నియోజకవర్గాల్లో అభివృద్ధి బాగానే చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలను భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని సందేహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నలుగురు ఎమ్మెల్యేల భయానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలకు ఓడిపోతామనే భయం ఎందుకు పీడిస్తోంది? కారణాలేంటో చూద్దాం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తికాని అసంపూర్తి బ్రిడ్జీలు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రగతిని పరుగులు పెట్టించారు. కాని అసంపూర్తిగా ఆగిపోయిన బ్రిడ్జీల్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యారు.
మూడోసారి కోనప్ప
ఆ వైఫల్యమే వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గానికి రెండుదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనేరు కోనప్ప. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కోరిక పెద్దవాగుపై కూలిపోయిన వంతెన వల్ల నెరవేరదేమోనని భయపడుతున్నారు.
కాగజ్‌నగర్-దహేగామ్ మండలాలను కలిపే ఆ వారధి గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బ తిని కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో దహేగామ్ మండలంలోని పద్దేనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిగా అక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు మాత్రం సాగడంలేదు. కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తదాని నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఎమ్మెల్యే కోనప్ప వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వంతెన తన పుట్టి ముంచుతుందేమోనని కోనప్ప ఆందోళన చెందుతున్నారు.
(చదవండి: మాజీ మంత్రి జూపల్లికి షాక్..!)
రేఖ నాయక్‌కు షాకిచ్చేందుకు సిద్ధం?
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు గంగాపూర్ బ్రిడ్జి కలగా మిగిలిపోయింది. కడెం నదిపై బ్రిడ్జి లేక గంగాపూర్ పరిసర ప్రాంతాల్లోని పది గ్రామాల ప్రజలు వర్షకాలంలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
ఇక్కడ వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాని ఆ పనులు పిల్లర్ల దశ దాటలేదు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. రాకపోకలకు ప్రజలు ఇంత కష్టపడుతున్నా ఎమ్మెల్యే రేఖనాయక్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట. వంతెన నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేకు ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారట.
ఆత్రం సక్కు తీరుపై ఆగ్రహం..
కుమ్రంబీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గుండేగామ్ గ్రామానికి పక్కనే ఉన్న వాగుపై దశాబ్దం క్రితం వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇన్నేళ్ళయినా ఆ వంతెన పనులు పిల్లర్ల దశ దాటలేదు. వంతెన లేకపోవడంతో గ్రామస్థులు పుట్టి, తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు.
వాగుకు వరద వచ్చినపుడు ప్రమాదాల బారినపడుతున్నారు. అదేవిధంగా కెరమెరి మండలం కరంజీవాడ వాగుపై కూడా వంతెన లేదు. వంతెన కోసం పునాదులు తవ్వి వదిలేశారు. ఈ ప్రాంతంలో పది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు పడినపుడు రోజుల తరబడి ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ప్రజల కష్టాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంతెన కోసం అవసరమైతే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది.
(చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు)
కష్టాలకు బదులివ్వడం ఖాయమా..
ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం తరోడాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న వాగుపై ఓ వంతెన ఉంది. పగుళ్లుబారి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో దానిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు నానా కష్టాలు పడుతున్నారు.
నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ముఖ్యమైనది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని అక్కడి ప్రజలు, విపక్షాలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.
ప్రజలకు అవసరమైన పనులు చేయించలేని ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ వంతెనే అధికార పార్టీని ఓడించబోతోందని, తమను గెలిపించబోతోందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు.
ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. వంతెనలు నిర్మించడం అంటే నిచ్చెనలు వేసినంత సులువుకాదంటున్నారు.
బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా తమ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో తాము సాధించిన అభివృద్ధి పనులే మరోసారి తమను గెలిపిస్తాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment