
అన్నమయ్య: అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్తతో పాటు అత్తా, మామ, ఆడపడచు వేధిస్తున్నారని లలితమ్మ అనే బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా.. మండలంలోని సంపతికోట పంచాయతీ ముంతపోగులవారిపల్లికి చెందిన కోనకుంట రాయుడు కుమార్తె లలితమ్మకు కర్ణాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని గ్యాదోల్లపల్లికి చెందిన బంగారప్ప కుమారుడు క్రాంతి కుమార్‌తో నాలుగేళ్ళ కితం వివాహమైది. మూడేళ్ళ పాటు ఈ దంపతుల జీవనం సజావుగా సాగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం కాగా ఇటీవల మరో కుమార్తె జన్మనిచ్చింది.
అయితే గత ఏడాది నుంచి తనను ఏ మాత్రం పట్టించుకోకుండా మరో మహిళతో గుట్టుగా అక్రమం సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ లలితమ్మ భర్తపై నెల రోజుల క్రితం పీటీఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పట్లో పోలీసులు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. ఈ తరుణంలో తన భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు బి.కొత్తకోటలోని ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో లలితమ్మ కుటుంబ సభ్యులకు పట్టుబడ్డాడు.
తన భర్తతో పాటు ఆమె కుటుంబ సభ్యులు నిత్యం అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని, కట్టుకున్న భార్యతో పాటు పిల్లలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న అత్తామామ, ఆడ పడచుతో పాటు తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లలితమ్మ పేర్కొంది. ఈ విషయంపై ఎస్‌ఐ హరిహర ప్రసాద్ మాట్లాడుతూ లలితమ్మ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment