హామీలను నెరవేరుస్తాం
జైనథ్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హామీని దశల వారీగా నెరవేరుస్తామన్నారు.
బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకుపోతున్నారని తెలిపారు. అందులో భాగంగానే ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు జరగాలన్నారు. గ్రామసభల్లో ప్రజలంతా భాగస్వాములై సమస్యలు చెప్పుకోవాలని, గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
ప్రతీ నియోజకవర్గంలో ఏడాదికి 40లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ కుటుంబం ఒక మొక్క నాటాలని, ప్రభుత్వ, పైవేట్ కార్యాలయాల్లో, ఖాలీ స్థలాల్లోనూ మొక్కలు నాటాలన్నారు. ప్రతీ ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తేనే వ్యాధులు దరిచేరవన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఎంపీపీ తల్లెల శోభ, వైస్ ఎంపీపీ రోకండ్ల సురేశ్‌రావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రతన్‌రెడ్డి, నాయకులు పెందూర్ దేవన్న, అడ్డి భోజారెడ్డి, సర్సం లింగారెడ్డి, గడ్డం పోతారెడ్డి, ఊషన్న, పులివేణి గణేశ్‌పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా పనిచేద్దాం
బేల : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా పనిచేద్దామని రాష్ట్ర అటవీ, పర్యాటక శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా కుంట రఘుకుల్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ గ్రామసభల్లో సమస్యలు తె లుపాలన్నారు.
వచ్చే ఐదేళ్లలో లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారన్నారు. బోరజ్ నుంచి బేల మండల సరిహద్దు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. బేల మండలానికి 108 వాహనాన్ని కేటాయించేలా చర్యలు తీసుకుంటాన న్నారు. టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు భూమారెడ్డి, నాయకులు భోజారెడ్డి, నాక్లే రాందాస్, రావుత్ మనోహర్, తన్వీర్ ఖాన్, మధుకర్, రాఘవులు, మంగేశ్, గంభీర్, దేవన్న పాల్గొన్నారు.