![AP Annamayya District Accid Attack Case Latest Update News](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Annamayya-District-Accid.jpg.webp?itok=i0qDcv4B)
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.
తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్‌గా పోలీసులు ప్రకటించారు.
ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు.
ఉన్మాది దాడి ఇలా..
యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు.
యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/33_4.jpg)
బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.
దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్
ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment