ప్రజల ముందుకు ‘రీ డిజైనింగ్’ | Ahead of 're-designing' | Sakshi
Sakshi News home page

ప్రజల ముందుకు ‘రీ డిజైనింగ్’

Published Mon, Jan 18 2016 3:59 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM

ప్రజల ముందుకు ‘రీ డిజైనింగ్’ - Sakshi

ప్రజల ముందుకు ‘రీ డిజైనింగ్’

నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం నిర్ణయం
* పూర్తి వివరాలతో నివేదికల తయారీకి అధికారులకు ఆదేశం
* మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య బ్యారేజీలకు వెంటనే టెండర్లు
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటా ప్రకారం నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వాడుకోవడానికి అనుగుణంగా రూపొందించిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ వివరాలను ప్రజల ముందు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రీడిజైనింగ్ చేసిన ప్రాణహిత, దేవాదుల, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల్లో మార్పుచేర్పులపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని, ఇందుకోసం పూర్తి నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నీ

టిపారుదల ప్రాజెక్టులపై కేసీఆర్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. దీనికి ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ రంగారెడ్డి, వ్యాప్కోస్ ఎండీ శంభూ ఆజాద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఎందుకు చేపట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టబోతున్నాం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఎలా చేపట్టనున్నాం, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వల్ల లాభం ఏమిటి, దేవాదులను ఎలా ఉపయుక్తంగా మారుస్తున్నాం, ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎలా వినియోగిస్తున్నాం, సర్వే పనులను ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్కోస్‌కు ఎందుకు అప్పగించాం? అనే విషయాలను ప్రజలకు చెప్పాలన్నారు. అలాగే గోదావరి, కృష్ణా నదులపై కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు వెంటనే టెండర్లు పిలవడంతోపాటు ఇప్పటికే పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పనులనూ వెంట నే పూర్తి చేయాలని... అన్ని ప్రాజెక్టుల పనులు ఏకకాలంలో జరగాలని సీఎం ఆదేశించారు.
 
మొక్కులు చెల్లించాక ‘కాళేశ్వరం’
సమైక్య పాలనలో తెలంగాణ ప్రయోజనాలపై ఏమాత్రం పట్టింపులేకుండా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని సీఎం కేసీఆర్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టాలన్నది వ్యాప్కోస్ ప్రతిపాదన కాదని, అది అప్పటి ప్రభుత్వ ఒత్తిడి మాత్రమేనన్నారు. గోదావరి ప్రధాన నదిపై కాకుండా ఉప నది అయిన ప్రాణ హితపై ప్రాజెక్టు కట్టాలనుకోవడమే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు.

మేడిగడ్డ వద్ద నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో తాను కూడా కాళేశ్వరం ఆలయంలో మొక్కు లు మొక్కానని, వాటిని చెల్లించి ప్రాజెక్టు నిర్మా ణం ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. గోదావరిపై మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్యలో నిర్మించే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును రద్దుచేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఆ ప్రాజెక్టును ప్రయోజనాత్మకంగా మార్చడమే లక్ష్యమన్నారు.

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. దీనికి సంబంధించిన బ్యారేజీ, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం కోసం వ్యాప్కోస్‌తో సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్ల పనులను రెండే ళ్లలో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పురోగతిలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తిచేసి ఈ ఖరీఫ్‌లో నీళ్లు అందించాలని ఆదేశించారు.
 
రూ. 7,451 కోట్ల దుమ్ముగూడెం
* ‘రీ డిజైనింగ్’ వివరాలు ప్రకటించిన సీఎంఓ

సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ. 7,451 కోట్ల వ్యయంతో దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. సీఎం ఖరారు చేసిన ప్రాజెక్టు రీ డిజైనింగ్ వివరాలను సీఎంఓ ప్రకటించింది.  దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో గ్రావిటీ ద్వారా 46.30 కిలోమీటర్ల దూరంగల కోయగుట్ట పంపుహౌజ్ వరకు నీటిని తరలిస్తారు.

కోయగుట్ట నుంచి జగన్నాథపురంలో నిర్మించే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం చెరువు దాకా నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ల ద్వారా ఖమ్మం జిల్లాతోపాటు వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కూడా నీరు అందుతుంది.   ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 50 టీఎంసీల నీటిని తరలిస్తారు. పాల్వంచ మండలం కోయగుట్ట, ముల్కంపల్లి మండలం కమలాపురం, తోగ్గూడెం, టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామాల్లో నాలుగు పంపుహౌజ్‌లు, ఆరు లిఫ్టులు ఏర్పాటు చేస్తారు.  దుమ్ముగూడెం వద్ద 45 మీటర్ల ఎత్తు నుంచి 275 మీటర్ల ఎత్తు వరకు (పాలవాగు) నీటిని లిఫ్టు చేస్తారు. ఈ పథకానికి 294 మెగావాట్ల విద్యుత్ అవసరం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement