హామీల అమలుకు సీఎం కేసీఆర్ కృషి
దుబ్బాక రూరల్: సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలో చిట్టాపూర్, తాళ్లపల్లి, పోతరెడ్డిపేట, చిన్న నిజాంపేట, రామేశ్వరంపల్లి, ఎనగుర్తి, ఆకారం, గోసాన్‌పల్లి, శివాజీనగర్, గంభీర్‌పూర్, పోతారం గ్రామాల్లో ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగ కుటుంబాలకు కేసీఆర్ పెద్దకొడుకై బరువు బాధ్యతలు తీసుకున్నాడన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
అర్హులైన వారందరికి పింఛన్లు అందజేస్తామన్నారు. అందనివారు ఉంటే రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దుబ్బాక నియోజక వర్గం కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వాటర్ గ్రిడ్, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక నిధులు విడుదల చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రంలో దుబ్బాక ఎంపీపీ ర్యాకం పద్మ శ్రీరాములు, ఎంపీడీఓ ప్రవీణ్, తహశీల్దార్ అరణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.