికాట్ సరస్సు ముఖద్వారాలు తెరిచి మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నెల్లూరు నగరాన్ని స్మార్టుసిటీగా రూపొందిస్తామని కేంద్రం ప్రకటించిన వంద స్మార్ట్‌సిటీల్లో నెల్లూరు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరుకు విమానాశ్రయం సాధించాల్సి ఉందని తెలిపారు. నెల్లూరు నగర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు రూ.575 కోట్ల హడ్కో రుణం, మంచినీటి పథకానికి రూ.500 కోట్లు మంజూరుకు రాష్ట్రప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. రే కింద నెల్లూరుకు రూ.16 కోట్లు, సూళ్లూరుపేటకు రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పులికాట్, నేలపట్టు, మైపాడ్, పెంచలకోనలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని, మైపాడుకు నాలుగు వరుసల రోడ్డు మంజూరుచేస్తున్నట్లు, నెల్లూరుకు రింగురోడ్డు కావాలని అడిగారని, అది కూడా మంజూరు చేస్తున్నామని సభలో ఘనంగా ప్రకటించారు. ఆగస్టు 24న ఇచ్చిన హామీలు: నేషనల్ గేమ్స్‌ను నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఒక ఈవెంట్‌ను నెల్లూరులో నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. అక్టోబర్ 10న : కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెంలో, వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలిలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న బాబు జిల్లాను టూరిజం హబ్‌గా తయారుచేస్తానని, వెంకటగిరి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణం పూర్తిచేస్తానని, తెలుగుగంగ బ్రాంచి కాలువల నిర్మాణంపై దృష్టిపెడతానని, వెంకటగిరి ప్రాంత పొలాలకు కండలేరు జలాలు తెప్పిస్తానని, వెంకటగిరిలో విమానాశ్రయం ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చారు. చేసింది శూన్యం.. బాబు ప్రటించిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఉదాహరణకు నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సంగం బ్యారేజీ నుంచి తాగునీటి పథకం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి హడ్కో నుంచి రూ.1500 కోట్ల రుణం ఇస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు హామీ ఇచ్చారు. ఆ నిధులు వచ్చేలా చూస్తానని బాబు కూడా మాట ఇచ్చారు. దీంతో అధికారులు హడావుడిగా రెండు పథకాల కోసం ప్రతిపాదనలు పంపారు. అయితే ఆర్థిక శాఖ దానిని బుట్టదాఖలు చేసింది. ఒకసారి నెల్లూరులో విమానాశ్రయం అని చెప్పిన బాబు మరోసారి వెంకటగిరిలో విమానాశ్రయం అని ప్రకటన చేశారు. రెండుసార్లు రెండు ఊర్ల పేర్లు చెప్పడంతో జిల్లా ప్రజలు బాబు తీరును చూసి నవ్వుకున్నారు. అలాగే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఐదు పథకాలను ప్రారంభించింది. ఇవి జిల్లాలో సక్రమంగా అమలు కాలేదు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2 కు ఇరవై లీటర్ల మంచి నీళ్ల పథకాన్ని జిల్లాలో 420 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయించగా కేవలం 18 చోట్ల మాత్రమే ప్లాంట్లు మొదలుపెట్టారు. ఇవీ అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. జిల్లాలో 50వేల మంది అర్హులను పింఛన్ల జాబితా నుంచి తొలగించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అదీ సక్రమంగా అమలు కావడంలేదు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ అని చెప్పి.. 7 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదు. వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే హామీలు ఇచ్చి ఇప్పటివరకు జిల్లాకు పైసా కూడా ఇవ్వని బాబుపై జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ సంగతి సరేసరి రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన బాబు అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ విషయంలో ఇరువర్గాలను మోసం చేశారు. రూ.50వేల లోపు తీసుకున్న రైతులకు మాత్రమే పూర్తి మాఫీ వర్తిస్తుందని, ఆ పైన లక్షన్నర లోపు తీసుకున్న రైతులకు వాయిదాల పద్ధతిన చెల్లిస్తామని ప్రకటించారు. మొదటి విడతలో కేవలం 63 వేలమంది రైతులను మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించినట్లు తెలిసింది. జిల్లాలో 35,335 డ్వాక్రా సంఘాలు రూ.592.28 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సుమారు రూ.300 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉంది. అయితే ఇంతవరకు డ్వాక్రా రుణాల ఊసెత్తకపోవడంతో తీసుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. -
మోసపూరిత హామీలిచ్చిన బాబు: జేపీ
