నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన బాబు
అమలాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బూ టకపు హామీ ఇచ్చి నమ్మించి.. నట్టేట ముంచారంటూ మహిళలు మండిపడ్డారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు కోనసీమవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇన్‌చార్జ్ ఆర్డీఓ కుమార్ తమ నిరసనపై కనీసం స్పందించడంలేదంటూ మహిళలు ఎదురుగా ఎన్టీఆర్ మార్గ్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఒక దశలో ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.
చివరకు ఇన్‌చార్జ్ ఆర్డీఓ వచ్చి మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.రమణి మాట్లాడుతూ రుణమాఫీ హామీతో సక్రమంగా కార్యకలాపాలు నడిచే డ్వాక్రా గ్రూపులను ఇబ్బందులపాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలకు ఇప్పుడు వడ్డీలు నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఒక పక్క చెబుతూనే అస్పష్టమైన జీఓ ఇవ్వడం వల్ల బ్యాంకులు అప్పులకు వడ్డీలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. నిర్ధిష్ట జీఓ వచ్చే వరకు ఐద్వా ఇలా పోరాటాలు చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు.
ఈనెల 26 నుంచి విజయవాడలో మూడు రోజులపాటు జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రాఘవమ్మ మాట్లాడుతూ డ్వాక్రా రుణాల బకాయిలపై వడ్డీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా మహిళలంతా ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా అమలాపురం పట్టణ కార్యదర్శి టీఎన్ వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు కె.వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మహిళల నిరసనకు మద్దతు తెలిపారు. ఐద్వా నాయకురాళ్లు జి.పద్మ, కె.బీబీకుమారి, డి.మీనాక్షీదేవి, జి.కుమారి తదితరులు పాల్గొన్నారు.