చంద్రబాబు హామీ..అమాస నాటి వెన్నెలే
‘చేసిన బాసను విస్మరించిన మోసకారి చంద్రబాబు’ అని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ సంక్షేమం కోసం తపిస్తున్నట్టు.. ఎన్నికల ముందు ఆయన ఆడిందంతా నాటకమని నిందిస్తున్నారు. అధికారం దక్కాక.. ఎప్పటి లాగే నిజరూపం చూపారని, నయవంచనకు పాల్పడ్డారని నిప్పులు కక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో చేసిన దగాయే అందుకు సాక్ష్యమని ఎలుగెత్తుతున్నారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు.
సాక్షి, కాకినాడ : రుణాలను మాఫీ చేసి, రైతులు, డ్వాక్రా మహిళల బతుకుల్లో కొత్తవెలుగు నింపుతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వాగ్దానం.. ‘అమాస నాటి వెన్నెల’ బాపతేనని ఆ ఇరువర్గాలూ మండిపడుతున్నాయి. ఆయన గద్దెనెక్కి వంద రోజులు దాటిపోయినా ఏ రుణాల మాఫీకి సంబంధించీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా.. అమలుపై రోజురోజుకూ అయోమయం ముసురుకుంటోంది.
బేషరతుగా రుణమాఫీ అమలు చేసి తీరాలంటూ ఒకపక్క రైతులు, మరొక పక్క డ్వాక్రా మహిళలు ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి వందరోజులైన సందర్భంగా సోమవారం డ్వాక్రా మహిళలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కారు. మాట తప్పిన బాబుపై భగ్గుమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని 9.50 లక్షల మంది మహిళలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూశారు. అయితే ఆయన తొలిసంతకం నాటకంగా, రుణమాఫీ బూటకంగా మారిపోవడంతో వీరంతా రుణగ్రస్తులుగా మిగిలారు.
కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్‌తోనైనా ఊరట చెందవచ్చని ఆశిస్తే.. ఆ మొత్తం ఎప్పుడు తమ ఖాతాల్లో జమవుతుందో చెప్పే దిక్కే లేకుండా పోయింది. దీంతో వడ్డీరాయితీ కోల్పోవడంతో పాటు పేరుకు పోయిన రుణబకాయిల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతనెల రోజులుగా అడపా దడపా ఆందోళనలు చేస్తున్న మహిళలు.. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సోమవారం వేలాదిమంది ఆందోళనబాట పట్టారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదించారు.ముట్టడులు, బైఠాయింపులు, ర్యాలీలు అమలాపురంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
కార్యాలయంలో ఆవరణలోకి చొరబడి పోర్టికో వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచార ని వాపోయారు. కాగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాదిమంది సీఐటీయూ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేసిన అనంతరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు వినతిపత్రం సమర్పించారు.రాజవొమ్మంగిలో స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో డ్వాక్రా మహిళలు ప్ర దాన రహదారిపై బైఠాయించారు.
కరప ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు బైఠాయించి రుణమాఫీ అమలు చేయాలని నినదించారు. బాబు వాగ్దానా న్ని వందరోజులైనా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. గంటపాటు జరి గిన ఈ ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించింది. బేషరతుగా రుణ మాఫీ చేయాలన్న డిమాండ్‌తో పదిగ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది మహిళలు కొత్తపేట లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఆత్రేయపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన మహిళలు తహశీల్దార్ సత్యవతికి వినతిపత్రం సమర్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట బైఠాయించి మేనేజర్ కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.