
పెళ్లయిన మరుసటి రోజే ఉరేసుకొని నవవధువు ఆత్మహత్య
ప్రకాశం: కాళ్లకు రాసుకున్న పసుపు, పారాణి ఆరక ముందే ఓ నవవధువు పుట్టింట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని దేవనగరంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళితే..మండలంలోని చిన్నకంభం పంచాయతీ దేవనగరంలో నివాసం ఉంటున్న బిల్లా లాజర్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె బిల్లా సుస్మిత(20) అగ్రికల్చర్ పాలిటెక్నిక్ పూర్తి చేసింది. ఈ నెల 16వ తేదీన దూరపు బంధువు అయిన పెద్దారవీడు మండలం సిద్ధినాయుడుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుతో వివాహం చేశారు.
మరుసటి రోజు సోమవారం దేవనగరం గ్రామంలో సుస్మిత ఇంటి వద్ద మరుపెళ్లి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సారెపెట్టి అత్తగారింటికి అమ్మాయిని పంపించేందుకు తల్లిదండ్రులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సుశ్మిత పక్కనే ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లగా అల్లుడు వెంకటేశ్వర్లు అత్తగారి ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. మధ్యాహ్నం ఒంటి గంట దాటినా ఇంటికి రాకపోవడంతో సుస్మిత సోదరుడు భోజనం సమయం అయిందని చెల్లెల్ని పిలుచుకొని రావడానికి వారి బాబాయి ఇంటికి వెళ్లి చూడగా..అక్కడ గదిలో సుశ్మిత ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.
వెంటనే కిందకు దించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పెళ్లయిన మరుసటి రోజే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కుమార్తెను అడిగే వివాహం చేశామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇష్టం లేని వివాహం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందా..? మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment