నీటిమూటలే! | govt neglecting irrigation projects in srikakulam | Sakshi
Sakshi News home page

నీటిమూటలే!

Published Sun, Mar 19 2017 4:08 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

నీటిమూటలే! - Sakshi

నీటిమూటలే!

 ► సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో అరకొరే!
 ► కేటాయింపుల్లో కానరాని మంత్రుల హామీలు
 ► రూ.1538.48 కోట్లకు అధికారుల ప్రతిపాదనలు!
 ► బడ్జెట్‌లో కేటాయింపులు రూ.220.59 కోట్లు!
 ► వైఎస్సార్‌ కలల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం!


"వంశధార ప్రాజెక్టు హిరమండలం జలాశయంలోకి వచ్చే జూలై నాటికి ఎనిమిది టీఎంసీల నీరు పారిస్తాం... ఇదీ మంత్రులు దేవినేని ఉమ, కింజరాపు అచ్చెన్నాయుడు పదేపదే చెప్పిన మాటలు! వంశధార, తోటపల్లి... ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చోటు కల్పించారు! నిధులకు ఢోకా ఉండదు. పనులు చేయడమే ఆలస్యం!".. ఇవీ టీడీపీ నాయకులు ఊదరగొట్టిన హామీలు! కానీ కార్యాచరణ అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇది కేవలం ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలు మాత్రమే కాదు టీడీపీ శ్రేణుల్లోనూ పెదవి విరుపు కనిపిస్తోంది! జిల్లాలో పెద్ద సాగునీటి ప్రాజెక్టులనే కాదు మధ్య, సూక్ష్మ తరహా జలవనరులపైనా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపే కనిపించింది. మొత్తం రూ.1538.48 కోట్లు అవసరమని జిల్లా జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే కేటాయింపులు మాత్రం రూ.220.59 కోట్లు దాటలేదు. ఆర్థికంగా వెనుకబడిన సిక్కోలును అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలుగన్న వంశధార, ఆఫ్‌షోర్, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో టీడీపీ ప్రభుత్వం హామీలు నీటిమూటలేననే విమర్శలు వినిపిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టు స్టేజీ–1 కింద ఓపెన్‌ హెడ్‌ చానళ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలంటే రూ.30.10 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.8 కోట్లు మాత్రమే కేటాయించి సరిపెట్టారు. వంశధార ప్రాజెక్టు స్టేజీ–2 కింద హిరమండలం జలాశయంతో పాటు కీలకమైన 86, 87 ప్యాకేజీ పనుల్లో భాగంగా నేరడి సైడ్‌వియర్‌ నిర్మాణం, ఇతరత్రా నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే రూ.395.80 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. ఇక నిర్వాసితులు డిమాండు చేస్తున్నట్లుగా భూసేకరణ చట్టం–2013 ప్రకారం భూసేకరణకు, నిర్వాసితుల పరిహారానికి కనీసం రూ.200 కోట్లు అవసరం ఉంటుంది. కానీ ఈ బడ్జెట్‌లో కేవలం రూ.48.99 కోట్లు కేటాయిస్తే అవి ఏమూలకు సరిపోతాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు ముఖ్యమైన వంశధార నీరు ప్రవేశించే ఓపెన్‌ హెడ్‌ చానల్‌ పనులు సరిగా జరగట్లేదు. వరద కాలువల నిర్మాణం, లైనింగ్‌ పనులు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. కొత్తూరు మండలంలో 88 ప్యాకేజీ కింద వరద కాలువ, పారాపురం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పనులు సాగుతున్నాయి. ఈ ప్యాకేజీ కింద ప్రాజెక్టు పనులు కేవలం 35 శాతం, లైనింగ్‌ పనులు 50 శాతమే జరిగాయనేది అధికారుల లెక్క. కానీ ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తగ్గిపోవడంతో నిర్మాణ పనులు ఎంతమేరకు జోరందుకుంటాయనేదీ సందేహమే!

తోటపల్లి ఆధునీకరణ అంతేనా?: తోటపల్లి ప్రాజెక్టు పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పనులు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు గత ఏడాది సెప్టెంబర్‌లో హామీ ఇచ్చారు. ఈ పనులకు రూ.253 కోట్లు అవసరం జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. ఇక తోటపల్లి ప్రాజెక్టు పనులకు, కొత్త కుడి కాలువ ఆధునీకరణ, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సుమారు రూ.175 కోట్లు అవసరం. కానీ అధికారులు కేవలం రూ.93 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.150.48 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్రం వాటా కేవలం రూ.46.41 కోట్లు మాత్రమే. మిగతా మొత్తాన్ని సత్వర సాగునీటి ప్రాయోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూర్చుకోవాల్సి ఉంది.

నారాయణపురంపై శీతకన్ను: బడ్జెట్‌ కేటాయింపుల్లో నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ ప్రస్తావనే లేదు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన దీనికి ఇంతవరకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదు. ఏటా వరదల సమయంలో నదీతీర ప్రాంతాలు ముంపునకు గురవడం, ఒక్కోసారి గట్లు గండ్లు పడటం సహజమైపోయింది. అంతేకాదు ఆనకట్ట గేట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. 118 గేట్ల పునరుద్ధరణ, ఆనకట్ట వద్ద ఆప్రాన్‌ ఎత్తు పెంచడానికి రూ.133 కోట్లు అవసరం. మరోవైపు జైకా సంస్థ సహాయానికి సంబంధించి జపాన్‌ ఇంజనీరింగ్‌ బృందం ప్రాజెక్టును పరిశీలించి వెళ్లి ఏడాది అవుతున్నా ఇప్పటికీ కొలిక్కిరాలేదు. చివరకు తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం పంపిన రూ. 2 కోట్ల ప్రతిపాదనలకు బడ్జెట్‌లో చోటు దక్కలేదు. సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,600 ఎకరాలకు, ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లోని 18,300 ఎకరాలకు సాగునీరు అందివ్వాల్సిన ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్ను వేయడంపై స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులు....: టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలంలో డాక్టరు వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008, ఏప్రిల్‌లో తలపెట్టిన ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు టెక్కలి, పలాస, మెళియాపుట్టి మండలాలకు చాలా అవసరం. 24వేల ఎకరాలకు సాగునీరు, పలాస మండలంలో 24 గ్రామాలకు తాగునీరు అందించేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు రూ.127 కోట్లను వైఎస్‌ఆర్‌ తొలిలోనే కేటాయించారు. ఆయన మరణం తర్వాత నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రెండేళ్ల క్రితం జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి ఆఫ్‌షోర్‌ పనులు పునఃప్రారంభించారు. కానీ బడ్జెట్‌ కేటాయింపుల్లో మాత్రం మొండిచేయి కనిపించింది. రూ.75 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపిస్తే రూ.10.32 కోట్లు మాత్రమే కేటాయించారు.

మడ్డువలసకు మొండిచేయి: వంగర మండల పరిధిలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ప్రతిపాదనలు పంపితే బడ్జెట్‌లో కేవలం రూ.2.80 కోట్లు మాత్రమే కేటాయించారు. 2009వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.47 కోట్లు మంజూరు చేశారు. వాటిని 2013 వరకూ ప్రభుత్వం రూ.33 కోట్లు దశలవారీగా కేటాయించింది. మిగతా రూ.14 కోట్లు రాలేదు. దీంతో ఆయకట్టు పరిధిలోని సంతకవిటి, రేగిడి, జి.సిగడాం, పొందూరు, లావేరు, రణస్థలం మండలాల్లో ఆధునీకరణ పనులు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement