![Shocking incident on valentines day in annamayya district](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/cr.jpg.webp?itok=GoASZCtw)
అన్నమయ్య జిల్లాలో కదిరి టీడీపీ నేత కుమారుడి అకృత్యం
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో పైశాచిక దాడి
ఇంట్లో మాటువేసి బలవంతంగా యాసిడ్ తాగించి.. ఆపై కత్తిపోట్లు
బాధితురాలికి వారం క్రితమే మేనత్త కుమారుడితో నిశ్చితార్థం
పచ్చముఠాల బరి తెగింపు.. రెడ్‌బుక్ పాలనకిది పరాకాష్ట
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనడానికిది ప్రత్యక్ష ఉదాహరణ
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.
వేధింపులతో ఉద్యోగం మానేసి..
ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది.
పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు.
శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు.
పొలం నుంచి పరుగులు తీస్తూ..
బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.
దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్
ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతి
నిత్యం మహిళలపై దాడులు..
యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_471.png)
Comments
Please login to add a commentAdd a comment