సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో ముఖ్యనేత అక్రమాలకు ఇదో పరాకాష్ట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలిదశలో మొదటి ప్యాకేజీ(3.5 కి.మీ.ల పొడవున ప్రధాన కాలువ తవ్వకం, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం) పనులను ఫిబ్రవరిలో ’లంప్సమ్–ఓపెన్’ విధానంలో నిర్వహించిన టెండర్లలో ఆర్థికశాఖ మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌తో వ్యాపార సంబంధం ఉన్న హెచ్‌ఈఎస్ సంస్థకు రూ.281.96 కోట్లకు కట్టబెట్టారు.
తాజాగా రెండో ప్యాకేజీ పనులకు(పెదపూడి రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం) రూ.603.87 కోట్లను అంతర్గత అంచనా విలువ(ఐబీఎంగా) నిర్ణయించి శుక్రవారం ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. ఒకే ప్రాజెక్టులో రెండు ప్యాకేజీల పనులకు రెండు వేర్వేరు విధానాల్లో టెండర్లు పిలవడం.. అందులోనూ ఒకరిద్దరు కాంట్రాక్టర్‌లకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. మొదటి ప్యాకేజీ టెండర్లలో అంచనా వ్యయాన్ని రూ.125.51 కోట్లు పెంచేసి సన్నిహిత కాంట్రాక్టర్లకు కట్టబెట్టి.. రూ.50 కోట్లకు పైగా ముడుపులు రాబట్టుకున్న ముఖ్యనేత రెండో ప్యాకేజీ టెండర్లలో రూ.100 కోట్లకు పైగా కమీషన్లు వసూలు చేసుకోవడానికి ప్రణాళిక రచించారు.
తొలి దశలోనే 1,221 కోట్లు పెంపు
గోదావరి జలాలు 63.4 టీఎంసీలు మళ్లించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.7,214.1 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని 2009 జనవరి 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. మహానేత హఠాన్మరణంతో ఈ పథకం మరుగున పడింది. దీనిపై ప్రజలు ఆందోళనబాట పట్టడంతో గతేడాది సెప్టెంబరు 5న రూ.2,022.20 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశను ప్రభుత్వం మంజూరు చేసింది. పోలవరం ఎడమ కాలువ నుంచి 10 టీఎంసీలను మళ్లించి విశాఖ జిల్లాలో 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. కానీ, 2009లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.801.03 కోట్లు మాత్రమే. అంటే అంచనా వ్యయాన్ని టీడీపీ ప్రభుత్వం రూ.1,221.17 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
పెంచుకో.. పంచుకో
అంచనా వ్యయాన్ని పెంచేసిన తర్వాత.. తొలి దశ పనులను రెండు భాగాలుగా విడగొట్టారు. పోలవరం ఎడమ కాలువ నుంచి 3.5 కి.మీ.ల మేర ప్రధాన కాలువ తవ్వకం, లైనింగ్, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్ పనులకు ఫిబ్రవరిలో రూ.268.92 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ప్రభుత్వం 2009లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల వ్యయం రూ.137.02 కోట్లు మాత్రమే. కానీ, ఇప్పుడు అంచనా వ్యయాన్ని రూ.268.82 కోట్లకు పెంచేశారు. టెండర్లలో 4.85 శాతం అధిక ధరలకు అంటే రూ.281.96 కోట్లకు హెచ్‌ఈఎస్ సంస్థకు కట్టబెట్టారు. రెండో ప్యాకేజీ కింద పెదపూడి రిజర్వాయర్‌లోకి రెండు దశల్లో నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.603.87 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ విధానంలో జూన్ 8న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.397 కోట్లే. టెండర్ షెడ్యూళ్లు ఈ నెల 22 వరకూ దాఖలు చేసుకోవడానికి గడువు ఇచ్చారు. తర్వాత ఈ గడువును జూలై 2 వరకూ పొడగించారు. అదేరోజు టెక్నికల్ బిడ్, జూలై 4న ప్రైస్ బిడ్ తెరిచి టెండర్లను ఖరారు చేయనున్నారు. పైపుల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే ప్రతిపాదన గతంలో లేదు. కానీ, ముఖ్యనేత ముందే ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు మాత్రమే పనులు దక్కేలా చేయడానికి 1.30 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 15,118 ఎకరాలకు మాత్రమే పైపుల ద్వారా నీళ్లందించాలని నిర్ణయించి, ఆ మేరకు టెండర్లలో నిబంధన పెట్టడం గమనార్హం.
అక్రమాలకు పరాకాష్ట
పోలవరం ఎడమ కాలువ నుంచి 3.5 కి.మీ.ల పొడవున తవ్విన ప్రధాన కాలువ ద్వారా తరలించిన జలాలను విశాఖ జిల్లా కసింకోట మండలం జమ్మాదులపాళెం వద్ద పంప్ హౌస్ నిర్మించి 31.20 క్యూమెక్కుల నీటిని ఎత్తిపోసి.. 14 కి.మీ.ల పొడువున తవ్వే లీడింగ్ ఛానల్(కాలువ) ద్వారా తరలిస్తారు. కసింకోట మండలం తీడ వద్ద మరో పంప్‌హౌస్ ద్వారా 15.60 క్యూమెక్కుల నీటిని పెదపూడి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. డిస్ట్రిబ్యూటరీల్లో 1ఆర్ కింద 2,103 ఎకరాలు, 2ఆర్ కింద 13,015 ఎకరాలకు పైపుల ద్వారా నీళ్లందించి.. మిగతా 1,14,882 ఎకరాల ఆయకట్టుకు హైలెవల్ కెనాల్ ద్వారా నీళ్లందించాలి. 2017–18 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను(ఎస్‌ఎస్‌ఆర్) పరిగణనలోకి తీసుకున్నా జమ్మాదులపాళెం, తీడ పంప్‌హౌస్‌ల పనులకు రూ.243.13 కోట్లకు మించి ఖర్చు కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈ పనుల వ్యయాన్ని రూ.603.87 కోట్లకు పెంచేసి టెండర్లు పిలవడం అక్రమాలకు పరాకాష్టగా అధికారవర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఈ పనులను సన్నిహితుడైన కాంట్రాక్టర్‌కు అప్పగించి రూ.100 కోట్లకుపైగా కమీషన్లు కొట్టేయడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు.
అది అవినీతి ‘స్రవంతి’
Published Sun, Jun 24 2018 5:04 AM | Last Updated on Sun, Jun 24 2018 8:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment