పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రాజెక్టులకు అదనపు చెల్లింపులు
పెంపు అమలైతే ఖజానాపై రూ. 10 వేల కోట్ల వరకూ భారం
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ధరల పెంపు (ఎస్కలేషన్)ను అమలుచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాంట్రాక్టర్లు కోరుతున్న మేర ఎస్కలేషన్ చెల్లిస్తే... రాష్ట్రంపై సుమారు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల కోట్ల వరకూ అదనపు భారం పడుతుందని నీటి పారుదల శాఖ వర్గాల అంచనా. రాష్ట్రంలో జలయజ్ఞం కింద 33 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ కలిపి రూ. 1,11,240 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించగా... కాంట్రాక్టర్లతో రూ. 88,148 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఇందులో 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 37,935 కోట్ల మేర పనులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,751 కోట్లు కేటాయించగా... ఇప్పటివరకు రూ. 2,935.67 కోట్ల విలువైన పనులు జరిగాయి. మిగతా పనులు మార్చి నాటికి జరగాల్సి ఉంది. అయితే ప్రాజెక్టుల పనులకు అవసరమైన స్టీల్, సిమెంట్, పెట్రోల్, డీజిల్, లేబర్, ఇతర సామగ్రి ధరలు భారీగా పెరిగాయని... అందుకు అనుగుణంగా ధరల (ఎస్కలేషన్) సొమ్ము చెల్లించాలని కాంట్రాక్టర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో 2014 ఫిబ్రవరి 2న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.13ను జారీ చేసింది. దాని ప్రకారం 2013 ఏప్రిల్ నుంచి జరిగిన పనులన్నింటికి కొత్త ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలి. కానీ ఈ జీవోపై వివాదం రేగడం, కొద్దిరోజులకే రాష్ట్ర విభజన జరగడంతో అది అమల్లోకి రాలేదు. ఆ తర్వాత వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని పెండింగ్‌లో పెట్టింది.
ఏపీ నిర్ణయంతో పెరిగిన ఒత్తిడి..
ఎస్కలేషన్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావించిన కాంట్రాక్టర్లు చాలా ప్రాజెక్టుల పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఎస్కలేషన్‌పై ఏపీ సర్కారు ఇటీవల సానుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... తెలంగాణ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి ప్రభుత్వం జారీ చేసిన జీవో 13పై అధికారులు దృష్టి సారించారు. దానిని యథాతథంగా అమలు చేస్తే గత ఏడాదిన్నర కాలంగా జరిగిన పనులతో పాటు ఇక ముందు చేయాల్సిన పనులకూ అదనపు చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇలాకాకుండా ప్రాజెక్టు, ప్యాకేజీ వారీగా సమీక్షించి అదనపు చెల్లింపులను ఖరారు చేసే అంశాన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పెంచే ధరలను ఎప్పటినుంచి అమల్లోకి తీసుకురావాలనే విషయమై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రాథమిక అంచనాల మేరకు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఎస్కలేషన్ చెల్లింపులతో రూ. 20 వేల కోట్ల మేర భారం పడుతుందని తేలగా... తెలంగాణలోని ప్రాజెక్టులకు ఆ భారం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా.
ఎస్కలేషన్‌పై ప్రభుత్వ కసరత్తు!
Published Sun, Feb 8 2015 2:59 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM
Advertisement