గుంటూరు: ఎన్నికల వేళ మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలులో పూర్తి నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆరోపించారు. గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం లోక్‌సత్తా 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు ఆ బాండ్లను నగదుగా మార్చుకునేవరకు ఆయన పదవిలో ఉంటారో.. లేదోనని ఎద్దేవా చేశారు. రైతుల కళ్ల నీళ్లు తుడిచేందుకే ఈ బాండ్ల పంపకమని వ్యాఖ్యానించారు. అవినీతి నిర్మూలనలో అన్నాహజారేకు అన్నగా చెప్పుకున్న బాబు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చుచేసి అధికారంలోకి వచ్చారనీ, ఇప్పుడెందుకు అవినీతి గురించి ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. దేశంలో రాజకీయ మార్పు కోసం లోక్‌సత్తా పోరాడుతోందన్నారు. కులం, ధనం, ప్రాంతీయతలను ముడిపెట్టుకుంటూ రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, వాటికి స్వస్తి పలకడానికి ప్రాణం ఉన్నంత వరకు ఉద్యమిస్తానని చెప్పారు. రాజధాని నిర్మాణం విషయంలో మంగళగిరి, తుళ్ళూరు ప్రజలను ప్రభుత్వం అయోమయానికి గురి చేస్తోందని మండిపడ్డారు. రాజధానికి 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని, దానిని ఆసరా చేసుకుని రైతుల వద్ద ఎక్కువ భూములు తీసుకుని అనుయాయులు, బంధువులకు అప్పగించేలా మంత్రులు కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. లోక్‌సత్తా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హామీ..అమాస నాటి వెన్నెలే
‘చేసిన బాసను విస్మరించిన మోసకారి చంద్రబాబు’ అని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ సంక్షేమం కోసం తపిస్తున్నట్టు.. ఎన్నికల ముందు ఆయన ఆడిందంతా నాటకమని నిందిస్తున్నారు. అధికారం దక్కాక.. ఎప్పటి లాగే నిజరూపం చూపారని, నయవంచనకు పాల్పడ్డారని నిప్పులు కక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో చేసిన దగాయే అందుకు సాక్ష్యమని ఎలుగెత్తుతున్నారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు. సాక్షి, కాకినాడ : రుణాలను మాఫీ చేసి, రైతులు, డ్వాక్రా మహిళల బతుకుల్లో కొత్తవెలుగు నింపుతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వాగ్దానం.. ‘అమాస నాటి వెన్నెల’ బాపతేనని ఆ ఇరువర్గాలూ మండిపడుతున్నాయి. ఆయన గద్దెనెక్కి వంద రోజులు దాటిపోయినా ఏ రుణాల మాఫీకి సంబంధించీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా.. అమలుపై రోజురోజుకూ అయోమయం ముసురుకుంటోంది. బేషరతుగా రుణమాఫీ అమలు చేసి తీరాలంటూ ఒకపక్క రైతులు, మరొక పక్క డ్వాక్రా మహిళలు ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి వందరోజులైన సందర్భంగా సోమవారం డ్వాక్రా మహిళలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కారు. మాట తప్పిన బాబుపై భగ్గుమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని 9.50 లక్షల మంది మహిళలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూశారు. అయితే ఆయన తొలిసంతకం నాటకంగా, రుణమాఫీ బూటకంగా మారిపోవడంతో వీరంతా రుణగ్రస్తులుగా మిగిలారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్తోనైనా ఊరట చెందవచ్చని ఆశిస్తే.. ఆ మొత్తం ఎప్పుడు తమ ఖాతాల్లో జమవుతుందో చెప్పే దిక్కే లేకుండా పోయింది. దీంతో వడ్డీరాయితీ కోల్పోవడంతో పాటు పేరుకు పోయిన రుణబకాయిల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతనెల రోజులుగా అడపా దడపా ఆందోళనలు చేస్తున్న మహిళలు.. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సోమవారం వేలాదిమంది ఆందోళనబాట పట్టారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదించారు.ముట్టడులు, బైఠాయింపులు, ర్యాలీలు అమలాపురంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో ఆవరణలోకి చొరబడి పోర్టికో వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచార ని వాపోయారు. కాగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాదిమంది సీఐటీయూ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేసిన అనంతరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు వినతిపత్రం సమర్పించారు.రాజవొమ్మంగిలో స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో డ్వాక్రా మహిళలు ప్ర దాన రహదారిపై బైఠాయించారు. కరప ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు బైఠాయించి రుణమాఫీ అమలు చేయాలని నినదించారు. బాబు వాగ్దానా న్ని వందరోజులైనా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. గంటపాటు జరి గిన ఈ ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించింది. బేషరతుగా రుణ మాఫీ చేయాలన్న డిమాండ్‌తో పదిగ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది మహిళలు కొత్తపేట లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఆత్రేయపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన మహిళలు తహశీల్దార్ సత్యవతికి వినతిపత్రం సమర్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట బైఠాయించి మేనేజర్ కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. -
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన బాబు
అమలాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బూ టకపు హామీ ఇచ్చి నమ్మించి.. నట్టేట ముంచారంటూ మహిళలు మండిపడ్డారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు కోనసీమవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ కుమార్ తమ నిరసనపై కనీసం స్పందించడంలేదంటూ మహిళలు ఎదురుగా ఎన్టీఆర్ మార్గ్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఒక దశలో ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు ఇన్చార్జ్ ఆర్డీఓ వచ్చి మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.రమణి మాట్లాడుతూ రుణమాఫీ హామీతో సక్రమంగా కార్యకలాపాలు నడిచే డ్వాక్రా గ్రూపులను ఇబ్బందులపాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలకు ఇప్పుడు వడ్డీలు నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఒక పక్క చెబుతూనే అస్పష్టమైన జీఓ ఇవ్వడం వల్ల బ్యాంకులు అప్పులకు వడ్డీలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. నిర్ధిష్ట జీఓ వచ్చే వరకు ఐద్వా ఇలా పోరాటాలు చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 26 నుంచి విజయవాడలో మూడు రోజులపాటు జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రాఘవమ్మ మాట్లాడుతూ డ్వాక్రా రుణాల బకాయిలపై వడ్డీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా మహిళలంతా ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా అమలాపురం పట్టణ కార్యదర్శి టీఎన్ వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు కె.వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మహిళల నిరసనకు మద్దతు తెలిపారు. ఐద్వా నాయకురాళ్లు జి.పద్మ, కె.బీబీకుమారి, డి.మీనాక్షీదేవి, జి.కుమారి తదితరులు పాల్గొన్నారు. -
100 దినాలు..1000 దిగుళ్లు
సాక్షి, కాకినాడ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారని ప్రజలు నిరసిస్తున్నారు. పగ్గాలు చేపట్టగానే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ నమ్మబలికి, పబ్బం గడిచాక మరిన్ని కష్టాల్లోకి నెట్టారని నిట్టూరుస్తున్నారు. రుణమాఫీపై ఆశలు పెంచుకున్న రైతులు, డ్వాక్రా మహిళలైతే.. బాబుపై కారాలుమిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారంతో వందరోజులు పూర్తయ్యాయి. ఈ నూరురోజుల్లోనే ఆయన నిజస్వరూపం విశ్వరూపంలో వ్యక్తమైందని వివిధ వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ‘పెనం మీంచి పొయ్యి లోకి దూకినట్టు’ ఈ సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని పదే పదే దిగులు పడుతున్నాయి. జిల్లాలో రూ.8,480 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని నాలుగున్నర లక్షల మంది రైతులు ఆశించగా, రుణమాఫీని లక్షన్నరకే పరిమితం చేసి చంద్రబాబు తొలిదెబ్బ కొట్టారు. పోనీ, అలాగైనా రూ.3500 కోట్లమేర రుణాలు మాఫీ అవుతాయనుకున్నా.. ఇంతవరకూ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా మాఫీ కాలేదు. ఇక జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకున్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన 9.50 లక్షల మంది మహిళలనూ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పరిహసించారు. మాఫీ కాదు..రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే ఇస్తామని హతాశుల్ని చేశారు. కనీసం ఆ మొత్తమైనా ఎప్పుడు జమవుతుందో తెలియక వారంతా ఆందోళన బాటపట్టారు. జాడలేని తొమ్మిది గంటల విద్యుత్ అధికారంలోకి రాగానే రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో 34,570 ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. తొమ్మిది గంటల స్థానంలో ఏడుగంటలంటూ మాట మార్చిన బాబు అక్టోబర్ 2 నుంచి సరఫరా చేస్తామంటూ వాయిదా వేశారు. ప్రస్తుతం ఏడు గంటలు కాదు కదా కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదు. ‘సుజల స్రవంతి’కి సొమ్ములు కరువు ప్రతి కుటుంబానికీ రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తానని ఇచ్చిన హామీ కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. అక్టోబర్ 2 నుంచే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పేరిట అమలుచేయ తలపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ‘సొమ్మొకడిది..