
సోషల్ మీడియాలో కలకలం రేపిన వీఓఏ లెటర్
సింగరాయకొండ: ‘నేను డబ్బులు కాజేశానని డ్వాక్రా గ్రూఫు సభ్యుల మధ్య దోషిగా నిలబెట్టి అవమానించారు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నా ఆత్మహత్యకు టీడీపీ నాయకుడు పులి ప్రసాద్, ఏపీఎం భాగ్యలక్ష్మి కారణం. నా బిడ్డలకు న్యాయం చేయండి’ అంటూ సింగరాయకొండ మండలంలోని బింగినపల్లి గ్రామానికి చెందిన వీఓఏ జి.ఈశ్వరి పేరుతో రాసిన లెటర్ సోషల్ మీడియాలో బుధవారం హల్‌చల్ చేసింది. ఈ లేఖ గ్రామ స్థాయిలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరును బట్టబయలు చేసింది.
లేఖలో ఏముందంటే.. ‘నేను వీఓఏగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నుంచి పనిచేస్తున్నా. టీడీపీలో పులిప్రసాద్, సన్నెబోయిన మాలకొండయ్య వర్గాలున్నాయి. నేను మాలకొండయ్య వర్గం కావడంతో పులిప్రసాద్ వర్గం వారు నాపై అవినీతి ఆరోపణలు చేశారు. దానికి ఏపీఎం కూడా సహకరించి నన్ను గ్రూపు సభ్యుల మధ్య పంచాయితీలో నిలబెట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు గంగమ్మ గ్రూపు సభ్యులు బ్యాంకులో కట్టేందుకు అప్పుడప్పుడు డబ్బు ఇస్తుంటారు.
కానీ వారు ఎక్కువగా మా చిన్నత్త పి.ప్రభావతికే డబ్బు ఇస్తారు. 16 నెలలుగా ఆమె వాయిదాలు కట్టకపోతే నేను ఎలా బాధ్యురాలిని అవుతా. టీడీపీలో గ్రూపు విభేదాల వల్ల ప్రసాద్ వర్గానికి చెందిన గ్రూపు సభ్యులు ముగ్గురు నాతో గొడవకు దిగారు’ అని వీఏఓ ఆరోపించింది. దీనిపై ఏపీఎంను వివరణ కోరగా.. ‘వీఓఏ ఈశ్వరి సుమారు రూ.7.85 లక్షలు వాడుకుందని గంగమ్మ గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేయడంతో గ్రామానికి వెళ్లా. అప్పటికే ఆమె తన ఇంట్లో మంచంపై పడుకుని సెలైన్ కట్టించుకుని ఉంది. నాతో బాగానే మాట్లాడింద’ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment