‘రీ డిజైనింగ్’పై పునఃపరిశీలించాలి
వామపక్షాలు, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై పునఃపరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ప్రాజెక్టుల డిజైన్, రీడిజైన్‌తోపాటు వాటి అంచనాలు తయారుచేసే అవకాశాన్ని కాంట్రాక్టర్లకు కల్పిస్తున్న ఈపీసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. సోమవారం మగ్దూంభవన్‌లో ‘గోదావరి, కృష్ణా జలాల వినియోగం–ప్రాజెక్టుల పునరాకృతిపై పరిశీలన’ అంశంపై జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టినప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ప్రజలను చైతన్యపరిచేందుకు ఈనెల 16, 17 తేదీల్లో తమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల వరకు ప్రచారయాత్ర నిర్వహించి, మంచిర్యాలలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 10–20 తేదీల్లో జిల్లాస్థాయిల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తారు.
కాంట్రాక్టులపై విచారణ జరపాలి: కోదండరాం
ఇప్పటికే ఇచ్చిన ప్రాజెక్టుల కాంట్రాక్టులపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల ఖర్చును తగ్గించకపోతే నిర్వహణ వ్యయం పెరిగి భవిష్యత్‌లో వాటిని నడపలేరని పేర్కొన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అవినీతి రహితంగా ప్రాజెక్టులను చేపట్టాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో రూ.1.5 లక్షల కోట్ల నుంచి వ్యయం రూ.3 లక్షల కోట్లకు పెరిగిందని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, రవిచందర్(టీడీఎఫ్), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ–రాయల), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), పశ్యపద్మ (సీపీఐ), బి.చంద్రారెడ్డి, టి.సాగర్ (రైతుసంఘం), ప్రజా సంఘాల నాయకులు గురిజాల రవీందర్‌రావు, సాంబశివరావు, నైనాల గోవర్దన్, ప్రొఫెసర్లు జయధీర్ తిరుమలరావు, పీఎల్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.