ఉత్తుత్తి ఉత్తర్వులు! | peoples are have concern on debt waiver | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తి ఉత్తర్వులు!

Published Fri, Aug 15 2014 2:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

ఉత్తుత్తి ఉత్తర్వులు! - Sakshi

ఉత్తుత్తి ఉత్తర్వులు!

ఇదో ‘ఉత్త’ హామీ..! రుణమాఫీపై రైతులు, డ్వాక్రా మహిళలు ఎక్కడికక్కడ నిలదీస్తోండడంతో ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేమని తేల్చిచెప్పింది.. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూలధనంగా అందిస్తామంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వంతున పంట రుణం మాఫీ చేస్తామని చెప్పింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం: 174)ను జారీచేసింది. కానీ.. ఎప్పటిలోగా అమలుచేస్తామన్నది మాత్రం ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. దీంతో వీటిని ఉత్తుత్తి ఉత్తర్వులని బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని రైతులు అన్ని రకాల పంటరుణాలు కలిపి బ్యాంకర్లకు రూ.11,180.25 కోట్లు బకాయిపడ్డారు. అలాగే జిల్లాలోని 55,602 స్వయం సహాయక సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలు మార్చి 31, 2014 నాటికి రూ.1611.03 కోట్లను బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పంట రుణాలు, డ్వాక్రా రుణాల రూపంలో ఒక్క మన జిల్లాలోనే రూ.12,791.28 కోట్లను మాఫీ చేయాలి. కానీ.. ఇందుకు చంద్రబాబు షరతులు పెట్టారు.

ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున రుణ మాఫీ చేస్తానని జూన్ 10న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం: 31) జారీచేశారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయలేమని తేల్చిచెబుతూ ఈ నెల 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం: 164) జారీచేశారు. ఒక్కో సంఘానికి రూ.లక్ష వంతున మూలధనంగా ఇస్తామని అదే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గురువారం తాజాగా ఆ రెండు ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలనే పునరుద్ఘాటిస్తూ సరి కొత్త ఉత్తర్వులు జారీచేశారు. పనిలో పనిగా రుణ మాఫీకి విధి విధానాలను జారీచేశారు. కానీ.. మాఫీని ఎప్పటిలోగా చేస్తామన్నది.. డ్వాక్రా సంఘాలకు ఎప్పటిలోగా మూలధనం అందిస్తామన్నది మాత్రం స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
 
31 అంశాల ఆధారంగా జాబితా..
పంట రుణాల మాఫీ లబ్ధిదారులను గుర్తించడానికి 31 అంశాల ఆధారంగా ప్రొఫార్మా రూపొందించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్‌నెంబర్లను కూడా ఆ ప్రొఫార్మాలో చేర్చారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఫోన్ నెంబర్లలో ఏ ఒక్కటి లేకున్నా రుణమాఫీ కింద లబ్ధిదారులుగా ఎంపిక చేయరన్న మాట. డిసెంబర్ 31, 2013 వరకూ తీసుకున్న పంట రుణాలు.. మార్చి 31, 2014 నాటికి పేరుకుపోయిన బకాయిలకు రుణమాఫీని వర్తింప జేస్తామని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు(అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు మినహా), గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టీకరించింది.
 
కలెక్టర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కలిసి పంట రుణాల మాఫీకి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. ప్రభుత్వం రుణమాఫీకి నోటిఫికేషన్ జారీచేసిన 14 రోజుల్లోగా బకాయిదారుల జాబితాను రూపొందించాలని నిర్దేశించింది. ప్రతి రైతు పట్టాదారు పాసుపుస్తకంలోనూ ఆ రైతు తీసుకున్న పంట రుణం.. మాఫీ చేసే మొత్తాన్ని విధిగా నమోదు చేయాలని సూచించింది. బకాయిదారుల జాబితా తయారుచేసిన వారం రోజుల్లోగా రైతులకు రుణ మాఫీ చేసే మొత్తాన్ని ఆయా రైతుల సర్వే నెంబర్ల వారీగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని సూచించింది.
 
 ఆ తర్వాత 31 అంశాల ఆధారంగా రూపొందించిన ప్రొఫార్మాలో నమోదు చేయాలంది. భర్త, భార్య, ఆధారపడిన పిల్లలను ఒక కుటుంబంగా ప్రభుత్వం పేర్కొంది. ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షలకు మించకుండా రుణా మాఫీ వర్తింపజేస్తామని స్పష్టీకరించింది. కానీ.. రుణమాఫీకి నోటిఫికేషన్ ఎప్పుడు జారీచేస్తామన్న అంశంపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దాంతో.. వీటిని ఉత్తుత్తిఉత్తర్వులుగా బ్యాంకర్లు కొట్టిపారేస్తున్నారు.
 
మహిళల ఆగ్రహం..
డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా ఒక్కో సంఘానికి రూ.లక్షకు మించకుండా మూలధనం ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తామని ఓట్లేయించుకుని.. ఇప్పుడు నట్టేట ముంచారని మండిపడుతున్నారు. సంపూర్ణ ఆర్థిక చేకూర్పు(టోటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) పథకం కింద ఒక్కో మహిళా సంఘానికి గరిష్టంగా రూ.ఐదు లక్షల వరకూ రుణాలను పంపిణీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్కో సంఘానికి రూ.5 లక్షల చొప్పున 60 శాతం మహిళా సంఘాలు.. రూ.4 లక్షల వంతున పది శాతం సంఘాలు.. రూ.3 లక్షల చొప్పున 12 శాతం సంఘాలు.. రూ.2 లక్షల చొప్పున ఎనిమిది శాతం సంఘాలు, రూ.లక్ష చొప్పున ఐదు శాతం సంఘాలు.. రూ.50 వేల చొప్పున ఐదు శాతం సంఘాలు రుణాలు తీసుకున్నాయి.
 
అంటే.. రూ.లక్ష వంతున మూలధనం అందించడం వల్ల కేవలం పది శాతం సంఘాల్లోని మహిళలకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. తక్కిన 90 శాతం సంఘాల్లోని మహిళలకు మూలధనం అందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదు. పోనీ.. ఆ మూలధనం కూడా ఎప్పటిలోగా అందిస్తామన్నది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. కేవలం రైతులు, మహిళల ఆగ్రహాన్ని, నిరసనల నుంచి తప్పించుకోవడానికి జీవో 174ను గురువారం జారీచేసిందని.. ఈ ఉత్తర్వుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జాతీయ బ్యాంకుకు చెందిన కీలకాధికారి ‘సాక్షి’తో స్పష్టీకరించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement