sujala sravanthi
-
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పరిపాలనా అనుమతి
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రను గోదావరి జలాలతో అభిషేకించి సుభిక్షం చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు రూ.17,050.20 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తొలిదశ పనుల అంచనా వ్యయం రూ.2,022.20 కోట్లు కాగా రెండో దశ పనుల అంచనా వ్యయం రూ.15,028 కోట్లు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు కోసం 63.20 టీఎంసీల గోదావరి నికర జలాలను కేటాయించడం గమనార్హం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి, రెండో దశలో 63.99 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 3.98 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ప్రధాన కాలువలో మిగిలిన పనులతోపాటు భూదేవి రిజర్వాయర్ (6.55 టీఎంసీలు), వీరనారాయణపురం రిజర్వాయర్ (6.2 టీఎంసీలు), తాటిపూడి రిజర్వాయర్ (3.8 టీంసీలు) నిర్మాణం, సబ్ లిఫ్ట్‌ల పనులను చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖను ఆదేశించారు. ఆ పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా పూర్తి చేసేలా అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రభుత్వం చేపట్టింది. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దిక్సూచిలా నిలుస్తుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి... ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించాలనే ముందుచూపుతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం నుంచి రోజుకు 17,561 క్యూసెక్కులు (1.51 టీఎంసీలు) తరలించేలా పోలవరం ఎడమ కాలువను చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తూనే 162.409 కి.మీ. నుంచి రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను తరలించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినా ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం పట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచి్చన పాలకులు చంద్రబాబుతో సహా ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రాధాన్యతగా చేపట్టారు. డిస్టిబ్యూటరీల పనులు ప్రారంభం ♦పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో భాగంగా 3.15 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, 13.5 కి.మీ. పొడవున లీడింగ్ కెనాల్తోపాటు జామద్దులపాలెం, తీడ వద్ద రెండు లిఫ్ట్‌లు, 3.15 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, 1.30 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్టిబ్యూటరీల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ♦రెండో దశలో 20.05 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్, పాపయ్యపాలెం లిఫ్ట్‌తోపాటు 63.995 కి.మీ. పొడవున ప్రధాన కాలువ, 2.68 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులను ఇప్పటికే ప్రారంభించారు. మిగిలిన పనులు వేగవంతం.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రెండో దశలో మిగిలిన పనులు అంటే.. ప్రధాన కాలువలో మిగిలిన 37.585 కి.మీ. పొడవున తవ్వకం, ప్రధాన కాలువకు అనుబంధంగా 6.20 కి.మీ. వద్ద భూదేవి(అనకాపల్లి జిల్లా), 50 కి.మీ. వద్ద వీరనారాయణపురం(విజయనగరం జిల్లా), 69.10 కి.మీ. వద్ద తాటిపూడి(విజయనగరం జిల్లా) రిజర్వాయర్ల నిర్మాణం– వాటికి అనుబంధంగా ఎత్తిపోతలు, కొండగండేరు లిఫ్ట్, బూర్జువలస లిఫ్ట్, జి.మర్రివలస లిఫ్ట్, 4.02 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక వైపు భూసేకరణ చేస్తూనే మరోవైపు పనులు చేపట్టడం ద్వారా వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
అది అవినీతి ‘స్రవంతి’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో ముఖ్యనేత అక్రమాలకు ఇదో పరాకాష్ట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశలో మొదటి ప్యాకేజీ(3.5 కి.మీ.ల పొడవున ప్రధాన కాలువ తవ్వకం, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం) పనులను ఫిబ్రవరిలో ’లంప్సమ్–ఓపెన్’ విధానంలో నిర్వహించిన టెండర్లలో ఆర్థికశాఖ మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌తో వ్యాపార సంబంధం ఉన్న హెచ్‌ఈఎస్ సంస్థకు రూ.281.96 కోట్లకు కట్టబెట్టారు. తాజాగా రెండో ప్యాకేజీ పనులకు(పెదపూడి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం) రూ.603.87 కోట్లను అంతర్గత అంచనా విలువ(ఐబీఎంగా) నిర్ణయించి శుక్రవారం ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. ఒకే ప్రాజెక్టులో రెండు ప్యాకేజీల పనులకు రెండు వేర్వేరు విధానాల్లో టెండర్లు పిలవడం.. అందులోనూ ఒకరిద్దరు కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. మొదటి ప్యాకేజీ టెండర్లలో అంచనా వ్యయాన్ని రూ.125.51 కోట్లు పెంచేసి సన్నిహిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. రూ.50 కోట్లకు పైగా ముడుపులు రాబట్టుకున్న ముఖ్యనేత రెండో ప్యాకేజీ టెండర్లలో రూ.100 కోట్లకు పైగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి ప్రణాళిక రచించారు. తొలి దశలోనే 1,221 కోట్లు పెంపు గోదావరి జలాలు 63.4 టీఎంసీలు మళ్లించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.7,214.1 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని 2009 జనవరి 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగున పడింది. దీనిపై ప్రజలు ఆందోళనబాట పట్టడంతో గతేడాది సెప్టెంబరు 5న రూ.2,022.20 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశను ప్రభుత్వం మంజూరు చేసింది. పోలవరం ఎడమ కాలువ నుంచి 10 టీఎంసీలను మళ్లించి విశాఖ జిల్లాలో 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. కానీ, 2009లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.801.03 కోట్లు మాత్రమే. అంటే అంచనా వ్యయాన్ని టీడీపీ ప్రభుత్వం రూ.1,221.17 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. పెంచుకో.. పంచుకో అంచనా వ్యయాన్ని పెంచేసిన తర్వాత.. తొలి దశ పనులను రెండు భాగాలుగా విడగొట్టారు. పోలవరం ఎడమ కాలువ నుంచి 3.5 కి.మీ.ల మేర ప్రధాన కాలువ తవ్వకం, లైనింగ్, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ పనులకు ఫిబ్రవరిలో రూ.268.92 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ప్రభుత్వం 2009లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల వ్యయం రూ.137.02 కోట్లు మాత్రమే. కానీ, ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.268.82 కోట్లకు పెంచేశారు. టెండర్లలో 4.85 శాతం అధిక ధరలకు అంటే రూ.281.96 కోట్లకు హెచ్‌ఈఎస్ సంస్థకు కట్టబెట్టారు. రెండో ప్యాకేజీ కింద పెదపూడి రిజర్వాయర్‌లోకి రెండు దశల్లో నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.603.87 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ విధానంలో జూన్ 8న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.397 కోట్లే. టెండర్ షెడ్యూళ్లు ఈ నెల 22 వరకూ దాఖలు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. తర్వాత ఈ గడువును జూలై 2 వరకూ పొడగించారు. అదేరోజు టెక్నికల్ బిడ్, జూలై 4న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. పైపుల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే ప్రతిపాదన గతంలో లేదు. కానీ, ముఖ్యనేత ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు మాత్రమే పనులు దక్కేలా చేయడానికి 1.30 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 15,118 ఎకరాలకు మాత్రమే పైపుల ద్వారా నీళ్లందించాలని నిర్ణయించి, ఆ మేరకు టెండర్లలో నిబంధన పెట్టడం గమనార్హం. అక్రమాలకు పరాకాష్ట పోలవరం ఎడమ కాలువ నుంచి 3.5 కి.మీ.ల పొడవున తవ్విన ప్రధాన కాలువ ద్వారా తరలించిన జలాలను విశాఖ జిల్లా కసింకోట మండలం జమ్మాదులపాళెం వద్ద పంప్ హౌస్ నిర్మించి 31.20 క్యూమెక్కుల నీటిని ఎత్తిపోసి.. 14 కి.మీ.ల పొడువున తవ్వే లీడింగ్ ఛానల్(కాలువ) ద్వారా తరలిస్తారు. కసింకోట మండలం తీడ వద్ద మరో పంప్‌హౌస్ ద్వారా 15.60 క్యూమెక్కుల నీటిని పెదపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. డిస్ట్రిబ్యూటరీల్లో 1ఆర్ కింద 2,103 ఎకరాలు, 2ఆర్ కింద 13,015 ఎకరాలకు పైపుల ద్వారా నీళ్లందించి.. మిగతా 1,14,882 ఎకరాల ఆయకట్టుకు హైలెవల్ కెనాల్ ద్వారా నీళ్లందించాలి. 2017–18 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను(ఎస్ఎస్ఆర్) పరిగణనలోకి తీసుకున్నా జమ్మాదులపాళెం, తీడ పంప్‌హౌస్‌ల పనులకు రూ.243.13 కోట్లకు మించి ఖర్చు కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈ పనుల వ్యయాన్ని రూ.603.87 కోట్లకు పెంచేసి టెండర్లు పిలవడం అక్రమాలకు పరాకాష్టగా అధికారవర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ పనులను సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు అప్పగించి రూ.100 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు. -
‘గాలేరు-నగరి’లో అవినీతి దందా
సాక్షి, హైదరాబాద్: గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్)లో తవ్విన కొద్దీ అవినీతి బయటపడుతూనే ఉంది. ప్యాకేజీ-29లో రూ. 12 కోట్ల విలువైన పని అంచనా విలువను రూ. 110 కోట్లకు పెంచి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కంపెనీకి కట్టబెట్టినప్రభుత్వం.. ప్యాకేజీ-28లోనూ ఇదే అడ్డగోలు మార్గాన్ని ఎంచుకుంది. రూ. 173.5 కోట్ల విలువైన కాలువ తవ్వకం, బ్రిడ్జిలు లాంటి నిర్మాణ పనులను 2007లో మార్చి 7న ‘సబీర్ డ్యామ్ అండ్ వాటర్ వర్క్స్’ సంస్థకు అప్పగించింది. అందులో కొన్ని పనులు అసంపూర్తిగా ఉండగా, కొన్ని పనులను కాంట్రాక్టు సంస్థ ఇంకా ప్రారంభించనే లేదు. రూ. 7 కోట్లు విలువైన పనులను కాంట్రాక్టర్ ఇప్పటివరకు ప్రారంభించనే లేదు. ప్రభుత్వం, కాంట్రాక్టర్ మధ్య ఉన్న ఒప్పందంలోని 60(సి) నిబంధన ప్రకారం.. ప్రారంభం కాని పనులను ఆ కాంట్రాక్టర్ పరిధి నుంచి అధికారులు తప్పించారు. తానే చేస్తానని కాంట్రాక్టర్ అధికారులకు చెప్పినా వినలేదని, దీని వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, వారు చెప్పిన వారికి పనులు అప్పగించడానికి వీలుగా ఇలా చేస్తున్నామని, అడ్డుపడితే మిగతా పనులు కూడా చేయలేరని అధికారులు హెచ్చరించడంతో.. కాంట్రాక్టర్ సరే అన్నట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది. పది రెట్లు పెరిగిన అంచనా! కాంట్రాక్టర్‌నుంచి పనులు తప్పించిన అధికారులు ఆ రూ. 7 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 60 కోట్లకు పెంచారు. అంచనా వ్యయం పెంపునకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధనను ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో తుంగలో తొక్కారు. ఆ తర్వాత టెండర్ పిలవడానికీ ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. సెప్టెంబర్‌లో టెండర్ ఖరారు చేసే దశలో.. ప్యాకేజీ-29 వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్యాకేజీ-29లోనూ రూ. 12 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ. 110 కోట్లకు పెంచి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు పనులు అప్పగించిన తర్వాత.. ముడుపులు చెల్లింపులో మంత్రి దేవినేని ఉమ, అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు విభేదాలు తలెత్తడంతో అవినీతి వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. అదే మార్గంలో అధికార పార్టీ పెద్దల అండదండలతో ప్యాకేజీ-28 వ్యవహారం కూడా సాగడంతో.. అడ్డగోలుగా అంచనా వ్యయం పెంచి టెండర్లు పిలిచిన విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు తప్పవని అధికారులు భావించారు. సెప్టెంబర్‌లో టెండర్లు ఖరారు చేసే దశలో వ్యవహారాన్ని నిలిపివేశారు. ప్యాకేజీ-29 వ్యవహారం సద్దుమణగడంతో.. ప్యాకేజీ-28లో అంచనా వ్యయం పెంపు ఆమోదం కోసం ఫైల్‌ను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ముఖ్య కార్యదర్శి, మంత్రితో ఆమోదముద్ర వేయించడానికి అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) ఆమోదానికి ఫైల్ సిద్ధం చేసింది. అంచనా వ్యయం పెంపునకు వీలుగా మార్చిన డిజైన్స్‌కు ఆమోదముద్ర వేయాలంటూ మరో ఫైల్ సీడీవో(సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు చేరింది. తక్షణం ఆమోదం తెలిపి ఎస్ఎల్ఎస్సీకి పంపించాలని ప్రభుత్వ పెద్దల నుంచి సీడీవో అధికారుల మీద ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. అడ్డగోలు వ్యవహారానికి ప్రభుత్వం త్వరలో ఆమోదముద్ర వేస్తుందని అధికార పార్టీ నేతలు నమ్మకంగా చెబుతున్నారు. -
చంద్రబాబు హామీ..అమాస నాటి వెన్నెలే
‘చేసిన బాసను విస్మరించిన మోసకారి చంద్రబాబు’ అని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ సంక్షేమం కోసం తపిస్తున్నట్టు.. ఎన్నికల ముందు ఆయన ఆడిందంతా నాటకమని నిందిస్తున్నారు. అధికారం దక్కాక.. ఎప్పటి లాగే నిజరూపం చూపారని, నయవంచనకు పాల్పడ్డారని నిప్పులు కక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో చేసిన దగాయే అందుకు సాక్ష్యమని ఎలుగెత్తుతున్నారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు. సాక్షి, కాకినాడ : రుణాలను మాఫీ చేసి, రైతులు, డ్వాక్రా మహిళల బతుకుల్లో కొత్తవెలుగు నింపుతానన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వాగ్దానం.. ‘అమాస నాటి వెన్నెల’ బాపతేనని ఆ ఇరువర్గాలూ మండిపడుతున్నాయి. ఆయన గద్దెనెక్కి వంద రోజులు దాటిపోయినా ఏ రుణాల మాఫీకి సంబంధించీ ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా.. అమలుపై రోజురోజుకూ అయోమయం ముసురుకుంటోంది. బేషరతుగా రుణమాఫీ అమలు చేసి తీరాలంటూ ఒకపక్క రైతులు, మరొక పక్క డ్వాక్రా మహిళలు ఉద్యమిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి వందరోజులైన సందర్భంగా సోమవారం డ్వాక్రా మహిళలు జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రోడ్డెక్కారు. మాట తప్పిన బాబుపై భగ్గుమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకు ఉన్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని 9.50 లక్షల మంది మహిళలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూశారు. అయితే ఆయన తొలిసంతకం నాటకంగా, రుణమాఫీ బూటకంగా మారిపోవడంతో వీరంతా రుణగ్రస్తులుగా మిగిలారు. కనీసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్తోనైనా ఊరట చెందవచ్చని ఆశిస్తే.. ఆ మొత్తం ఎప్పుడు తమ ఖాతాల్లో జమవుతుందో చెప్పే దిక్కే లేకుండా పోయింది. దీంతో వడ్డీరాయితీ కోల్పోవడంతో పాటు పేరుకు పోయిన రుణబకాయిల్ని 14 శాతం వడ్డీతో చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతనెల రోజులుగా అడపా దడపా ఆందోళనలు చేస్తున్న మహిళలు.. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సోమవారం వేలాదిమంది ఆందోళనబాట పట్టారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని నినదించారు.ముట్టడులు, బైఠాయింపులు, ర్యాలీలు అమలాపురంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రమణి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో ఆవరణలోకి చొరబడి పోర్టికో వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచార ని వాపోయారు. కాగా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వందలాదిమంది సీఐటీయూ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు రంపచోడవరంలో ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సుమారు గంటపాటు బైఠాయించి ధర్నా చేసిన అనంతరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడుకు వినతిపత్రం సమర్పించారు.రాజవొమ్మంగిలో స్థానిక డ్వాక్రా సంఘాల మహిళలు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలో డ్వాక్రా మహిళలు ప్ర దాన రహదారిపై బైఠాయించారు. కరప ప్రధాన రహదారిపై డ్వాక్రా మహిళలు బైఠాయించి రుణమాఫీ అమలు చేయాలని నినదించారు. బాబు వాగ్దానా న్ని వందరోజులైనా అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. గంటపాటు జరి గిన ఈ ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించింది. బేషరతుగా రుణ మాఫీ చేయాలన్న డిమాండ్‌తో పదిగ్రామాల నుంచి వచ్చిన వందలాదిమంది మహిళలు కొత్తపేట లో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఆత్రేయపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన మహిళలు తహశీల్దార్ సత్యవతికి వినతిపత్రం సమర్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట బైఠాయించి మేనేజర్ కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. -
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన బాబు
అమలాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బూ టకపు హామీ ఇచ్చి నమ్మించి.. నట్టేట ముంచారంటూ మహిళలు మండిపడ్డారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనకు కోనసీమవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు తరలివచ్చారు. తొలుత ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇన్చార్జ్ ఆర్డీఓ కుమార్ తమ నిరసనపై కనీసం స్పందించడంలేదంటూ మహిళలు ఎదురుగా ఎన్టీఆర్ మార్గ్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఒక దశలో ఆర్డీఓ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. చివరకు ఇన్చార్జ్ ఆర్డీఓ వచ్చి మహిళల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సీహెచ్.రమణి మాట్లాడుతూ రుణమాఫీ హామీతో సక్రమంగా కార్యకలాపాలు నడిచే డ్వాక్రా గ్రూపులను ఇబ్బందులపాలుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ హామీతో రుణాలు చెల్లించకుండా ఉండిపోయిన మహిళలకు ఇప్పుడు వడ్డీలు నడ్డివిరుస్తున్నాయని మండిపడ్డారు. రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఒక పక్క చెబుతూనే అస్పష్టమైన జీఓ ఇవ్వడం వల్ల బ్యాంకులు అప్పులకు వడ్డీలు కట్టమని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. నిర్ధిష్ట జీఓ వచ్చే వరకు ఐద్వా ఇలా పోరాటాలు చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు. ఈనెల 26 నుంచి విజయవాడలో మూడు రోజులపాటు జరిగే ఐద్వా రాష్ట్ర మహాసభలో ప్రధానంగా చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు కె.రాఘవమ్మ మాట్లాడుతూ డ్వాక్రా రుణాల బకాయిలపై వడ్డీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేలా మహిళలంతా ఐక్యంగా ఉండి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐద్వా అమలాపురం పట్టణ కార్యదర్శి టీఎన్ వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు కె.వెంకటలక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు మహిళల నిరసనకు మద్దతు తెలిపారు. ఐద్వా నాయకురాళ్లు జి.పద్మ, కె.బీబీకుమారి, డి.మీనాక్షీదేవి, జి.కుమారి తదితరులు పాల్గొన్నారు. -
100 దినాలు..1000 దిగుళ్లు
సాక్షి, కాకినాడ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారని ప్రజలు నిరసిస్తున్నారు. పగ్గాలు చేపట్టగానే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ నమ్మబలికి, పబ్బం గడిచాక మరిన్ని కష్టాల్లోకి నెట్టారని నిట్టూరుస్తున్నారు. రుణమాఫీపై ఆశలు పెంచుకున్న రైతులు, డ్వాక్రా మహిళలైతే.. బాబుపై కారాలుమిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సోమవారంతో వందరోజులు పూర్తయ్యాయి. ఈ నూరురోజుల్లోనే ఆయన నిజస్వరూపం విశ్వరూపంలో వ్యక్తమైందని వివిధ వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. ‘పెనం మీంచి పొయ్యి లోకి దూకినట్టు’ ఈ సర్కారును ఎందుకు ఎన్నుకున్నామా అని పదే పదే దిగులు పడుతున్నాయి. జిల్లాలో రూ.8,480 కోట్ల వరకు రుణాలు మాఫీ అవుతాయని నాలుగున్నర లక్షల మంది రైతులు ఆశించగా, రుణమాఫీని లక్షన్నరకే పరిమితం చేసి చంద్రబాబు తొలిదెబ్బ కొట్టారు. పోనీ, అలాగైనా రూ.3500 కోట్లమేర రుణాలు మాఫీ అవుతాయనుకున్నా.. ఇంతవరకూ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా మాఫీ కాలేదు. ఇక జిల్లాలో 79,086 డ్వాక్రా సంఘాలకున్న రూ.1445 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన 9.50 లక్షల మంది మహిళలనూ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పరిహసించారు. మాఫీ కాదు..రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ మాత్రమే ఇస్తామని హతాశుల్ని చేశారు. కనీసం ఆ మొత్తమైనా ఎప్పుడు జమవుతుందో తెలియక వారంతా ఆందోళన బాటపట్టారు. జాడలేని తొమ్మిది గంటల విద్యుత్ అధికారంలోకి రాగానే రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో 34,570 ఉచిత విద్యుత్ కనెక్షన్లున్నాయి. తొమ్మిది గంటల స్థానంలో ఏడుగంటలంటూ మాట మార్చిన బాబు అక్టోబర్ 2 నుంచి సరఫరా చేస్తామంటూ వాయిదా వేశారు. ప్రస్తుతం ఏడు గంటలు కాదు కదా కనీసం నాలుగు గంటలు కూడా ఉచిత విద్యుత్ అందించడం లేదు. ‘సుజల స్రవంతి’కి సొమ్ములు కరువు ప్రతి కుటుంబానికీ రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తానని ఇచ్చిన హామీ కూడా ఇంకా అమలుకు నోచుకోలేదు. అక్టోబర్ 2 నుంచే ‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ పేరిట అమలుచేయ తలపెట్టిన ఈ పథకానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ‘సొమ్మొకడిది..సోకొకడిది’ అన్నచందంగా కార్పొరేట్ సంస్థలు, దాతల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇంటికో ఉద్యోగం కాదు.. ఉద్యోగులే ఇంటికి అధికారంలోకి రాగానే ఇంటికోఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. దాని మాటెలా ఉన్నా ఉద్యోగాల్ని ఊడబీకే ఉద్యమం చేపట్టినట్టున్నారు. జిల్లాలో 10 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లను, వెయ్యిమందికి పైగా ఆదర్శ రైతులను, ఏడొందలమందికి పైగా గృహ నిర్మాణశాఖ అవుట్సోర్సింగ్ సిబ్బంది కొలువులను రద్దు చేసి, ఇంటికి సాగనంపారు. ఇక అర్హులైన నిరుద్యోగులకు రూ.2 వేల భృతి ఇస్తామన్న హామీ అటకెక్కింది. సర్వే పేరుతో పేదల గూటికి చేటు.. అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేదకు లక్షన్నరతో, సెంటున్నర భూమిలో ఇల్లు కట్టి ఇంచి ఇస్తామని బాబు హామీ ఇచ్చారు. పగ్గాలు చేపట్టి మూడు నెలలైనా ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త ఇల్లు నిర్మించిన దాఖలా లేదు. పైగా ఇందిరమ్మ లబ్ధిదారులను లక్ష్యంగా పెట్టుకుని జిల్లాలో 10,448 ఇళ్లను రద్దు చేసేందుకు సర్వే చేయిస్తున్నారు. ఆధార లంకెతో పింఛన్లకు కోత.. వృద్ధులు, వితంతువులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్లు పెంచుతామన్న బాబు ఆ హామీ అమలకు వాయిదా మంత్రం జపిస్తున్నారు. పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయని ఆయన సర్కార్ ఉన్న పింఛన్లకు ఆధార్ లంకె పెట్టి, కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోయినా.. ఎన్నికల ముందు మాదిరిగానే బాబు తన మాయ మాటలతో ప్రజలను ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్మార్ట్‌సిటీలు, ఐటీ హబ్, పెట్రో కారి డార్లంటూ మాటలను కోటలు దాటిస్తున్నారు. నూరురోజుల ఏలుబడిలో..ఎన్నికల హామీలను అణుమాత్రం అమలు చేయని చంద్రబాబు ఇప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపే తన గారడీని నమ్ముతారనుకోవడం భ్రమేనని జనం నిరసిస్తున్నారు. ఇకనైనా ‘కోతలు’ మాని, ఎన్నికల హామీల్ని చేతల్లో చూపాలని కోరుతున్నారు.