సోకొకడిది’ అన్నచందంగా కార్పొరేట్ సంస్థలు, దాతల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇంటికో ఉద్యోగం కాదు.. ఉద్యోగులే ఇంటికి అధికారంలోకి రాగానే ఇంటికోఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దాని మాటెలా ఉన్నా ఉద్యోగాల్ని ఊడబీకే ఉద్యమం చేపట్టినట్టున్నారు. జిల్లాలో 10 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లను, వెయ్యిమందికి పైగా ఆదర్శ రైతులను, ఏడొందలమందికి పైగా గృహ నిర్మాణశాఖ అవుట్సోర్సింగ్ సిబ్బంది కొలువులను రద్దు చేసి, ఇంటికి సాగనంపారు. ఇక అర్హులైన నిరుద్యోగులకు రూ.2 వేల భృతి ఇస్తామన్న హామీ అటకెక్కింది. సర్వే పేరుతో పేదల గూటికి చేటు.. అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు లక్షన్నరతో, సెంటున్నర భూమిలో ఇల్లు కట్టి ఇంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. పగ్గాలు చేపట్టి మూడు నెలలైనా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఇల్లు నిర్మించిన దాఖలా లేదు. పైగా ఇందిరమ్మ లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని జిల్లాలో 10,448 ఇళ్లను రద్దు చేసేందుకు సర్వే చేయిస్తున్నారు. ఆధార లంకెతో పింఛన్లకు కోత.. వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు పెంచుతామన్న బాబు ఆ హామీ అమలకు వాయిదా మంత్రం జపిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయని ఆయన సర్కార్ ఉన్న పింఛన్లకు ఆధార్ లంకె పెట్టి, కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా.. ఎన్నికల ముందు మాదిరిగానే బాబు తన మాయ మాటలతో ప్రజలను ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్మార్ట్‌సిటీలు, ఐటీ హబ్, పెట్రో కారి డార్లంటూ మాటలను కోటలు దాటిస్తున్నారు. నూరురోజుల ఏలుబడిలో..ఎన్నికల హామీలను అణుమాత్రం అమలు చేయని చంద్రబాబు ఇప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపే తన గారడీని నమ్ముతారనుకోవడం భ్రమేనని జనం నిరసిస్తున్నారు. ఇకనైనా ‘కోతలు’ మాని, ఎన్నికల హామీల్ని చేతల్లో చూపాలని కోరుతున్నారు. -
హామీలను నెరవేరుస్తాం
జైనథ్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హామీని దశల వారీగా నెరవేరుస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకుపోతున్నారని తెలిపారు. అందులో భాగంగానే ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు జరగాలన్నారు. గ్రామసభల్లో ప్రజలంతా భాగస్వాములై సమస్యలు చెప్పుకోవాలని, గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 40లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ కుటుంబం ఒక మొక్క నాటాలని, ప్రభుత్వ, పైవేట్ కార్యాలయాల్లో, ఖాలీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధులు దరిచేరవన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎంపీపీ తల్లెల శోభ, వైస్ ఎంపీపీ రోకండ్ల సురేశ్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రతన్‌రెడ్డి, నాయకులు పెందూర్ దేవన్న, అడ్డి భోజారెడ్డి, సర్సం లింగారెడ్డి, గడ్డం పోతారెడ్డి, ఊషన్న, పులివేణి గణేశ్పాల్గొన్నారు. పార్టీలకతీతంగా పనిచేద్దాం బేల : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా పనిచేద్దామని రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా కుంట రఘుకుల్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభల్లో సమస్యలు తె లుపాలన్నారు. వచ్చే ఐదేళ్లలో లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. బోరజ్ నుంచి బేల మండల సరిహద్దు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. బేల మండలానికి 108 వాహనాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటాన న్నారు. టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డి, నాయకులు భోజారెడ్డి, నాక్లే రాందాస్, రావుత్ మనోహర్, తన్వీర్ ఖాన్, మధుకర్, రాఘవులు, మంగేశ్, గంభీర్, దేవన్న పాల్గొన్నారు. -
హామీలను నెరవేరుస్తాం
ఇందూరు ఇంటికి కోడలుగా వచ్చి.. జిల్లావాసుల కష్టసుఖాల్లో పాలుపంచుకుని.. అందరి మనస్సుల్లో చోటు సంపాదించడమే కాకుండా.. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆమె తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చారు. ఈసందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు. డిచ్పల్లి : సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరుస్తామ ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆదివారం తొలిసారి జిల్లాకు వచ్చిన కవితకు డిచ్పల్లి మండలం చ ంద్రాయన్పల్లి వద్ద టీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని తప్పక నెరవేరుస్తారని అ న్నారు. రైతు రుణమాఫీ, పింఛన్లు, ఇళ్లు, భూములు అన్ని రకాల హామీలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషి చేసిన జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ *10 కోట్ల ప్రత్యేక నిధి ప్రకటించారని అన్నారు. జిల్లాలో రెండుపార్లమెంట్ స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్కు కట్టబెట్టిన జిల్లా ప్రజలందరికి వందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకు లు ఎస్ఏ అలీం, జీనియస్ నారాయణరెడ్డి, శక్కరికొండ కృష్ణ, డాక్టర్ షాదుల్లా, చందర్‌నాయక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సరిహద్దులో ఘనస్వాగతం భిక్కనూరు : కవిత పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమా ణం చేసిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వచ్చారు. ఆదివారం జిల్లా సరిహద్దు గ్రామమైన భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద కవితకు జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఉదయం 8.30 గంటలకు రావాల్సిన కవిత 11.30 గంటలకు వచ్చినప్పటికీ కార్యకర్తలు వేచిచూశారు. జిల్లా సరిహద్దులకు ఎంపీ వాహనశ్రేణి రాగానే పెద్ద ఎత్తున టపాకాయలను కాల్చారు. జిల్లాలోకి అడుగుపెట్టిన కవితకు డీసీఎంఎచ్ చైర్మన్ ముజీబొద్దిన్, భిక్కనూరు జడ్పీటీసీ సభ్యుడు నందరమేశ్లు పూలబొకేలు అందజేసి స్వాగతం పలికారు. కన్న బాగా చదువుకో..తెలంగాణలో బంగారు భవిష్యత్తు నీదే... ‘కన్నా బాగా చదువుకో.. తెలంగాణలో బంగారు భవిష్యత్తు మీలాంటి చిన్నారులదేనని’ ఎంపీ కవిత అన్నారు. బస్వాపూర్ వద్ద ఎంపీ వచ్చిన సమయంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ డాక్టర్ కుటుంబం కవితను చూసేందుకు ఆగింది. వారి కుమార్తె బేబి శాలిని ఎంపీ కవితకు అభివాదం చేసింది. దీంతో కవిత ఆ చిన్నారి వద్దకు వచ్చి జెతైలంగాణ అంటూ..మాట్లాడారు. కన్నా బాగా చదువుకో ఏర్పడిన తెలంగాణలో బంగారు భవిష్యత్తు మీ చిన్నారులదేనన్నారు. చంద్రశేఖర్‌కాలనీ : జిల్లా అభివృద్ధియే ఏజెండాగా ముందుకుసాగుతామని ఎంపీ కవిత అన్నారు. ఆదివారం జిల్లాకు వచ్చిన ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు తమపై అపారమైన నమ్మకాన్ని పెట్టుకొని అఖండ మెజారిటీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుం డా సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామన్నా రు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం ఉంచి తెలంగాణ తొలి రాష్ట్రంలో టీఆర్ఎస్కు అధికారం అప్పగించారని అన్నారు. ఆ న మ్మకం వమ్ముకాకుండా బంగారు తెలంగాణ ఏర్పాటుకు ఆయన ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే మరమ్మతుల(కోచ్) ఏర్పాటు, ఆ ర్మూర్లో పసుపు, విత్తనాల శుద్ధికేంద్రాల ఏర్పాటు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. త్వరలో పూర్ణకు అభినందన సభ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జిల్లా కీర్తిబావుటాను ఎగురవేసిన సిరికొండ మండలం పాకాల కు చెందిన మాలావత్ పూర్ణకు త్వరలో జిల్లా కేం ద్రంలో అభినందనసభను ఏర్పాటు చేస్తామన్నా రు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశా ల ఏర్పాటుకు కూడా తనవంతు కృషి చేస్తానన్నా రు. సమావేశంలో టీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎ మ్మె ల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నాయకులు పాల్గొన్నారు. -
బాబు హామీలు నిలుపుకోవాలి
అవనిగడ్డ, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన కోరారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఫైలుపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి సంతకం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి సింహాద్రి రమేష్‌బాబు స్వగృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతు రుణమాఫీ విషయంపై ఇప్పటికే చంద్రబాబు డొంకతిరుగుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విభజన జరగక ముందు ఈ వాగ్దానం చేశానని రైతులను వంచించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేసేంత వరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారని విమర్శించారు. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు లభించటంతో పాటు ఫ్యాను గుర్తునే కేటాయించటం స్వాగతించదగిన పరిణామమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నాయకులు మైండ్‌గేమ్ ఆడుతున్నారని, అయితే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ టీడీపీ వైపు మొగ్గుచూపే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమించటంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయటం, రాబోయే కాలంలో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కల్పన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడవకొల్లు నరసింహారావు, పార్టీ నాయకుడు మిక్కిలినేని మధు తదితరులు పాల్గొన్నారు.